కాలదిమ్మరి (కథ) || కట్టా శ్రీనివాస్ ||

 కాలదిమ్మరి (కథ) || కట్టా శ్రీనివాస్ ||

Buddha to Krishna a time travel Sci-fi story


 ‘‘నవ వత్సర శుభకామనలు మిత్రమా’’ వనంలోని రావిచెట్టు క్రింద ప్రశాంతంగా కూర్చున్న అగంతకుడి వైపు చూస్తూ నెమ్మదిగా, వినయ గంభీరంగా అడుగులేస్తూ దగ్గరకు వచ్చాడు కపిలవస్తు యువరాజు, శుధ్దోదన మాయాదేవిల పుత్రుడు గౌతముడు. అతడు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు ‘‘నీ కోసమే వచ్చాను యువరాజా’’

‘‘ఏ దేశం నుంచి వచ్చావు, నిన్ను చూస్తుంటే నాకింతకుముందే తెలిసినట్లు అనిపిస్తుందేమిటి?’’ ఉత్సుకతతో అడుగుతూ పక్కన కూర్చున్నాడు గౌతముడు.

ఎడమ భుజం మీదుగా తలతిప్పి గౌతముడి కళ్లలోకి చూస్తూ స్పుటంగా చెప్పాడతడు ఏ దేశం కాదు ఏ కాలం నుంచి అడగాలేమో భవిష్యత్తునుంచి వస్తున్నాను. ఇక పోతే తెలిసినట్లు అనిపించడం కాదు నువ్వే నేను. పాక్షికంగా గర్భసంజాతుడవుగా పుట్టడంతో మేథోపరిమిత జ్ఞానం మేరకే అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు.

గౌతముడు కళ్ళు విప్పార్చుకుని సంభ్రమంగా చూస్తున్నాడు. తనని మార్చాయనుకుంటున్న నాలుగు సంఘటనలకన్నా చిత్రమైనదేదో ఎదురయ్యింది అనుకున్నాడు. ‘‘నువ్వేమంటున్నావో నాకు సరిగా అర్ధం కాలేదు, నేను జ్ఞానం పొందాలనుకుంటున్నాను, దానికి మార్గం ఏమిటో చెప్పగలవా?’’ తనకి కావలసిందేదో తప్పకుండా దొరుకుతుంది అన్నంత నమ్మకాన్ని మాటల్లో ప్రతిఫలిస్తూ అడిగాడు గౌతముడు.

‘‘ కావలసింది అంతా ఇప్పటికే నీ దగ్గర వుంది, కొన్ని పలచటి పొరలు అడ్డుగా వున్నాయి, పర్వాలేదు చిన్న ప్రయాణం చేయి అవే కరిగిపోతాయిలే’’ గుంభనంగా నవ్వుతూ ‘‘ఇప్పుడు అవసరమైన  ఒక కథ చెప్తాను’’ అంటూ వైకుంఠపాళి లాంటి ఒక వస్త్రచిత్రాన్ని పరిచాడు. దానిపై కొన్ని బొమ్మలు గీసి వున్నాయి. పక్కనే వున్న రాళ్లు పుల్లలూ దానిపై పెడుతూ కథ చెప్పటం ప్రారంభించాడు.

‘‘మనం ఇప్పుడు వున్న కాలం కంటే పూర్వం జరిగిన కథ గడిచిన కాలంలోని ఒక సంఘటనల వరుస ఇది. ఇదిగో ఈ రాజ్యంపు ఇద్దరు అన్నదమ్ములలో ఒకడికి ఐదుగురు కొడుకులు, మరొకడికి వందమంది కొడుకులు పుట్టారు. ఈ ఐదుగురు అనవసర అలసత్వంతో కృంగితే, అవతలి వాళ్లు కంసుడు, జరాసంధుడు, కీచకుడు వంటి రాక్షసులను కలుపుకుని ఐదుగురిని అంతంచేయడంతో పాటు రాజ్యాన్ని రాక్షసపాలనగా మార్చి చివరికి నాగరికత అంతమైపోయే దశకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అచ్చంగా రాక్షసరాజ్యమే అక్కడ మిగిలింది. అదే వీళ్ళని ఓడించగలిగితే పరిస్థితి మరోలా వుండేది. ఆ తర్వాతి కాలపు ప్రజలు దారుణమైన కష్టాలు పడాల్సిన అవసరం వుండేది కాదు.’’ చెప్పుకుంటూ వెళుతున్న అతనికి అడ్డువస్తూ ఆశ్చర్యం నిండిన కళ్ళతో ‘‘ ఇందతా జరిగిన కథ కదా, ఎలావుండాలో మనం ఇప్పుడు అనుకోవడం వల్ల లాభం ఏముంది?’’ అడిగాడు గౌతముడు.

విశాలంగా నవ్వుతూ గౌతముడి భుజం మీద చెయ్యివేసి అన్నాడతను ‘‘ ఇందాక నువ్వోక ప్రయాణం చెయ్యాలన్నాను కదా ఆ కాలానికే ఈ లెక్కను సరిచేయడం కోసంమే’’

ఇప్పుడు మరీ ఆశ్చర్యంగా చూసాడు ‘‘ నే... ను.. ను అదంతా చేయగలనా ఎలా చేస్తాను’’

‘‘ ముందు సందేహ పడటం ఆపెయ్యి నీతో నేను ఇంతకంటే మరీ ఎక్కువ సేపు మాట్లాడకూడదు కూడా, భవిష్యత్తు నుంచి ఇప్పటి నీ వరకూ రావడం కుదిరిందినప్పుడు ఇక్కడినుంచి వెనకకు వెళ్ళడం ఎందుకు కుదరదు అనుకుంటున్నావు.  కాకపోతే కొన్ని జాగ్రత్తలు గుర్తుపెట్టుకో,

ప్రయాణం తర్వాత వచ్చే అనంత ఎరుక వల్ల కలిగిన జ్ఞానం, సాంకేతికత వాళ్లకు చెప్పాలని చూడకు వారి మెదడు స్థాయికి ఇమడక అతిత్వరలో అంతమైపోగలరు.

జరిగిన సంఘటనల్లో శత్రువులు ఏ మలుపుల దగ్గర విజయం సాధించారో గమనించు వాటిని ఒక్కొక్కటిగా అడ్డుతొలగిస్తూ వెళ్ళు,

నీవొక ప్రొజక్షన్ లా అక్కడికి వెళుతున్నావు, సాధ్యమైనంత వరకూ సహజంగా జన్మించిన వాళ్లను స్వంతగా అంతం చేయకు.

మంచిని కాపాడటానికి నీ రూపం ప్రొజెక్షన్ గా వెళ్ళినట్లుగానే, చెడుపక్షం వహించే భవిష్యత్ రూపాలు కొన్ని నీకు అడ్డుపడే ప్రొజెక్షన్ లుగా నీ పుట్టుకనుంచే అడ్డం రావచ్చు వాటిని నిరభ్యంతరంగా అంతంచేయాల్సింది నువ్వే.

ఇక ఆఖరుది ముఖ్యమైనది నీ పని పూర్తికాగానే వెనక్కి రావాలి దానికోసం నీతో తీసుకెళుతున్న ఈ స్థూపాకారంపై కాలిబొటనవేలితో గట్టిగా నొక్కాలి. ఇది గుర్తుపెట్టుకో లేదంటే ఇప్పటి నీరూపం నశించిపోతుంది.’’

గుక్కతిప్పుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి చెప్పేసి ‘‘ప్రయాణం ప్రారంభిస్తావా ఇక నేనెళ్ళాలి’’ నవ్వుతూ అన్నాడు.

ముడేసిన కనుబొమ్మలు విడిపోకుండా సందేహంగానే చూస్తూ మరో నిమిషం అన్నట్లు కుడి చూపుడు వేలు పైకి చూపుతూ అడిగాడు గౌతముడు. ‘‘ అక్కడొక జీవిత కాలం పాటు వుండొస్తే, ఇక ఇక్కడి గౌతముడు ఏమవుతాడు? అంటే నేను అక్కడికెళితే ఇక్కడ వుండనట్లేనా?’’ ఒక్కోపదం కూడబలుక్కున్నట్లే అడిగాడు.

‘‘ ఓ అదా దీనిలో మరో కిటుకు వుంది నీకిక్కడ ఘడియకాలం గడిచేసరికి అక్కడ సంవత్సరాలు పూర్తవుతాయి. అంటే అక్కడ జీవితకాలం పూర్తిచేసుకునేంత సమయానికి కూడా ఇక్కడ రోజులు మాత్రమే పూర్తయినట్లు, ఇబ్బంది లేకుండా ఇదే చెట్టుక్రింద ధ్యానముద్రలో కూర్చో, రక్షణలో తేడారాదులే’’ వుంటానిక అంటూ లేచినిలబడ్డాడతను.

సాలోచనగా చూస్తూ ఏదో గుర్తొచ్చినట్లు అతని చేతిని చటుక్కున పట్టుకుని ‘‘ ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు?’’  అడిగాడు గౌతముడు.

మరోసారి అదే నవ్వుతో ‘‘కాల దిమ్మరిగా తిరుగుతున్నప్పుడు స్థలానికోపేరు, కాలానికోపేరు అక్కడి అవసరానికి తగినట్లు ఇప్పటి పేరు గౌతముడిగా వున్నట్లు’’ కళ్ళెగరేసాడు.

చెయ్యివదలకుండా మనసులోనే గొణుక్కున్నాడు గౌతముడు కా...ల... దిమ్మరి కలికిరూప వంతుడు... ‘‘ హా కలికుడు అననా లేదు లేదు కల్కి అననా, గుర్తుంటుంది’’

‘‘ పర్వాలేదు అలాగే గుర్తుంచుకో పైగా ఆ పేరుతో భవిష్యత్తులో చాలా పనివుంది నీకు కూడా, ఇక నీ ప్రయాణం నువ్వు, నా ప్రయాణం నేను ప్రారంభిద్దాం. గౌతముడి చేతిలో ఒక స్థాపాకారపు చిన్న వస్తువుని పెడుతూ ఇక కూర్చో అన్నాడు.

గౌతముడు ద్యానముద్రలో కూర్చుని కళ్ళుమూసుకున్నాడు, అతని నొసటిపై బొటనవ్రేలు పెట్టి చేతిలో వుంచిన స్థూపాకారంపై నెమ్మదిగా నొక్కాడు.

=oo=0=oo-=

కుడికాలి బొటన వ్రేలిపై చిటుక్కుమన్నట్లు అనిపించింది నొప్పిగా కూడా వుండటంతో గౌతముడికి మెలకువ వచ్చింది. అయితే తను కూర్చిని లేదు. పడుకుని వున్నాడు కాదు కాదు పడిపోయి వున్నాడు. ఎవరి ఒడిలోనో వున్నట్లనిపించింది. అమ్మ మాయాదేవి కావచ్చేమో అనిపించింది ఒక్కక్షణం. కనురెప్పలు లేపి చూడం కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది. అలాగే రెప్పలు లేపుతూ చూసాడు. తెలిసిన మోహంలా అనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా ఏదో త్రాగిస్తోంది తనకి. గుటక వేస్తూ చేతులతో శరీరాన్ని తడుముకుని చూసుకున్నాడు గౌతముడు కేవలం ఎముకల గూడులా దేహం చేతికి తగులుతోంది. ఏం జరిగింది? ఏమయ్యింది తన శరీరానికి? ఇంతలా శుష్కిచిపోయానెందుకు? ఆలోచనలు పూర్తికాకముందే గుర్తొచ్చింది ధ్యానానికి ముందు కల్కితో జరిగిన సంభాషణ.

భారంగా లేచి కూర్చుంటూ ఆమెను అడిగాడు ‘‘క..ల్కి.. ఎక్కడ?’’ అని

తన చీరకొంగుతో అతని పెదాలను తుడుస్తూ చెప్పింది ఆమె ‘‘ నిన్ను ఇక్కడికి మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురావడం కోసం నిన్నటి నీ దగ్గరకే వచ్చాడు.’’

‘‘నా.. దగ్గ...రి... కా.. ’’ ఏం జరిగిందో గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆమె చురచుర చూస్తూ అన్నది  ‘‘ కురుక్షేత్రం యుద్దం పూర్తయిన తర్వాత నీ పని ముగినట్లే కదా, వెనక్కి రాకుండా ద్వాపరనిర్మాణం ఏమిటి? పాండవులందరూ పోయిన తర్వాత కూడా వుండటం ఎందుకు? నిజానికి ఒక కాలశాఖలో ఇక్కడి నీ దేహం నిరాహారమై చనిపోయింది. పోనీ దాన్ని మొత్తం మార్చడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. అందుకే కల్కి అక్కడికి వచ్చి నీ బొటనవేలిపై ముసలపు ముక్కను బాణంగా వేసి అక్కడ అంతంచేసి ఇక్కడ మెలకువ తెచ్చాడు. మరో కాలంలో అత్యవసరమార్పు అవసరం వుండటంతో ఇంకో ప్రయాణం చేస్తున్నాడు.’’

గౌతముడికి అద్దాన్ని తుడిచినట్లు అంతా గుర్తొస్తోంది. వసుదేవ సుతుడిగా తన ప్రొజెక్షన్ ని ప్రారంభించడం కంసుడు అతని పరివారాన్ని చివరి యుద్ధం వరకూ వుంచకుండా మొదట్లోనే తుంచడం. కౌరవసేనకు తుది బలంగానూ తర్వాత కంటకులుగానూ మారబోయే వారిని ఒక్కొరిగా ఒక్కో సంఘటన గుండా ఏరేయడం, లక్కయింట్లో కాలిపోకుండానే కాదు అవలక్షణాలతో జారిపోకుండా పాండవులను కాచుకుంటూ రావడం గుర్తొస్తున్నాయి కానీ మహా సంగ్రామం కురుక్షేత్ర యుద్ధంలో సైతం అర్జునుడు సాకుగా మానవాళికి ఉపయోగపడే మాటలను గీతాసారంగా చెప్పడం గౌతముడికి బాగా సంతోషంగా అనిపించింది.

ఆమె చేతిని మీద వేయగానే పరధ్యానం నుంచి తేరుకుంటూ అడిగాడు ‘‘ ఇంతకీ నీవెవరు?’’

‘‘నేను ప్రొజెక్షన్ చేయబడటం వల్ల రాలేదు. గర్భసంజాతగానే పుట్టాల్సివచ్చింది. నీకు దేహసంభంద ఆహారం ఇవ్వాల్సిన అవసరం వుండటంతో, కాకపోతే మెదడుపరిమితిలో మరపు మాయ రాలేదు కాబట్టి నాది మంచి జననం, సు...జాత అనుకోవచ్చులే’’  అన గిన్నెలను సర్దుకుంటోంది.

గౌతముడు తన తలదిండుగా అప్పటివరకూ పెట్టిన చీరను చేతుల్లోకి తీసుకుని కృతజ్ఞతగా నిమురుతు అన్నాడు‘‘ నీ గుర్తుగా దీన్ని నాతో వుంచుకుంటాను’’ ఆమె తన కుడిచేతిని గౌతముడి చెంపపై ఆనించి చిన్నగా నవ్వింది. ‘‘ మరీ ఎక్కవ టోటెమ్ లను భద్రపరచలేవు అది కూడా బరువే జాగ్రత్త, ఇక నా పనిముగిసింది. ఇప్పటి నీ పని ప్రారంభం అయ్యింది’’

‘‘నా పనా? ఇప్పుడు  ఇంకొకటా?’’ అడిగాడు.

‘‘ అవును గీతాసారం చెప్పివచ్చినట్లే ఇప్పటి దుఃఖ నివారణ నీద్వారా జరగాలి కదా, శరీరాన్ని వద్దని నాశనం చేసుకునే అతి ఒకవైపు, శరీరమే సమస్తమనుకునే అతి మరోవైపు సమస్త మానవాళి జీవితాలనూ అతలాకుతలం చేస్తున్నాయి. నిస్తేజపు ముగింపు దిశగా తోసుకుపోతున్నాయి. నీ మధ్యేమార్గంతో దాన్ని సంతులనం చెయ్యాలి కదా’’ ఆమె నీకు తెలిసిన సంగతేగా అన్నట్లు పరిచయపు నవ్వు నవ్వింది.

‘‘సరే మరి నేను ఎప్పటి దాకా ఈ పనిచేయాలి. ముగింపు ఈ సారి మర్చిపోకుండా ఏం చేయాలో చెప్పనే లేదు’’ జాగ్రత్త పడుతున్నట్లు అడిగాడు గౌతముడు.

ఆమె ప్రసన్నంగా చెప్పింది ‘‘ మళ్ళీ నేనే వస్తానులే కలికి లాగానే కావచ్చు, పురుషుడిలా కావచ్చు, మళ్లీ ఆహారంగానే నీ ముగింపు కూడా ఇస్తాను. నీ పాత్రలో భిక్షగా పడింది ఏదైనా కాదనకుండా  జీవనం సాగిస్తుంటే చాలు, నీకు కావలసింది నీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తుంది.

=oo=0=oo-=

 

పండుముసలి వయసులో వెళ్ళాల్సిన సమయం ఆసన్న అయిన తర్వాత శిష్యులందరినీ సమాలోచన పరచిమరీ అడిగాడు ఏమన్నా అడగాల్సిన ప్రశ్నలు వున్నాయా అని

తన పాత్రలో పడిన ఆహారమే మరణ కారణం అవుతున్నప్పుడు కూడా చిద్విలాసంగా ఆఖరిమాటలు చెప్పాడిలా.

‘‘ సమస్త సంక్లిష్ట విశ్రమాలన్నీ అంతరించిపోతాయి, నీ నుంచి నీవు విడుదల అయ్యేందుకు కొంత కష్టమైనా ప్రయత్నించండి’’

ఇప్పుడు అతని కాలప్రయాణపు టోటెమ్ ధాతువులపైన పవిత్ర నిర్మాణంగా నిలచింది. దానికి కారణం ఏమిటో కల్కి వచ్చి చెపుతాడని తెలుసుకాబట్టి.

కామెంట్‌లు