అరుదైన మూషిక జింక కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో
#Mousedeer,
దండకారణ్యం
అడవుల్లో తిరుగుతున్నప్పుడే సీతమ్మకు బంగారుజింక కనిపిస్తేనే రామాయణం కథంతా
మలుపుతిరుగుతుంది. బట్టమేక అనే పిట్ట ఒక్కటే రోళ్ళపాడు దగ్గర కనిపించి తెలుగుగంగ
ప్రాజెక్టును మలుపులు తిప్పింది. నేల,నీరు నింగి అంతా మనిషే ఆక్రమించేస్తుంటే చాలా
జీవులు బ్రతికే చోటులేక అంతరించి పోతున్నాయి వాటిని జీవనానికి అనువైన ఆవాసాలే లేక
బిక్కుబిక్కుమంటూ మిగిలివున్న జీవరాసులు మరికొన్ని, ఒకవేళ మనిషి కాపాడాలనుకున్నా
వాటికి కృత్రిమంగా తయారుచేసిన మానవ నిర్మిత ఆవాసాలే కానీ సహజమైన జీవావరణం లభించని
స్థితి.
మన ప్రాంతాల్లో
మూషిక జింక కనిపించిందహో....
ఖమ్మంజిల్లా,
సత్తుపల్లి దగ్గరలోని కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో నిన్న మంగళవారం నాడు
సింగరేణికార్మికులకు ఈ ఎలుకలాంటి చిన్నపరిమాణంలోని జింక కనిపించింది. ఇదే అటవీ
ప్రాంతంతో గతంలో నేను, కె.పాండురంగారావుగారితో కలిసి వృక్షశిలాజాలను గమనించిన
చోటు. జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గుగనులకు దగ్గరలో వున్న చిత్తడినేలల
అటవీప్రాంతం ఇది. సత్తుపల్లిలోని యన్టీఆర్ కాలనీలో నివసించే ఓపెన్ కాస్ట్
ట్రిప్పర్ డ్రైవర్ ఈ జింకపిల్లను సేకరించి
రక్షణ కల్పించి ఆ తర్వాత అటవీ అధికారులకు అందజేసారు. రేంజర్ వెంకటేశ్వర్లు
ఆదేశాలతో ఈ మూషిక జింకను పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యానికి తరలించారు.
తెలుగువాళ్ల
గమనింపే వేరబ్బా
మూషిక జింకలను
ఆంగ్లంలో మౌస్ డీర్ అంటారు శాస్త్రీయంగా చెవ్రోటైన్ అని పిలుస్తారు. ఈ చెవ్రోటైన్
అనే పదం కథ కూడా తమాషాగా వుంటుంది. ప్రాచీన ప్రెంచ్ అర్దం చెవ్రోట్ అంటే పిల్లగాడు
అని అదే మధ్య ప్రెంచ్ ప్రకారం చావ్రే అంటే మేక అనే అర్ధంలోనుంచి ఇది ఉద్భవించింది.
కొన్ని తెలుగు ప్రాంతాలలో దీన్ని జరినిపంది అని పిలుస్తారు. ఎందుకిలా
చెపుతున్నానంటే తెలుగుప్రాంతాలలో జీవిని పరిశీలించే విధానం ఎంత లోతుగా వుంటుందో
అని చెప్పడం కోసమే. కన్నడలో బార్కా అని,
మళయాళంలో ఖూరాన్ అన్నా, కొంకణీలో బారింకా అన్నా, తమిళంలో సలీగ్ సలాకుమా అన్నా,
సింహళంలో మీమిన్నా అన్నప్పటికీ వాటి అర్ధం సుమారుగా ఎలుక జింకా అనే అంటే ఇది
జింకనే కానీ ఎలుకలాగా చిన్న పరిమాణంలో వుంది అని ఆయా భాషల్లోని అర్ధం సూచిస్తుంది
కానీ తెలుగులో మాత్రం కొన్న విషయాల్లో దీనికి వున్న పందిలక్షణాలను కూడా స్పష్టంగా
గమనించారని తెలుస్తోంది.
వీటి ఉనికి
ప్రత్యేకం
ఈ భూమ్మీద వీటి
ఉనికి చాలా ప్రాచీనమైనదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 3.4 కోట్ల సంవత్సరాల క్రితం
నాటి ఒలిగోసిన్ కాలం నుంచి 50 లక్షల సంవత్సరాల మియోసిన్ కాలం వరకూ ఇటువంటి జీవులు
విస్తృతంగా జీవించాయట. గడ్డిభూముల్లో ఉపయోగకరమైన ఆదిమ ప్రకాశవంతమైన దేహం వీటి
స్వంతం. ఇప్పటికీ వీటి రూపురేఖల్లో మార్పులు ఏర్పడలేదు. అందుకే దీన్ని సజీవ
శిలాజంగా పరిగణిస్తారు. ఆ రకంగా జీవశాస్త్రంలో దీని ఉనికికి ప్రాముఖ్యత వుంది.
అంతేకాదు దీని జీర్ణాశయం కూడా ప్రత్యేకమైనది సాధారణంగా కఠినమైన పైపొరవుండే
గడ్డిజాతి మొక్కలను కరిగించి పులియబెట్టి జీర్ణంచేసుకోవడం కోసం నాలుగు గదుల
జీర్ణాశయ వ్యవస్థ వుంటుంది కానీ ఈ మూషిక జింకలో ప్రత్యేకంగా కేవలం మూడుగడుల
జీర్ణాశయం వుంటుంది. అయితే ఇవి కేవలం శాఖాహారం మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ
కీటకాలు, పీతలు, చేపలు వంటి జీవులనుకూడా తినడం మరో ప్రత్యేకత. ఇటువంటి
ప్రత్యేకలక్షణం వల్లనే కావచ్చు మిగిలిన శాఖాహార జీవుల మాదిరి పైదవడలో కొరికే పళ్ళు
(అప్పర్ ఇన్ సిజర్స్) వుండవు. అందుకే వీటినోరు జింకల నోటి మాదిరిగా కంటే
పందికొక్కులు, పందుల నోటి దంతవిన్యాసాలను పోలినట్లు వుంటుంది. జింకల్లాగా కొమ్మలు
కూడా వీటిలోని మగ మూషికజింకలకు గానీ ఆడ మూషిక జింకలకు కానీ వుండవు. చిన్న
తుప్పల్లో వేగంగా దూకుతూ కదిలివెళ్లేలాగా కంగారూల కాళ్లు ఏర్పడినట్లే దీనిలో కూడా
వెనకకాళ్ల కంటే ముందు కాళ్లు పొట్టిగా వుండి ఊపుతో అడ్డంకుల అదాటున దుమికేందుకు
తోడ్పడతాయి. నిజానికి ఈ చెవ్రోటైన్లు ప్రపంచంలోనే అతిచిన్న దుమికే క్షీరదాలు. ఇవి
కేవలం ముప్పావు కిలో నుంచి ఎనిమిది కిలోలవరకూ మాత్రమే బరువు వుంటాయి. కాలివేళ్లు ముందుకు రెండు వుండి వెనక చిన్నవి
రెండు వుంటాయి. ఈ నిర్మాణం కూడా జింకలకంటే పందులలోని కాలివేళ్లకే పోలికలతో
వుంటాయి. రెండడుగుల పొడవు దేహం వున్నా కేవలం అంగుళమాత్రపు తోక వుంటుంది.
వీటి సంఖ్య పెద్దగా
పెరగకపోవడానికి మరోకారణం ఒక ఈతకు కేవలం ఒక్కజీవికి మాత్రమే జన్మనిస్తాయి. ఇవి
రాత్రిపూట మాత్రమే తిరిగే నిశాచర జీవులు.
ఇన్ ప్రార్టర్
ట్రాంగులీనాలో అంతరించిపోయిన అనేక జాతుల తర్వాత మిగిలినవి ఇవి. నిజానికి 1990లో వీటి జాతి లేదనే
అనుకున్నారు కానీ 2019 నవంబరులో పర్యావరణ శాస్త్రవేత్తలు వియాత్నాం అడవుల్లో
వీటిని ఉనికిని నిర్ధారించారు. ఆ తర్వాత మరికొన్ని చోట్ల ఇవి కనిపించాయి.
కొన్ని ఏళ్ళ క్రింతం నుంచి కిన్నెరసారి అభయారణ్యంలో పెంచుతున్న ఈ మూషికజింకలను దేశంలోని వేర్వేరు చోట్లకు తరలించారు. సూరత్ లోని రాజ్ కోట్ జూపార్కు, చెన్నయ్, మంగుళూరు జంతప్రదర్శన శాలలు, చత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ కోల్ కతా లోని అలీపూర్ జూ పార్కుల్లోనూ కిన్నెరసాని జూ పార్కులో పురుడుపోసుకున్న మూషిక జింకలే పరుగులు తీస్తున్నాయి. గత అగష్టులో కర్నూలు జిల్లా రుద్రవరం అటవీ రేంజ్ లో ఈ మూషిక జింకలు ట్రాప్ కెమేరాల్లో కనిపించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు మృగయని నేషనల్ పార్కులోనూ మూషిక జింకలను పునరుత్పత్తి కోసం రెండు మగ, నాలుగు ఆడ ఎలుక జింకలతో ప్రత్యేక ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేసారు. 2010లోనే నెహ్రూ జూపార్క్ లో న్యూఢిల్లీ సెంట్రల్ జూ అథారిటీ నుంచి తీసుకువచ్చిన జింక పిల్లలతో పునరుత్పత్తి ప్రక్రియలు ప్రారంభించారు.
చిక్కని (దొరకని)-చిక్కని{చిక్కులు (ప్రాబ్లమ్స్)}-చిక్కని (concentrated) చిన్నది చిక్కితే దానిపై చక్కగా చైత్రానికి ముందే చిత్రంగా చెక్కారు చెప్మా ....
రిప్లయితొలగించండి