పెరుమాండ్ల సంకీస గ్రామసందర్శన

 


మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాండ్ల సంకీస గ్రామం గురించి కొన్ని ముచ్చట్లు. ఈరోజు గ్రామాన్ని సందర్శించాం. ఊర్లోకి వెళుతుంటేనే అడుగడుగునా ఇక్కడ కనిపించేది విప్లవ స్మారక స్థూపాలు. ఎందుకంటే రజాకార్లపై వీరోచితంగా పోరాడిన ప్రత్యేక గాధ ఈ ఊరిస్వంతం మరి. భూమికోసం, భుక్తికోసమే కాదు వెట్టిచాకిరీ విముక్తికోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేఖంగా పోరాడిన వీరయోధుల గడ్డ ఇది. 1948 సెప్టెంబర్ 17న రజాకార్ల పాలన అంతమయ్యిందని చదువుకుంటాం దానికి పక్షం రోజుల ముందు ఈ గ్రామంలో ఏం జరిగిందో వింటే గుండెల్లో జల్లుమంటుంది.

1948 సెప్టెంబర్ 1 వ తారీఖు రజాకార్లు రాజ్యమేలుతున్న కాలం

పెరుమాండ్ల సంకీస గ్రామంలో ఆ రోజు 21 మందిని బ్రతికుండగానే గడ్డివాముదగ్గర కట్టేసిన రజాకార్లు వాటికి మంటలు పెట్టి హాహాకారాలు చేస్తున్న వీరులను వెక్కిరిస్తూ మంటలు పెట్టారు. ఊరివారు భయంతో బిక్కచచ్చిపోయి ఇకమీదట తిరుగుబాటు అనే మాట ఎత్తకూడదనే క్రూర ఎత్తుగడ వేసారు. కానీ దుస్సంఘటనతో గ్రామం మరింతగా ఉక్కుపిడికిలి బిగించి విజయమో వీరస్వర్గమో అనుకుంటూ మరింత గట్టి పోరాటాన్నిచేసి దేశం దృష్టిని సైతం ఆకర్షించింది.

తుమ్మా శేషయ్య నాయకత్వంలో మూడు దళాలుగా మారి ఆయుధాలను చేతబట్టి గెరిల్లా పోరాటాలను చేసారు. పన్నుల నిరాకరణోద్యమానికి నడుం బిగించారు. ఇందులో భాగంగానే భూస్వాముల ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలకు పంపిణీ చేసే కార్యాచరణను రూపొందించి ఆచరించారు. ఇదే సమయంలో ''ప్రాంతీయ ఆంధ్రమహాసభ '' సంకీస గ్రామ పెద్దచెరువు సమీపంలో జరిగింది. ఈ మహాసభలో మంచికంటి రామకిషన్‌, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నంద్యాల శ్రీనివాసరెడ్డి లాంటి ఉద్దండులు పాల్గొని ఉద్యమ తీరుతెన్నుల గురించి విశ్లేషించుకునే సమయాన, రజాకార్లు మహాసభపై విరుచుకుపడ్డారు. అందుకు ప్రతి దాడి చేసిన ఉద్యమకారులు ఇద్దరు రజాకార్లను మట్టుబెట్టారు.
ఉద్యమాన్ని అణచడానికి దారుణ మారణహోమం
మూడు సార్లు గ్రామంపై దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టు చావబాదారు. అడ్డు వచ్చిన ఆడవాళ్లను హించించి మానభంగం చేశారు. ఉద్యమాన్ని అణచివేయాలంటే తుమ్మ శేషయ్యను అంతమొందించాలని రజాకార్లు శేషయ్య ఆచూకీ తెలపాలని 1948 సెప్టెంబరు 1వ తేదీన 200 మంది పోలీసులతో కలిసి పెరుమాండ్ల సంకీస గ్రామంపై ముప్పేట దాడి చేశారు. దొరికిన మగవారందరిని చేతులు కట్టేసి బూటుకాళ్లతో తన్నారు. అయినా శేషయ్య జాడకాని, దళం జాడ కాని చెప్పించలేక పోయారు. ఆ కోపంతో బందెలదొడ్డి ప్రాంతంలో ఉన్న గడ్డి వాము దగ్గర కాల్పులు జరిపి, కొన ఊపిరితో ఉన్నవారితో సహా మొత్తం 21 మందిని సజీవదహనం చేశారు. ఇందులో తేరాల రామయ్య, తేరాల మల్లయ్య, బుట్టి పిచ్చయ్య, శెట్టి పెదనర్సయ్య, శెట్టి రామయ్య, శెట్టి వెంకటనర్సయ్య, దండు ముత్తయ్య, కూరపాడు సత్తెయ్య, కాసం లక్ష్మీనర్సయ్య, మోటమర్రి పట్టయ్య, గండు ముత్తయ్య తదితరులు అమరులయ్యారు.

పోరాట యోధుల స్మృతి చిహ్నంగా పెరుమాండ్ల సంకీస గ్రామ పంచాయతీ ఆవరణలో 1994లో స్మారక స్థూపాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న అమరులను స్మరించుకుంటున్నారు. ఆ తరువాత ఉద్యమ నాయకుడు తుమ్మ శేషయ్య కొంతకాలం తరువాత నర్సంపేట ప్రాంతానికి వలసవెళ్లి 1967 -68 ప్రాంతంలో అస్వస్థతకు లోనై మరణించారు. ఇది స్వాతంత్రానికి సంవత్సరం తర్వాతి కథ మరింత ముందు నాటి నుంచి ఈ గ్రామం చారిత్రక ఆధారాలను ప్రోగుచేసుకుంటే

ఆదిమానవుడి జాడల ఊసులు చెప్పే ఆవకాశం వున్న స్వయంభూ నరసింహస్వామి గుట్ట

ఊరికి వెలుపల వున్న నరసింహస్వామి గుట్ట దానిలోని నీటి తావులు ఒకప్పుడు పురామానవునికి ఆశ్రయం ఇచ్చాయా అనిపించేలా వుంటాయి. ఊరిచెరువు గట్టుపై వున్న హనుమాన్ విగ్రహం దగ్గరి రాతిపై ఒక పాదముద్ర చెరువు అటువైపు బలపాల గ్రామపు కొండపై వున్న మరొక రాతి పాద ముద్ర హనుమంతుడు ఇక్కడినుంచి అక్కడకు వేసిన అంగగా చెప్పుకుంటారు.


గోపాల స్వామి ఆలయం సీతారామచంద్రస్వామి ఆలయంగా మారిందనే కథనం

ఇక ఈ ఊరిలో ప్రత్యేకంగా కనిపించే చారిత్రక చిహ్నం సీతారామచంద్రస్వామి దేవస్థానం. అత్యంత ప్రత్యేకంగా కనిపించే రాజగోపురం. అయితే కొన్ని కథనాలు మరియు ఆలయంలోని లోహశాసనాంశాల ప్రాకారం పూర్వ ఇక్కడ చిన్న గోపాల స్వామి ఆలయం వుండేదట అప్పటి గ్రామదొర అయిన వీరసారి అనే అతను గోపాలస్వామి విగ్రహం స్థానంలో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి మూర్తిని ప్రతిస్థించాలని తిరుమలలోని పనివారిని పిలిపించి వారికి విగ్రహాన్ని చెక్కించే పనిని అప్పగించాడట. కానీ వారు ఎన్నిసార్లు మూలవిరాట్టును మలచాలని ప్రయత్నించిని విచిత్రంగా ఆ విగ్రహం శ్రీరాముడి రూపంగా ఆవిష్కృతం అవుతూ వచ్చందట. దీనితో ఈ సంఘటనను శ్రీరామ మహిమగా భావించి ఆ విగ్రహాన్నే ప్రతిస్టించాలని నిర్ణయించారట. అంతే కాదు సాధారణంగా గర్భాలయంలో సీతారాములతో లక్ష్మణ హనుమంతులు మాత్రమే కనిపిస్తుంటారు కానీ ఇక్కడి గర్భాలయంలో సీతారామలక్ష్మణభరతశత్రుఘ్నలు కొలువుదీరి వుండటం వారికి హనుమ సాయంగా కనిపించడం ప్రత్యేకం. అంతేకాక హనుమక్షేత్రంగా సాధకులు కృషిచేసిన ఆనవాళ్ళు ఈ ఊరిలో అడుగడుగునా కనిపిస్తాయి. ఆలయం ముందు వరండాలలో ఒకప్పుడు నిరంతర పారయణం జరిగేదట. అంతేకాదు అనేక సేవలు నిర్వహించిన ఆధారాలు వాహనసేవల నిర్వహించిన ఆనవాళ్ళు మిగిలి వున్నాయి. ఆలయ గోపురం ప్రత్యేకంగా కనిపిస్తుంది ఐదు అంతస్తులు లేదా తలాలు వుంటాయి అది మామూలే కావచ్చు కానీ సాధారణంగా కాలిగోపురాలు లేదా గాలిగోపురాలు క్రిందనుంచి పైకి వెళుతున్న కొద్దీ తగ్గుతూ వుంటాయి. కానీ ఈ గోపురం కర్ణాటక  లోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల్ తాలుకా లోని మురుడేశ్వర దేవాలయ గాలి గోపురం 20 అంతస్తులు వరకూ పెద్దగా తగ్గరనట్లు, తమిళనాడులోని చిదంబరం నటరాజ స్వామి గోపురం లాగా పైకి వెళుతున్నాకొద్ది కూడా అదే వెడల్పును పెద్దగా తగ్గకుండా వుంది. క్రింద గోపురం పొడవు ఇంచుమించు 30 అడుగులు వుంటే పైవరకూ వెళ్ళాక అది 25 వరకూ వుంటుంది అంటే ఆ మొత్తం ఎత్తులో కేవలం ఐదు అడుగుల వరకూ మాత్రమే వెడల్పు తగ్గుతుంది కానీ మందం విషయంలో ఈ సూత్రం వర్తించదు అది ఎక్కువగానే తగ్గి చివరలో బాగా సన్నబడింది. రాతి ఆధారభవన నిర్మాణం పైన ఇటుకల కట్టడంగా ఇది వుంది.  ఆ ఇటుకలు చిన్న పరిమాణంలో వున్నయి. కాంక్రీటు వంటిది వాడకుండానే గవాక్షాలు, కోష్టాలను నిర్మించే క్రమంలో వాటి పైకప్పు ఇటుక ఆర్చిపద్దతితోనే నిర్మించారు. గోపురం ముందు వెనక గోడల మధ్య చెక్కదూలాలను ఆధారంగా వుంచడాన్ని కూడా మనం గమనించ వచ్చు. ఎవరో దాత దీని పునరుద్దరణకు మాట ఇచ్చారట బహుశా త్వరలో ఈ ఇటుక నిర్మాణం ప్రస్తుత పద్దతిలో సిమ్మెంటు ప్లాస్టరింగులో మునిగి మరికొన్ని బొమ్మలను చేర్చుకుని కొత్తరంగులను అద్దుకునే అవకాశం వుందని స్థానికులు చెప్పారు.  

గాలిగోపురం ద్వారపు లలాట బింబంగా తిరునామం కనిపిస్తుంది. ద్వారనికి రెండువైపులా నిమ్నపత్రాలుగల పూర్ణకుంబాలున్నాయి. వైష్ణవ ద్వారపాలకులు కనిపిస్తారు. రెండువైపులా వున్న కుడ్య చిత్రాలు కొంత ఆకర్షణీయంగా ఆసక్తిని రేపేవిగా కనిపిస్తాయి. ఏనుగులను తినేయగల సివంగి, సింహాలను సైతం కరచుకుపోగల గంఢభేరుండ పక్షిని చూపిస్తున్నారు. ఇవి ఖచ్చితంగా దేవాలయపు ప్రధాన ఉద్దేశ్యానికి అద్దం పట్టేవి అనడంలో సందేహం వుండదు. శివకేశవ ఆధిపత్య నిరూపణం వంటి విషయాల వివరణతో మూలవిరాట్టు మహత్తు మాత్రమే కాదు ఆయన శౌర్యం గొప్పవారుగా విర్రవీగేటి వారిని సైతం మట్టికరిపించగలంతటి గొప్పది సుమా అని శత్రువులకు తర్జని చూపి భయం కలిగిస్తూనే అన్యవేవశరణం నాస్తి అన్నవారికి ఇంతటి అభయ హస్తం సుమా ఇది అని చెప్పడం వంటిది అని భావించవచ్చు.

 

అశ్శరభ శ్శరభ గంఢభేరుండ కథ

ఈ గంఢభేరుండ చిహ్నం విజయనగర కాలపు నాణేల పైన విరివిగా కనిపిస్తుంది నిజానికి గంఢభేరుండాన్ని చిహ్నంగా వాడటం మైసూరు రాజముద్రలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ అనేక దేశాలలో ఈ సంస్కృతిని గమనించ వచ్చు. ఆంగ్ల వికీపిడియాలో గండభేరుండ వ్యాసంలో ఈ వివరాలు కొంత విపులంగా చర్చించారు. విస్తృత పఠనం కోరుకునే వారు అక్కడ పరిశీలించవచ్చు. ఇకపోతే ఈ గం డభేరుండం విష్ణు అవతారమైన నరసింహస్వామి మరో రూపమనే కథ కూడా ఉంది. దాని ప్రకారం హిరణ్యకశిపుని మరణానంతరం ఉగ్ర నరసింహ మూర్తి అవతారంలో ఉన్న విష్ణువు దగ్గరకు వెళ్ళడానికి దేవతలందరూ భయపడ్డారు. దానితోవారు శివుణ్ని ఆశ్రయించారు. దానితో శివుడు వీర భద్ర, రుద్ర , కాలభైరవ రూపాలలో ఆయనను లొంగదీయాలని వచ్చాడు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో చివరకు శివుడు నరసింహుని భయపెట్టి శాంతింపజేసేందుకు సగం సింహం, సగం శరభ మృగ రూపం ధరించాడని చెబుతారు. అయితే విష్ణువు దానిని ఎదరించేందుకు గండభేరుండ రూపంలో వచ్చాడని చెబుతారు. ఆ గండభేరుండం నల్లటి రంగుతో రెండు తలలతో ప్దెద కోరలతో రెంగు ప్దెద రెక్కలతో ఉందని వర్ణన. అది సింహ శరభ రూపంలో ఉన్న శివునితో 18 రోజుల పాటు పోరాడి దానిని తన ముక్కుతో పట్ట్టుకుని చంపివేసిందని, ఆ క్రమంలో తాను కూడా చనిపోయిందని కథ. శివకేశవ శక్తుల నిరూపణక్రమంలో ఈ రూపాలను ఉదాహరణలుగా తీసుకోవడం మనం అనేక కథనాల్లో చూడవచ్చు. శరభ రూపం దక్షిణాదిన, అందునా తమిళనాట ఉన్న శివాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా శైవ మతాన్ని ప్రోత్సహించిన చోళులు నిర్మించిన ఆలయాలలో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది. అలాగని శరభ అవతారాన్ని తెలుగువారు గుర్తిచలేదని కాదు. ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శరభ, అశ్శరభ, దశ్శరభ అంటూ ఒళ్లు గగుర్పొడిచే అరుపులు వినిపిస్తాయి. తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉండేదని చెబుతారు.  ఆ పక్షి రెక్కల్లో ఒకటి జ్ఞానమును, రెండోది కర్మనుష్టానాన్ని సూచిజస్తుందని ప్రతీతి. అసలు సింహాలను ఏనుగులను గోళ్లతో ఎత్తుకెళ్లే పక్షులు ఎక్కుడుంటాయి అనే ఇప్పటి కాలపు పిల్లల ప్రశ్నలకు కొందరు శిలాజ శాస్త్రవేత్తలు ఏడ్రియన్ మేయర్, వీటిని ప్రోటోసెరటాప్స్ అనే ఎగిరే రాక్షసబల్లుల శిలాజాల గమనించడం వల్ల ఊహలు అయివుండొచ్చని పరికల్పన చేస్తున్నారు.

కర్నాటకలోని షిమోగా జిల్లా కెలాడిలో గల రామేశ్వరాలయం పైకప్పు లోపల గండభేరుండం చిత్రం కనిపిస్తుంది. మైసూరు రాజవంశీకులైన వొడయార్లు కూడా గండభేరుం డాన్ని రాజ చిహ్నంగా వాడేవారు. కర్నాటక ప్రభుత్వం దీనిని తమ రాష్ట్ర చిహ్నంగా చేసుకుంది. 1510లో అచ్యుత దేవరాయులు కాలం నాటి బంగారు నాణేలపై మొదటి పారిగా గండభేరుండం చిత్రం ముద్రించారని చెబుతారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ మైసూర్‌ నౌకపై గండభేరుండం చిహ్నం ఉంటుంది. విజయ నగర సామ్రాజ్యానికి చెందిన యదు రాయలు 16వ శతాబ్దం మధ్య కాలంలో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు విజయ యాత్ర చేయ తలపె ట్టారు. ఆ యాత్రలో ఆయనకు ఒక యోగి తారసపడ్డారు. ఆ యోగి ఆయనకు ఒక ఎర్రని గుడ్డ ఇచ్చారు. రాజు దానిని ఆ యోగి ఆశీర్వచనంగా భావించి, స్వీకరించి పూజ చేశారు. ఆ తర్వాత ఆయన శుభ సూచనలు కనిపించాయి. అది లభించిన తర్వాత తన స్థాయి పెరగడం గమనించిన యదు రాయులు ఆ ఎర్ర గుడ్డను రాజధ్వజంగా ప్రకటించారు. దాని మీద తమ సూత్రాలైన సత్యధర్మాలతోబాటు గండభేరుండ పక్షి చిత్రాన్ని కూడా చిత్రంపజేశారు. అంతేకాక ఆ పక్షికి రెండు వైపులా ఏనుగు ముఖం ఉన్న సింహాలను పైన మహిషాసురుని తలన పట్ట్టుకున్న సింహం బొమ్మను చిత్రీకరింపించారు. దానితో అది ఎంతో ప్రఖ్యాతమైన రాజచిహ్నంగా మారింది. కర్నాటక చరిత్రలో చాలా చోట్ల అధికారిక ముద్రల్లో గండభేరుండాన్ని ఉనయోగించడం కనిపిస్తుంటుంది.

ఇక ఈ రాజగోపురాన్ని దాటుకుంటూ ముందుకు వెళితే గోపురం పడమర దిశ నుంచి నైరుతి మూల మీదుగా పై అంతస్థులోకి చేరుకోగల రాతిమెట్లు కనిపిస్తాయి. వాటినుంచి పైకి ఎక్కితే ఇటుక కట్టడపు మూలం దగ్గరకు రాతికట్టడపు భవనపు పై భాగానికి చేరుకుంటాం అన్నమాట.

అది దాటుకుంటూ వస్తే దేవాలయపు ఆగ్నేయ దిశగా ‘‘తిరువంటవడి’’ పేరుతో వంటశాల కనిపిస్తుంది. పాత శాల పూర్తిగా శిథిలం కావడంతో ఇప్పుడు రేకులతో వేసిన షేడ్ ని అక్కడ వుంచారు. మరికొంచెం ముందుకు వస్తే ధ్వజస్థంభం దాని పక్కన స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించే కళ్యాణ మండపం కనిపిస్తాయి. నాలుగు స్థంభాల కళ్యాణ మండపపు ఈశాన్య స్థంభంపై తూర్పు దక్షిణ దిశల్లో ఒక దాన శాసన పాఠాన్ని గమనించాం ఎప్పటినుంచో పొరలు పొరలుగా దానిపై సున్నం వేసి వుండటంతో ఆలయ నిర్వాహకుల అనుమతితో దాన్న తొలగించి అప్పటికప్పుడు లోకల్ షాపులో ఎమరీ పేపర్ సంపాదించి జాగ్ర్రత్తగా రబ్ చేసి అక్షరాలను ఫోటోలుగా తీసుకువచ్చాము. ఈ కళ్యాణ మండపానికి గాలిగోపురానికి మధ్య వున్న ప్రదేశంలో గుడికి ఈశాన్య దిశన నలుపలకలుగా రాతికట్టడంతో నిర్మించిన చేదబావి వుంది. నిండుగా వున్న ఆ నీళ్ళను ఇప్పటికీ చుట్టుపక్కల వారు త్రాగటం కోసం తోడుకు వెళుతున్నారు.

ధ్వజస్థంభం దగ్గరి కోష్టగృహంలో గరుడాళ్వారు విగ్రహం వుంటుంది. అక్కడినుంచి లోపటికి వెళుతుంటే మెట్లకు ఇరువైపులా సావడీ మండపాలు కనిపిస్తాయి. అక్కడ పూర్వనుంచి భజనలు పారాయణలు, సంగీత గాత్ర కచేరీలు జరుగుతుండేవట. ఆంజనేయ దండకం వంటివి నిత్యపారాయణాలుగా చేసేవారట. 1975లో నాపరాళ్ళ దాత గురించి ఒక దాన శాసనం ఆ నేలపై కనిపిస్తుంది. మొట్లకు ఇరువైపులా వున్న వ్యాళమృగ విగ్రహాలు బూమిలో కూరుకుని ఉండటాన్ని గమనిస్తే ఎప్పుడో నిర్మించిన ఈ ఆలయం కాల క్రమంలో భూమిలోపటికి అనిపించడంతో వరద లాంటివి తట్టుకునేలా మేరువా పోయడంతో ఎత్తుచేసి వుంటారని అర్ధం అవుతుంది. బహుశా గుడి కొన్ని అడుగుల మేర భూమిలోపటికి వుంది. అక్కడినుంచి మరింత లోపటికి వస్తే మూలవిరాట్టు తూర్పుదిశగా తిరిగి వుండగా గర్భగుడికి అభిముఖంగా వున్న రెండు అనుభంద ఉపాలయాలలో ఒకదానిలో ఆళ్వారులు వుండగా మరొక దానిలో ఆండాళ్ దర్శనం ఇస్తారు. పేరుమాళ్ పేరు, గోపుర నిర్మాణం, ఈ ఆళ్వార్ ఆండాళ్ విగ్రహ సంస్కృతి ప్రత్యేకంగా కనిపించడం తమిళ సంప్రదాయపు ఆనవాళ్ళుగా భావించవచ్చు అని నాకు అనిపించింది. మరింత ముందు ఉత్తర మందిరంలో అద్దాల మండపంలా నిర్మించారు. దీనిలో ఉత్సవ సమయంలో పవళింపు సేవలు చేస్తుంటారట. ఈ సేవలకు సంభందించిన ఒక లోహశాసనం ఒకటి వున్నదని చెప్పడంతో పాటు దాన్ని చూపించడంతో పాటు ఫోటోలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుత అర్చకులు తిరుమంజన సేవలలో హడావిడిలో వున్నప్పటికీ.

వైభవంలో భద్రాద్రి రాముడు ... చక్కదనంలో సంకీస రాముడు 

ఆలయం ఆర్ధికంగా అంతంత మాత్రంగా వున్నప్పటికీ అత్యంత వైభవంగా భద్రచలంలో మాదిరిగానే తొమ్మిది రోజుల పాటు రామనవమి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. అంతేకాదు భద్రద్రి రాముడు స్థితిమంతుడు ఆయనకు వైభవాలు గొప్పగా జరుగుతాయి. కానీ మా సంకీస రాముడు ఎంత చక్కనివాడో తెలుసా అంటూ వైభవంలో భద్రాద్రి రాముడు చక్కదనంలో మా సంకీస రాముడూ అంటూ ఒక వాడుక మాటను లోకోక్తిగా అంటుటారు గ్రామంలో. అంతే కదా ఇక్కడి రాముడు సకల సోదర సమేతుడు కూడా నాయే.

కురవి వీరన్నకు మీసాలు ఇవ్వడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ గారు ఈ ఆలయం ప్రత్యేకతను తెలుసుకుని దర్శించడానికి వచ్చివెళ్ళారు గతంలో.  

ది 24-10-2020 నాడు మా అమ్మాయి రక్షితసుమ, హోం మినిస్టర్ లక్ష్మిలతో పాటు  డిగ్రీ విద్యార్ది గోవర్ధన్ తో పాటు బైక్ ల మీద గుడిని చూద్దాం అని వెళ్లాం. అక్కడే వున్న మరో డిగ్రీ విద్యార్ధి సాయి నాగరాజు సాయం వల్ల అనేక చోట్లకు సులభంగా తిరిగి ఇంత సమాచారాన్ని సేకరించడం సాధ్యం అయ్యింది. అక్కడున్న మరో శివాలయం కూడా ప్రాచీనమైనదే ఆ ఫోటోలు వివరాలు త్వరలో పోస్టు చేస్తాను. మీ కట్టా శ్రీనివాస్ (katta.khammam@gmail.com)

 

 


పెరుమాండ్ల సంకీస గ్రామసందర్శన మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాండ్ల సంకీస గ్రామం గురించి కొన్ని ముచ్చట్లు....

Posted by Katta Srinivas on Saturday, 24 October 2020

 

 

 

 

 

 


కామెంట్‌లు