పేరంటాలపల్లి వెళ్ళినప్పుడు చూసాను అక్కడి గిరిజన మహిళలు ఒక్క వెదురు రకం తోనే డజన్ల కొద్దీ రకాల బొమ్మలు చేసి
పొట్టపోసుకుంటున్నారు. బాలనందస్వామి హైమండర్ఫ్ వంటి వారు చెమ్మ వుండే చోట వేగంగా పెరిగే వెదురుని ఇలా కొంచెం నైపుణ్యంతో జీవనాధారంగా చేసుకునే సూచనలు చేశారట.
అయినా పల్లెల జీవనంలో వెదురు ఒక భాగం, వెదురు బుట్టలు, గంపలు, చిక్కాలు, కుర్చీలు బల్లలు, తడికలు, పైకప్పు, మంచే ఇలా ఒకటేమిటి అనేకానేక రూపాల్లో వెదురు కనిపిస్తుంది. లావుపాటి వెదురు బొంగు గొట్టాలు నీళ్ల నిల్వ, తాడి చెట్ల కల్లు ముంతలుగా వాడతారు. ఇప్పుడు బొంగులో చికెన్ నాగరిక నోటి నూతన రుచి కూడా.పుట్టినపðడు ఉయ్యాల దగ్గరనుంచి, చివరి ఏడు కట్ల సవారీ వరకు ప్రతిదశ లోనూ జీవననేస్తాం వెదురు.
భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో వెదురుని బాన్‌సులోచన్ అంటారు. దీనినే తబషిర్ అని, తవషిర్ అని యునానీ వైద్య విధానాల్లో వినియోగిస్తూవుంటారు. దీనినే ఆంగ్లంలో బాంబూ మన్నా అంటారు.చైనీయులు ఈ వెదురుని అంటువ్యాధులు నిర్మూలించే ఔషధంగా వినియో గిస్తారు.
పన్నెండు ఏళ్లకు ఒక సారి వెదురు బియ్యం రావడం వెనక కారణాలు తెలియదు కానీ గోధుమ బియ్యం లా వుండే వాటిని ఆహారంగా వాడటం తెలిసిన సంగతి. ముళ్ళరకం బంబూసా అరుండానేషియా అనే రకం వెదురు 50 లేక 60 సంవత్సరాలకాలంలో ఒకే సారి పూస్తుంది. వెదురు చిగుర్లు (చిగురాకులు) కూరకి నిల్వ పచ్చడి వాడతారు. వెదురు గింజల నుంచి కూడా కల్లు గీస్తారు. గింజ పిండి తో రొట్టెలు చేస్తారు. వెదురులో 75 జాతులు, వెయ్యికి పైగా రకాలు ఉన్నాయి. పెద్ద రాకాసిరకం వెదురు ముప్పై ఐదు మీటర్ల నుండి పద్దెనిమిది సెంటీమీటర్ల వరకూ లావుగా పెరుగుతుంది. శీతల ప్రదేశములలో పెరిగే వెదురు త్వరగా దట్టమై చిక్కటి అడవిలా మారుతాయి. వీటిలో పోతు వెదురు, పెంటి వెదురు, కాకి వెదురు, బొంగు వెదురు, వెదురు కంప జిట్ట, అంటూ గిరిజన ప్రాంతాలలో వెదురులోని రకాలను వేర్వేరుగా గుర్తిస్తారు.
వేటలో దూరంగా ఉండి ఆయుధం ప్రయోగించేందుకు, ఉండేలు కంటే బలంగా ఉపయోగ పడ్డ విల్లు బాణాలు వెదురు జన్యాలే.
వెదురు పొదలగుండా వీచే గాలి శబ్దాన్ని విన్న ఏ పసుల కాపరి కృష్ణయ్య కనిపెట్టాడో వేణువుని కానీ డిజి, క్సియో, శకువాచి, పలెన్‌డగ్, జింగు, అంక్లుంగ్, అనే పేర్లతో ప్రపంచం అంతా తన గానం వినిపిస్తోంది.
మరో సంగతి వియత్నం దేశపు జాతీయ వృక్షం గా గౌరవం అందుకుంటోంది Bambusa ventricosa.
ఆరవ విడత హరిత హరం శుభాకాంక్షలతో.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి