కథలు రాసేప్పుడు కానీ, ఎవరన్నా పిల్లలకు మంచి పేర్లు సూచించమన్నప్పుడు కానీ ఎంత వెతుకులాటో, అలాంటప్పుడు మన మూలస్థంభాల్లాంటి ప్రాచీన సాహిత్యం తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నెన్ని పేర్లుపెట్టారు రామాయణ భారతాల్లో, అది కేవలం సాహిత్యమే అనుకున్నా సరే కౌరవులు వందమంది అయితే అందరికీ పేరు పెట్టిన రచయితకు మెప్పుకోళ్ళు, అది చారిత్రక సత్యం అయితే అప్పటి నాగరికత సంస్కృతికి వందనం. ఇలా పేర్ల ముచ్చటే చెప్పినా అదొక వ్యాసం అవుతుంది. ఇప్పటి సంగతేంటంటే
ఒక పేరు అదే అర్ధంతో వేర్వేరు ఖండాల్లో ఎలావుంటుంది? ఎలా ప్రయాణించి వుంటుంది అన్నదే.
ఇంగ్లీషులో బార్బేరియన్ అనే మాట వుంది. నాగరికంగా వుండటానికి వ్యతిరేఖార్దం అన్నమాట, దీన్ని క్రియా పదంగా బార్బేరియస్ అని కూడా వాడతారు. అటువంటి పేరుతో మహాభారత కథలో ఒక పాత్ర కూడా వుంది అతని పేరు బర్బరీకుడు.
a person who has no experience of the habits and culture of modern life, and whose behavior you therefore consider strange or offensive:
ఈ పదానికి మూలం గ్రీకు భాషలోని వినయానికి వ్యతిరేఖ పదమైన బార్బేరియన్ అనే పదం అంటారు. దాదాపు అన్ని ఖండాల్లోనూ ఇదే అర్ధాన్నిచ్చే ఇటువంటి పదం కనిపిస్తుంది. బైబిల్ లో కూడా అటువంటి ఒక పేరు (Ransom of Christian slaves held in Barbary) వస్తుంది. Acropolis Museum మ్యూజియం లోని ఒక రాజు తలను బార్బేరియన్ హెడ్ గా భావిస్తారు. 4వ శతాబ్దానికి చెందిన మధ్యఆసియా తూర్పు యూరప్ ప్రాంతాల్లోని హన్స్ అనే ఆటవిక తెగను కూడా బార్బేరియన్లు అని పిలిచేవారు. ఎందుకీ ఉదాహరణలన్నీ చెపుతున్నానంటే నాగరికులు కానీ మొండిఘటాలనైన ఆటవిక తెగల వారికి ఈ బార్బేరియన్ అనేపేరు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు కాలాల్లోనూ, వేర్వేరు ఖండాల్లోనూ వుంది.
ఇక భారతంలో ఇదే పేరుతో వున్న ఒక పాత్ర దాని లక్షణాలు పరిచయం చేస్తాను. వ్యాస మహా భారతంలో ఈ కథ ప్రస్తావన లేదని ప్రక్షిప్తమనీ చెప్తారు. కానీ స్కాంధ పురాణంలోని మహేశ్వర ఖండంలో ఈ వివరణ వుందట.
మహాభారతంలోని పాండవ మధ్యముడు భీముడు లక్కాగృహ దహనం తర్వాత అడవిలో హిడింబి అనే ఆటవిక యువతిని వివాహం చేసుకుంటాడు. వారికి ఘటోత్కచుడు అనే కొడుకు పుడతాడు. ఈ ఘటోత్కచుడు ఒక యాదవరాజు మారుటి బిడ్డ మౌర్వి (ఈమెకే అహిలావతి అని మరో పేరు) ని పెళ్లి చేసుకుంటాడు. మౌర్వి వాళ్ళు నాగవంశానికి చెందిన వారట ఇప్పటి ఆంధ్రులు మహాభారత యుద్ధంలో పాండవుల తరపున పోరాడిన వారు. వాళ్ళ కొడుకే బర్బరీకుడు. అంటే భీముడికి మనవడి వరస అవుతాడన్నమాట. బాహుబలి పుట్టగానే అతని చేతిపట్టు చూసి శివగామి దేవి ఆ పేరు పెట్టినట్లు, నల్లటి శరీరం, గుండ్రని తల దానిపై ఉంగరాల జుట్టు (బర్బర) చూడగానే అతనికి బర్బరీకుడు అని పేరు పెట్టారట. అతను శ్రీ కృష్ణుడి ఉపదేశంతో మహీసాగర సంగమంలో గుప్తక్షేత్రం వద్ద నవదుర్గ ఉపాసన చేసి కొన్ని ప్రత్యేక విద్యలు సాధించాడట. అందులో ముఖ్యమైనవి మూడు బాణాలు అందుకే ఇతన్ని త్రిభాణ ధారి అంటారట.
.......
మహా భారత యుద్ధం మొదలవడానికి ముందు బర్బరీకుడు కూడా వాళ్ల అమ్మ ఆదేశం మేరకు యుద్ధంలో సహాయం చేసేందుకు వస్తాడు. శ్రీకృష్ణుడు యోధులను సమావేశ పరచి మీ అంచనా ప్రకారం యుద్దం ఎన్నాళ్ళలో ముగుస్తుంది అనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు 20అని అర్జునుడు 28 అని ఇలా వారి వారి అంచనాల ప్రకారం కౌరవ 11 అక్షౌహిణులు, పాండవుల 7 అక్షౌహిణులు మొత్తం 18 అక్షౌహిణుల యుద్దం ఎన్నాళ్ళు జరుగేఅవకాశం వుందో చెపుతున్నారు. బర్బరీకుడు ఆ సమయంలో ముసిముసిగా నవ్వడం గమనించిన శ్రీకృష్ణడు ఆ సాయంత్రం విడిగా అతన్ని కలుస్తాడు. బర్బరీకా నీ అంచనా ప్రకారం యుద్ధం ఎన్నాళ్ళలో ముగుస్తుంది అని అడిగితే ఆశ్చర్య పోయేలా బర్బరీకుడు సమాధానం ఇస్తాడు ‘‘ కేవలం ఒకరోజులోముగుస్తుంది ’’ అంటూ అదెలా అని అడిగిన కృష్ణుడికి అప్పుడు తన బాణాల గురించి చెపుతాడు. ఒక బాణం ఎవరెవర్ని హతం చేయాలో మార్కో చేస్తుందట, రెండవది మిత్రపక్షానికి కావలిగా వుంటుంది.మూడవది మార్క్ చేసిన ప్రతి శత్రువుని సంహరించుకుంటూ మొత్తం మార్కింగ్స్ పూర్తి అయిన తర్వాతనే సెల్ప్ గైడెడ్ జిపియస్ మిస్సైల్ లాగా బర్బరీకుడి దగ్గరకు తిరిగివస్తుంది. ఏది వాటి శక్తి చూపించేందుకు రావిచెట్టులోని ప్రతి ఆకునీ చేదించమని నీ బాణాలకు చెప్పు అంటూ తన ఆధ్వర్యంలో ఎవరినన్నా దాచగలనా అనేది పరిశీలించడానికి ఒక ఆకును తన కాలి క్రింద తొక్కి పెడతాడు కృష్ణుడు కానీ ఆ బాణం చెట్టుపై మార్క్ చేసిన అన్ని రావి ఆకులను పూర్తిగా తెంపేసి వచ్చి కృష్ణుడి పాదం దగ్గర తిరుగుతూ వుంటుంది. కృష్ణా మీ కాలిని ఆ రావి ఆకుపై తొలగించండి లేదంటే పాదాన్ని చీల్చుకుంటూ వెళ్ళి అయినా తన లక్ష్యం పూర్తి చేస్తుంది అని బర్బరీకుడు చెప్తాడు. అంతటితో బర్బరీకుడి శక్తి సామర్ధాలు అతని అస్త్రాల శక్తి అర్ధం అవుతుంది.
మరి నువ్వు ఎవరి తరపున యుద్దం చేయాలనుకుంటున్నావు అని అతన్ని అడుగుతాడు. వాళ్ల అమ్మ ఆదేశం ప్రకారం బలహీనుల పక్షాన తనుయుద్దం చేయదలచుకున్నాను అని చెప్తాడు. న్యాయం తరపున అని చప్తే బావుండేది కదా అని కృష్ణుడు అనుకుంటూ మరి వీరిలో ఎవరు బలహీనులు అంటాడు. తక్కువ అక్షౌహిణులు వున్న పాండవులు కదా బలహీనులు అని బర్బరీకుడు చెప్తాడు. మరి నువ్వు వీరి పక్షాన చేరగానే నీ బాణం వాడగానే వీరు బలవంతులు శత్రువులు బలహీనులు అవుతారుకదా అంటాడు. వెంటనే ఆలోచించకుండా అయితే అప్పుడు వారి వైపు నిలబడి పొరాడుతాను అంటాడితడు. అంటే ఈ ఒక్క బర్బరీకుడు అటూ ఇటూ నిలబడి రెండువైపులా వున్న అందర్నీ తుదముట్టించే అవకాశం వుందన కృష్ణుడికి అర్ధం అయ్యింది. ఒకవేళ తనే స్వయంగా తలచుకుని పాండవుల వరకూ దాద్దామనుకున్నా అది సాధ్యం అయ్యే పని కాదని కూడా తెలుస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బర్బరీకుడి తలను తను దక్షిణగా తీసుకుంటాడు. కానీ బర్బరీకుడు తనకు యుద్దం చూడాలని వుంది అని చెప్పడంతో యుద్దం మొత్తం కనిపించేలా ఒక ఎత్తైన ప్రదేశంలో ఆ తలను ఉంచుతాడట. శివగామి దేవిలాగా మొత్తం యుద్ధాన్ని ఈ తల చూస్తూ వుంటుంది.
మొత్తం యుద్దం ముగిసాక ఎవరెవరు తమ తమ యుద్ధం బాగా చేసారు అని కృష్ణుడిని అడుగుతారు. తను కూడా రథసారధ్యంలో వుండటంతో మొత్తం యుద్దం చూడలేదని అలా చూసిన ఒకరు మీకు ఆ వివరం చెపుతారని బర్బరీకుని తల దగ్గరకు పాండవయోధులందరితో కలిసి వెళ్తారు. అదే ప్రశ్న అడిగితే బర్బరీకుడు ఆశ్చర్యకరమైన సమాధానం చెప్తాడు. యుద్ధం జరిగినంత సేపూ ఒక చక్రం యుధ్ధం అంతా కలియదిరుగుతూ శత్రువులను హతంచేస్తోంది నాకు అదే కనిపించింది అని చెప్తాడు. గీతోపదేశంలో చెప్పినట్లు చేసేది ఎవరైనా చేయించిన వాడెవరో వారికి తెలుస్తుంది అంటారు. కలియుగం ప్రారంభం వరకూ అలా జీవంతోనే వుండమని బర్బరీకుడి తలకు వరమిచ్చి అక్కడ్నుంచి కదులుతారు.
.......
దేశంలో వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో
రాజస్తాన్ లో జైపూర్ కు 80 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం పేరు ఖాటు పదవ శతాబ్దంలో ఒకరోజు చిత్రంగా ఒక ఆవు ఒక పుట్టలాంటి చోట నిలబడి దానంతట అదే పాలు ఇస్తోందట. ఇక్కదేదో చిత్రం వున్నదనుకున్న గ్రామస్తులు అక్కడ తవ్వి చూస్తే సాలిగ్రామ రూపంలోని ఒక తల కనిపించిందట . అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన తల ఇదే అని దాని శ్యాంబాబా అని ఖటు అనే ఉర్లో దొరికింది కాబట్టి ఖటు శ్యాంబాబా అని శిరస్సు కనిపించిన చోటుని శ్యాంకుండ్*గా పిలుస్తూ కొలవడం ప్రారంభించారు. ఆ ప్రాంతాన్ని ఏలే రూప్ సింగ్ చౌహాన్ అనే రాజు తన కలలో కనిపించిన ఆదేశాల మేరకు క్రీ.శ 1027 లో ఒక ఆలయం నిర్మించాడట. తర్వాతి కాలంలో మార్పులు చేర్పులకు లోనవుతూ ఇప్పటికీ ఆ ఆలయం ఖటు గ్రామంలో వుంది.
నేపాల్ లో ఇతడిని కిరాట రాజు యాలంబర్ అంటూ కొలుస్తారట.ఖట్మండూ వేలీలో ఆకాశ్ భైరవ్ పేరుతోనూ హిమాచల్ ప్రదేశ్ లో కమన్ నాగ్ దేవుని పేరుతోనూ కొలుస్తారట.(ఇతడి పేరులోని నాగ్ అనేది అతని తల్లి నాగవంశానికి చెందనదిగా సూచిస్తోందనుకావాలేమో?) తలను దానం చేసిన వాడు కాబట్టి శీర్షకేదాని అని, బలహీనుల పక్షపాతి అనే ఉద్దేశ్యతో హరే కా సహారా అని, త్రీభాణ ధారి లేదా తీన్ బాణ్ ధారి అనేది మనిషి మూడు తాపాలను(తాపత్రయం) మోస్తున్నవాడు అనే అర్ధంలోనూ, మహాధాత అనే అర్ధంలో లఖా దతారి అని, అతని నీలి రంగు అశ్వం పేరు నీలా లేదా లీలా అందుకే లీలా కే అశ్వర్ (నీలాశ్వికుడు) అని, ఖటు పాలకుడు అనే అర్ధంలో ఖటు నరేశ్ అని, కలియుగావతారి అని, శ్యాంప్యారే అని, అహ్మదాబాద్ గుజరాత్ ప్రాంతాల్లో బలియా దేవ్ అంటే బలవంతుడైన దేవుడు అని, మయూర ఫింఛధారి అనే అర్దంలో మోరే ఛాదీ ధారక్ అని, హిమాచల్ ప్రదేశ్ లోని కమ్రునాగ్ మండిలో వర్షపు దేవుడు బారిష్ కే దేవ్తా అని, యలంబర్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇందులో చాలా పేర్లు భారతంలోని వివిధ పాత్రలు తమకి ఆపాదించుకున్నట్లు అనిపిస్తుంది. నెమలిఫించ ధారి కావచ్చు, దాన గుణం కావచ్చు నీలమేఘశ్యామ వర్ణం కావచ్చు
కాచిగూడలో శ్యాబాబాగా
ఇక పోతే మన హైదరాబాద్ లోనూ కాచిగూడా దగ్గర శ్యాంబాబా ఆలయం వుంది ఇది కంచికామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది.
మూలమహాభారతంలో లేని పాత్ర దేశంలో ఇలా ప్రముఖంగా పూజలు అందుకోవడం ఒక ప్రత్యేకత అయితే, ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఈ లక్షణాలు అదే అర్ధంలో వాడటం మరొ ప్రత్యేకత.
మొన్నీమధ్య బ్లర్బ్స ఎక్కువ రాస్తుంటారు కాబట్టి తను బ్లర్బరీకుడిని అయ్యాను అంటూ ఒక పుస్తక పరిచయంలో Prasen Bellamkondaగారు కాయిన్ చేసిన మాట పట్టుకుని వివరాలు వెతుకుతుంటే కొన్ని విశేషాలు చిత్రంగా అనిపించాయి అందుకే మీతో ఇలా పంచుకుంటున్నాను. కాబట్టి దీన్ని కథగానే చూడగలరని మనవి.
అక్షౌహిణి అంటే ఎంత?
ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' గణానికి మూడు రెట్లు ‘వాహిని'. వాహినికి మూడు రెట్లు ‘పౄతన'.పౄతనకు మూడు రెట్లు ‘చమువు' చముకు మూడు రెట్లు ‘అనీకిని'. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి