కట్టా శ్రీనివాస్ || అజారామర స్వగతం ||
ఏదో ఒకరోజు
ఏ రంగూ లేని కాగితం ఒకటి
ఎగురుతూ ఎగురుతూ వచ్చి
నెమ్మదిగా సుతారంగా
చేతుల్లో వాలొచ్చు
బహుశా అలా వాలే
ఆఖరుది అదే కావచ్చు.
నడవడమే నీ పని
ఎక్కడిదాకా అడక్కు
ఎటువైపో మాత్రం సరిగా చూడు.
ఏం వుంచి పోదామనుకుంటున్నావు?
నీ గెలుపు గర్వం
సంపదల చిట్టా
చర్మానికి అద్దిన రంగులు
ఉఫ్....
అనకముందే..
వెళ్లిపోతాయి.
ఏం మిగిల్చిపోదామనుకుంటున్నావు?
బంగారు పళ్లెంలో
ఏం తిన్నవో అరగక ముందే
నువ్వే మర్చిపోతావు.
వెండి ఉయ్యాలలో నిద్ర
బరువేమీ పెద్దది కాదాయే.
ఉంచాలనే అనుకుంటే
పంచుతుంటే
పెరిగేదే ఇవ్వరాదూ!!
రోజుకెన్నో మెరుపు రంగుల కాగితాలు
సీతాకోకల్లా కళ్ళ ముందు కదలాడుతుంటాయి.
ఎందుకలా గాజుకళ్ళతో
రంగులేని కాగితం కోసం ఆరాటంగా చూస్తావ్?
భుజాలు తగులుతూ
నీ పక్కనే ఒరుసుకుంటూ
నీలాగే తచ్చట్లాడుతున్న
ఎందరో నీలాంటి నీవులు
పలకరింపులతో ముడేసుకుంటే
పోయేదేముంది డ్యూడ్
తేలికతనమేగా..!
తెలీనితనమేగా....!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి