జాలిగాయం

జాలిగాయం || కట్టా శ్రీనివాస్ ||

కన్నీళ్లు జాలువారుతున్న వేళ
ఆదుర్దాగా వాళ్లంతా వచ్చి
మూతి గుడ్డలిస్తూ
ఫోటోలు తీసుకుపోయారు.

గుండె బరువెక్కి మనసంతా
చీకటయిన తావుల్లో
దొడ్డ బియ్యం సంచి దిమ్మరించి వెళ్లారు.
కటికచీకటి గొంతు నొక్కుతుందంటే
కూరగాయల బుట్టోకటి చేతబెట్టారు.
మాట్లాడదామనుకునే లోగా
ప్రెస్ నోట్ల వరదల్లో జారీ పోయారు.


మనసుకేమీ శానిటైజర్లు లేవా?
ఎడారి వీధుల్లో మృదువైన మాటలపూలు వికసించవా??

కరోనా చంపుతుందన్న భయం కంటే
దూరం పెంచుతుందన్న నిజం వణికిస్తోంది.
మనిషి బ్రతికుండటానికి కడుపు మాత్రం నిండితే చాలదేమో!
ప్రపంచాన్ని గడ్డకట్టించిన స్తబ్దత మంచుని
బద్దలు కొట్టే వాక్సిన్ మనమే కనిపెట్టాలేమో!

05-05-2020






కామెంట్‌లు