నిద్రపోయినంతసేపు శవంలా కదలకుండా మెదలకుండా స్పందించకుండా వున్నసరే మళ్లీ లేవగానే జీవపు స్పృహ కలిగినట్లు, ధృవప్రాంతాల్లో కొన్ని జంతువులు ఆరునెలల పాటు శీతాకాల సుప్నావస్త అనే అతిగాఢ నిద్రలోకి వెళ్లడం. రాతిముక్కల లాంటి విత్తనాలు అనుకూలవాతావరణంలో మొలకెత్తడం చూసిన మనిషికి మరణం శాశ్వతం అంటే నమ్మబుద్ది కాక అది కూడా నిద్రే అనుకోవడం కావచ్చు. తమకి ఇష్టమైన ఆ మనిషి రూపం దేహం ఎప్పటికీ వుండాలని వాటిని భద్రపరిచే ప్రక్రియే మమ్మిఫికేషన్.
అంతే కాకుండా ఈజిప్షియన్లు పునర్జన్మలను నమ్ముతారు. మరణం తరవాత ఆత్మ ఉండటానికి ఓ దేహం కావాలని వాళ్లు భావిస్తారు. అందుకే చనిపోయిన తరువాత కూడా మమ్మీల రూపంలో శరీరాన్ని భద్రపరచడానికి ప్రయత్నించేవారు.
ఇలా తయారుచేసిన ఈజిప్షియన్ మమ్మీలు మనదేశంలో కేవలం ఆరు మాత్రం ఉన్నాయి అందులో ఒకటి మన హైదరాబాద్ లోనే వుంది. కోల్ కతాలోని ఇండియన్ మ్యూజియం, ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ వస్తు సంగ్రహాలయం, జైపూర్ లోని ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, లక్నో లోని స్టేట్ మ్యూజియం, వదోదరా లోని బరోడా మ్యూజయం అండ్ పిక్చర్ గ్యాలరీ మన దగ్గర వైయస్సార్ స్టేట్ మ్యూజియం హైదరాబాద్.
◆ నిజాం బహుమతి మ్యూజియంలోకి వచ్చింది.
1920లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అల్లుడు నవాబ్ జంగ్ ఈ మమ్మీని వెయ్యి పౌండ్లకు కొనుగోలు చేసి, ఏడో నిజాం అయిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు బహూకరించాడు. బహుమతిగా ఇటువంటి దాన్న ఎంచుకోవడం చాలా వింతగా అనిపిస్తుంది. అలీఖాన్ దీనిని 1930లో మ్యూజియానికి ఇచ్చాడు. 1956వ సంవత్సరం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలుచేసిన ఎగ్జిబిట్లను వాటి విలువ ఆధారంగా విభజించి, చెరిసగం పంచనున్నారు. అంతకుముందున్న ఎగ్జిబిట్లన్నీ తెలంగాణ రాష్ర్టానికే చెందుతాయి కాబట్టి ఇదిప్పుడు తెలంగాణ రాష్ట్ర అరుదైన సంపదల్లో ఒకటిగా నిలచింది.
ఈజిప్టులో రాజ కుటుంబీకులు చనిపోతే వారిలో ముఖ్యులను దహనమో, ఖననమో చేయకుండా ఆ శరీరాలను మమ్మీలుగా మార్చే భద్రపరిచేవారు. కాలక్రమంలో ఒకానొక మమ్మి ఎన్నో మజిలీలు దాటుకుంటూ ఇలా నాంపల్లిలోని స్టేట్ మ్యూజియంలోకి వచ్చింది.
● కోలుకున్నమమ్మీ
స్టేట్ మ్యూజియంలో సాధారణ అద్దపు పెట్టెలో ప్రదర్శనకు మమ్మీని వుంచారు. వేడి సరాసరి పడే వెలుతురు, తేమ, కీటకాలు ముఖ్యంగా ఆక్సిజన్ వల్ల ఇది పాడయిపోవడం మొదలయ్యిందిఅదేవిధంగా వదిలేస్తే పూర్తిగా పాడయిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేసారు. ఈజిప్ట్ పురావస్తు, పరిరక్షణ నిపుణులు తారిక్ అల్ అవాడీ ఆరేళ్ల క్రితం హైదారాబద్ సందర్శన సందర్భంగా మమ్మీ సంరక్షణ కోసం పలు సూచనలు చేశారుకూడా.
పురావస్తు శాఖ డైరెక్టర్ వచ్చి విశాలాచ్చిగారు మమ్మీ సంరక్షణపై దృష్టి పెట్టారు. ఢిల్లీలో రాజీవ్‌గాంధీ హత్యకు ముందు చివరిసారిగా ధరించిన వస్త్రాలు, ఇందిర హత్య సమయంలో నేలపై చిమ్మిన రక్తం మరకలను పరిరక్షించేందుకు అనుసరించిన పద్ధతులతో పాటు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఉన్న మమ్మీ పరిరక్షణ చర్యలను పరిశీలించారు. విదేశీ నిపుణులతో చర్చించి. మమ్మీ సంరక్షణ కోసం జర్మనీలోని గ్లాస్ హార్న్‌బాష్ కంపెనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీ షోకేసును కొనుగోలు చేశారు. రూ.58 లక్షల విలువైన ఈ పరికరంలో ఇటీవలే మమ్మీని ఉంచారు. ఈ పరికరం ఆక్సిజన్ చొరబడటాన్ని నియంత్రించడంతోపాటు నైట్రోజన్‌ను పంప్ చేస్తుంది. విద్యుత్ సరఫరా ఆగిపోతే నైట్రోజన్ పంపింగ్ నిలిచిపోకుండా ప్రత్యేక జనరేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ పద్దతుల వల్ల మమ్మీ మరో ఐదువందల ఏళ్ళ వరకూ ఎటువంటి ఢోకా లేకుండా వుంటుందన్నారు.
◆ మమ్మిఫికేషన్ కోసం అప్పట్లో ఏం వాడారు? ఎలా చేసారు?
వేలాది సంవత్సరాల క్రితం దేహాన్ని భద్రపరచడం కోసం వాడిన రసాయనాలపై యోర్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ స్టెఫిన్ బక్లీ వంటి శాస్త్రవేత్తలు ప్రతి పదార్థానికి చెందిన ‘కెమికల్ ఫింగర్‌ప్రింట్’ను ఫోరెన్సిక్ ప్రయోగాల ద్వారా విశ్లేషించి ఆ ఫలితాలను ఆర్కియలాజికల్ సైన్స్ జర్నల్ లో ప్రచురించారు.
మమ్మిఫికేషన్ (మమ్మీల తయారీ) కోసం ఓ మొక్క నుంచి సేకరించిన నూనె (నువ్వుల నూనెగా భావిస్తున్నారు)‘బుల్‌రషెస్‘ అనే మొక్క వేరు నుంచి సేకరించిన తైలం తుమ్మ చెట్టు నుంచి సేకరించిన సహజసిద్ధ జిగురు దేవదారు వృక్షం నుంచి సేకరించిన జిగురు వీటన్నింటినీ కలపడం ద్వారా ఆ పదార్థానికి బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి వస్తుందని, దాని సాయంతో శరీరం కుళ్లిపోకుండా ఏళ్ల తరబడి కాపాడి ఉండొచ్చంటున్నారు.
శరీరానికి పరిమళ ద్రవ్యాల పూత వేయడం అన్నది మమ్మీల తయారీలో ఓ భాగం మాత్రమే. దానికి తోడు మమ్మీల తయారీలో మరెన్నో దశలు ఉన్నాయి.
‘విస్కింగ్’ అనే పద్ధతి ద్వారా మెదడును ద్రవ రూపంలోకి మార్చి శరీరం నుంచి బయటకు తొలగిస్తారు. శరీరం లోపటి కొన్ని అవయవాలను తొలగిస్తారు. సాధారణ ఉప్పలో ఉంచిన శవాన్ని అనేక గంటల పాటు ఎండలో వుంచి తేమ పూర్తిగా తొలగిపోయేలా చేసేవారు. ఆ తర్వాత కూడా మిగిలి వున్న బ్యాక్టీరియాను చంపడానికి పరిమళ ద్రవ్యాల పూతను శరీరానికి పట్టించడం చేసేవారు. ఆ తర్వాత ప్రత్యేకమైన నారతో శరీరాన్ని పూర్తిగా ఒక క్రమ పద్దతిలో అల్లికలాగా చుట్టేసేవారు.
మమ్మీపైన రాతలకు అర్ధం ఏమిటి?
ఈజిప్టుకు చెందిన సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఆంటిక్విటీ(SCA)2009లో హైదరాబాద్ స్టేట్ మ్యూజియం లోని మమ్మిని పరిశీలించినప్పుడు దానిపై వున్న రాతలు ( Khate Mekhi’, or nail script ) డీకోడ్ చేసారు. వాటి ప్రకారం ఆ అమ్మాయి పేరు నైషుహ(Nishuha), ఆమె ఈజిఫ్షియన్ ఆరవ ఫారో చక్రవర్తి బిడ్డ, క్రీస్తు పూర్వ 300 నుంచి క్రీస్తు పూర్వం 100 నాటిది. చనిపోయే నాటికి ఆమె వయసు 25 సంవత్సరాలు.
అత్యంత పురాతన కాలానికి చెందిన మమ్మీలపై కప్పిన పొరలను విడదీస్తే దానికి రక్షగా వుంచిన శాపం పనిచేస్తుందనే ‘‘కర్స్ ఆఫ్ టుటెన్కమన్’’ వంటి కథలతో పాటు అప్పటి వైరస్ వంటివి మళ్ళీ కొత్తగా మానవజాతిపై దాడిచేస్తాయేమో అనే ఆందోళనలు కూడా వున్నాయి. నిజానికి అత్యంత పురాతన మమ్మీల. రసాయన విశ్లేషణ, జన్యు పరిశోధన, రేడియో కార్బన్ డేటింగ్, మమ్మీపై ఉన్న వస్త్రాల పరిశోధన లాంటి అనేక పరీక్షల ఫలితాలను విశ్లేషించడం ద్వారా ఆకాలం నాటి అనేక విశేషాలను తెలుసుకునే అవకాశం వుంది. హైదరాబాద్ మమ్మీ పునరుద్ధరణ సందర్భంగా ఎక్స్ రే వంటి కొన్ని ఆధునిక పరీక్షలు నిర్వహించారు. అప్పటి కాలం మనతో మాట్లాడేందుకు మిగుల్చుకున్న సన్నటి ఆధారాల్లో ఈ మమ్మీ కూడా ఒకటి కావచ్చు కదా.
అరుదైన మమ్మీని మీరూ చూడాలనుకుంటూ హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో పబ్లిక్ గార్డెన్ కు వెళ్లే గేటునుంచి లోపటికి వచ్చి ఎడమ వైపుకు వెళితే మ్యూజియం ఎంట్రన్స్ కనిపిస్తుంది. అత్యంత కట్టుదిట్టమైన రక్షణ వలయంలోపటికి వెళుతున్నట్లు అనిపించడం వల్లనో ఏమో సందర్శకులు ఎక్కువగా వస్తున్నట్లు అనిపించడం లేదు.
∆ √√ రిఫరెన్సు
ఈ మధ్య మరోసారి స్టేట్ మ్యూజియంకు Rakshita Suma తో పాటు వెళితే Aravind Pakide Ganga Devi Gillella మేడంలు బోలెడన్న...
Posted by Katta Srinivas on Monday, 30 November 2020
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి