ఆదీవాసీ ప్రాంతపు వైద్య నమ్మకాలు, నమ్మక వైద్యాలూ : చత్తీస్ ఘడ్ లోని చోటా డోంగర్ గ్రామంలోని వైద్యరాజు హేమచంద్ర మాంజీ వైద్యాలయ సందర్శన వివరాలు
ఆదీవాసీ ప్రాంతపు వైద్య నమ్మకాలు, నమ్మక వైద్యాలూ : చత్తీస్ ఘడ్ లోని చోటా డోంగర్ గ్రామంలోని వైద్యరాజు హేమచంద్ర మాంజీ వైద్యాలయ సందర్శన వివరాలు
చుట్టుపక్కల గ్రామాలే కాదు పక్క రాష్ట్రాలనుంచి సైతం వైద్యం కోసం అక్కడికి వస్తుంటారు. నిజానికి అది పెద్ద నగరం కాదు ఆయన ఎటువంటి వైద్యశాస్త్రంలోనూ పట్టభద్రుడు కాదు. కానీ ఎన్నెన్నో మొండి రోగాలకు ఆయనిచ్చే మందులతో ఉపశమనం అభించిందని మళ్ళీ మళ్ళీ వచ్చేవాళ్ళు, వచ్చిన సందర్బంలో ఆయన పాదాలకి వినమ్రంగా నమస్కరించి మరీ వైద్యం చేయించుకోవడం వారి గురికి గుర్తుగా అనిపించింది. మా ప్రయాణంలో కూడా బాబాయ్ జగన్మోహన్ రావుగారు పిన్నిగారి కాళ్ళ నొప్పులకు మెడిసిన్ తీసుకోవడం కోసమే వస్తున్నారు. ప్రయాణంలోనే వైద్యరాజ్ తో వారి గత అనుభవాలేమిటి అనేది తెలుసుకునేందుకు సాధ్యపడింది. ఏవేమో మందులు ఎంతో ఖర్చుపెట్టి వాడినా కాళ్ళ మంటలు తగ్గకపోతే మాంజీ దగ్గర ఒక్కవిడత వాడగానే చాలా ఉపశమనం వచ్చిందట పిన్నగారి మాటల్లో చెప్పాలంటే మాంజీ గారూ తన పాలిటి దేవుడు అన్నారట. అందుకే ప్రయాణం వందల కిలోమీటర్ల దూరమైనా, ఖర్చుకూడా చాలా అయినా మెడిసిన్ కోసం మరోసారి ప్రయాణం పెట్టుకున్నారు.
నారాయణపూర్ జిల్లాలో నారాయణ పూర్ నుంచి 43 కిలోమీటర్ల దూరంలో చోటేడోంగర్ వుంటుంది. డోంగర్ పేరుమీది గ్రామాలు మన తెలంగాణలోనూ కొన్నిచోట్ల కనిపిస్తాయి. మరి డోంగర్ చిన్నదని చోటా కూడా కలపడంలో కథ ఏముందో లోతుగా అయితే చూడలేదు. దంతెవాడ దర్శనం తర్వాత మాప్ లో చూపించిన దారిగుండా మొదటి రోజే చేరుకుందామని ప్రయాణం ప్రారంభించినా ప్రాక్టికల్ గా ఆ దారి భద్రతా కారణాలతో ప్రయాణానికి వాడొద్దని వారించడంతో ఆ రాత్రికి జగదల్ పూర్ తిరిగివచ్చి గోయల్ లో రెస్ట్ తీసుకుని ఉదయాన్నే నేషనల్ హైవే 45 పై కొండగాంవ్ మీదుగా తెలిమంచు సమయంలోనే బయలుదేరాం. నాస్తా కోసం మన పద్దతిలో ఇడ్లీలు, దోసెల కోసం వెతుకుతుంటే అక్కడ ప్రధానంగా టిఫిన్ గా పకోడి దొరుకుతుంది. పైగా దానిలోకి పచ్చిటమాటా, పచ్చిమిర్చిని పల్చగా రుబ్బిన చట్నీ కాంబినేసన్ కూడా, ఇది చూసే అరవింద్ చత్తీస్ ఘడ్ లాండ్ ఆఫ్ పగోడాల కంటే ల్యాండ్ ఆఫ్ పకోడా లాగా వుంది కదా అంటూ చమత్కరించాడు. చోటే డోంగర్ అంబుజ్ మడ్ శివార్లలోని మరీ చిన్న గ్రామం కావడంతో అటువెళ్ళే దారిని దాటుకుంటూ మూడునాలుగు కిలోమీటర్లు ముందుకెళ్ళి నారాయణపూర్ లో టిఫిన్ అయ్యిందనిపించాం. మంచిగా పొంగించిన పూరీలూ దానిలోకి దాల్ కర్రీ. ఆత్మారాముడు సంతృప్తి చెందాక వైద్యరాజ్ వారి విలేజ్ వైపుగా మళ్ళీ ప్రయాణం. దారిలో వైద్యరాజ్ గురించి వాకబ్ చేసి చూసా వాళ్ల అభిప్రాయాల కోసం, చాలా నమ్మకంగా చెప్తున్నారు ఆయన మంచి వైద్యుడు అంటూ. కార్ వెళ్లేందుకు కూడా కొంచెం కష్టంగా వున్న చిన్న చెరువు కట్టమీదుగా ప్రయాణించాక హేమచంద్ర మాంజీ ఇల్లు కమ్ వైద్యశాల. ఈలోగా దారిలో కనిపించే దృశ్యాలను, ఆదివాసీ జీవన దృశ్యాలనూ జాగ్రత్తగా కాప్చర్ చేసే పనిలో కొండవీటి గోపీ గారు బిజీ.
కార్ చేరుకుంటుండగానే హిందీలో ఒక ఈత చెట్టుకు ఏర్పాటు చేసిన బోర్డు. దాని దగ్గర్లో రోడ్డు మీద నిలబడి ముచ్చట్లాడుకుంటున్న యువకులు. కొంచెం జరిగి కార్ కి దారి ఇచ్చారు. వారిలో మాంజీ కొడుకులు కూడా వున్నట్లున్నారు. మేం వాళ్ళ ఇంటిని పరిశీలించుకుంటూ లోపటికి వెళ్ళాం. పెద్ద వరండాతో కచ్చాఇల్లు బహుశా పేషెంట్ల కోసమే ఏర్పాటు చేసినట్లున్నారు. దానికి ఎడమవైపు మందులు తయారుచేసేందుకు నాలుగువైపులా ద్వారం వున్న మరో ఇల్లు అంతకు మరీ ఎడంగా ఒక దేవాలయం. మరింత ముందుకు పెంకుటింట్లో మాంజీ వుంటున్నారు. తలుపుకొట్టి పిలిచాం. పూజలో వున్నారు కొద్ది సేపు కూర్చోండి అని చెప్పారు. మేం చుట్టూ వాతావరణాన్ని చూసే పనిలో పడ్డాం. ఈలోగా ఒక అబ్బాయి ట్రేలో వేర్వేరు సైజుల్లోని స్టీలు గ్లాసులు పట్టుకుని బయటికి వచ్చి మాకు ఆఫర్ చేసాడు. అది బ్లాక్ టీ. నెమ్మదిగా సిప్ చేస్తూ చూట్టూ గమనిస్తే వైద్యం కోసం సేకరించిన కాయలు బెరళ్లు ఆరబోసారు. కోళ్ళు, గడ్డివాములో అందమైన ఒక బుజ్జి ఆవుదూడ. మందుల ఇంట్లో రేకు డబ్బాలో కట్టెలపొయ్యిమీద నడుస్తున్న పుటం. పక్కనే మూలికలు దంచడం కోసం లెగ్ ఆపరేటెడ్ రోకలి చట్రం. గమనిస్తుండగానే మాంజీ బయటికి వచ్చి కొద్దిసేపు మళ్ళీ అక్కడి తులసి కోటకు కూడా పూజచేసారు.
ఆ తర్వాత వైద్య కార్యక్రమం మొదలయ్యింది. ఇక్కడింకో ప్రత్యేకత ఏమిటంటే రోగి తన రోగలక్షణాలు ఆయనకు చెప్పనక్కరలేదట. రోగి నాడిని పరిశీలించి మాంజీనే వారికి ఏమేమి ఇబ్బందులు వున్నాయో చెప్పడం చేస్తుంటారట. దాదాపు ఆయన చెప్పిన తర్వాత అవును కాదూలే కానీ అదనంగా చెప్పాల్సిన అవసరం రాకుండానే మెడిసిన్ తీసుకుంటుంటారు అని చెప్పారు. నాడీ పరీక్ష ప్రాచీన ఆయుర్వేద వైద్య పద్దతే దానిలోని అష్టస్థాన పరీక్షలలో (రోగి నాడి, శరీర స్పర్శ,, రోగి రూపం, హృదయ స్పందన లాంటి శబ్దాలను, నాలుక నేత్రాలు, మలాన్ని, మూత్రాన్ని,) ఇదొకటి. వైద్యుడు రోగి యొక్క అంతర్గత భౌతిక, శారీరక లక్షణాలను, మానసిక స్థితి, స్వభావాలను శ్రధ్ధగా గుర్తిస్తారు.. రోగికి సంబంధించిన ఇతర అంశాలను, అంటే శరీరంలో ప్రభావితం కాబడిన ధాతువులు, కణజాలం, రసాలు, రోగం కేంద్రీకృతమైన ఉన్న చోటు, రోగి నిగ్రహం, తట్టకోగలిగే శక్తి అతని దినచర్య, ఆహారపు అలవాట్లు, చికిత్సా సంబంధిత పరిస్ధితుల ప్రాధాన్యత వల్ల కలిగే ప్రభావం, జీర్ణం చేసుకోగలిగే పరిస్ధితులు, రోగి యొక్క వ్యక్తిగత, సాంఘిక, ఆర్థిక, పర్యావరణ సంబంధిత పరిస్థితి అనే అంశాలను కూడా అధ్యయనం చేస్తారు. కానీ ఈయన కేవలం నాడిని ప్రధానంగా గమనిస్తారు. ఇప్పుడు కరోనా నేపద్యంలో రోగిని సరాసరి తాకకుండా ఒక పాయింటర్ లాంటి కర్రపుల్ల ఒకచివర మనల్ని పట్టుకోమ్మని మరోవైపు ఆయన పట్టుకుని పరిశీలిస్తున్నారు.
మేం కూడా నాడి చూపెట్టుకున్నాం, నాకు గ్యాస్ లేదు బిపి వుంది మోకాళ్ళ నొప్పులు వున్నాయి అని చెప్పారు. గ్యాస్ ఇబ్బంది లేకపోవడం, బిపి అప్ అండ్ డౌన్స్ వుండటం నిజమే మోకాళ్ళ నొప్పులు లేవుకదా అని మిత్రులతో చర్చిస్తే బహుశా రాబోయేది ముందు తెలిసిందేమో అంటూ ముక్తాయించారు. నిజం చెప్పొద్దూ కొంచెం బితుక్కుమంది కూడా. ఈ లోగా బాబాయ్ కి మెడిసిన్ గుడిలో పూజచేయించి ఇస్తామన్నారు. లిక్విడ్ కోసం ఒక బాటిల్ కావాలంటే ఖాళీ మంచినీళ్ళ బాటిల్ రడీ చేసుకున్నారు. ఇంకా కొంద మంది విజిటింగ్ కోసం వచ్చారు. వాళ్ళతో కొద్దిసేపు వచ్చీరాని హిందీతో మాట్లాడే ప్రయత్నం చేసాం. Folklore knowledge among the tribal communities of Chitrakaoot valley, Some Rare Plants Used By Hill – Korwa In Their Healthcare From Chhattisgarh by Amia Ekka లాంటి నెట్ నుంచి రిఫర్ చేసిన రీసెర్చి పేపర్లు గుర్తొచ్చాయి. పైగా ఇనుప ఖనిజం అత్యధికంగా వున్న చోటా డోంగర్ ప్రాంతంలో మొక్కల పెరుగుదలపై దాని ప్రభావం ఏవిధంగా వుంటుందో పరిశోధనలు జరిగాయో లేదో తెలియదు. అల్లోపతికి అందనంత లోతుగా ఇక్కడ నిజంగా ఆయుర్వేద పరిజ్ఞానం వుందా? లేక అమాయక నమ్మకం ప్లాసిబో ఎపెక్ట్ తో నివారణలను నమ్మబలుకుతోందా? Wim hof లాగా పాఠ్య పుస్తకాలను తిరగరాయించే కొత్త అంశాలు వుండే వుంటాయా? ఏమో తేల్చగలిగేది దీనిపై తగిన పరిశోధనలు జరిగినప్పుడే కదా. నిజమే అయితే ఇది మరింత మందికి అందుతుంది. ఒకవేళ కేవలం నమ్మకం ఆధారంగా ప్రభావం చూపేదయితే దూరాలనుంచి వచ్చేవారి ఖర్చులు మిగులుతాయి.
కొసమెరుపేమిటంటే మాకు మళ్లీ రెండోసారి నాడిచూపించుకునే అవకాశం వచ్చింది. అచ్చంగా ఇంతకు ముందు చెప్పిందే అందరికీ అలాగే చెపితే నాడి రీడింగ్ విషయంలో ఇక నమ్మి మందులు కొనుక్కోవలసిందే లేదంటే పునరాలోచిద్దాం అనుకున్నాను. రెండోదే జరిగింది. ఈసారి నాడీ విశ్లేషణలో ఫలితం వేరేగా చెప్పారు. కారణం లోతుగా తెలియదు. కాకపోతే ఒక చక్కటి వాతావరణాన్ని చూసివచ్చిన అనుభూతి మాత్రం మనసులో నింపుకున్నాం. ఆయన నిజాయితీగా మాట్లాడిన మాటలు కూడా నచ్చాయి. నేను ఎక్కడా విద్య నేర్చుకోలేదు. మా వంశంలో నా ముందు తరం ఎవరూ వైద్యులు కారు. మాతా శీత్లాదేవి నాతో ఏం చేయాలో పలికిస్తుంది అని చెప్పారు. చాలా పెద్ద వయసుకు వచ్చారు. శారీరకంగా కొంత కష్టం అయినా అలాగే తను నమ్ముకున్న పనిని చేసుకుంటూ వెళుతున్నారు. ఎక్కడెక్కడినుంచో తనకోసం రోగులు వస్తారని ఆయన దాదాపు ఎప్పుడూ ఆ ఇంటిని వదిలి వేరే ఊర్లకు వెళ్లరనే విషయం మరీ ఆశ్చర్యంగా అనపించింది. ఆయనగారి పిల్లలకు మందుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వాళ్లే తయారీ చేస్తున్నారు. ఏళ్లతరబడి యూనివర్సిటీల్లో వైద్యవిద్య నేర్చుకున్నవాళ్ళు కేవలం దాన్నివ్యాపారకదోరణిలోనే చూస్తున్న వేళ, రోగికి ఉపశమనం కలిగించడం ఒక పవిత్ర వ్యాపకంగా దైవకార్యంగా తల మీద పెట్టుకున్న ఆయనకు మనసునిండా కృతజ్ఞతతో రెండు చేతులూ జోడించి ధన్యవాదాలు చెప్పుకుని తిరుగుప్రయాణ: అయ్యాం.
ఇలా ప్రత్యామ్నాయ వైద్యపద్దతులతో అనేక చోట్ల ప్రజాదరణ పొందిన వారున్నారు. నేను కేవలం మేము సందర్శించిన ఒక చోటుని గురించి చెప్పాలని మాత్రమే ఇది రాస్తున్నాను. దీని క్వాలిటీపై భరోసా ఇవ్వడం కోసం మాత్రం కాదు. మీరు ఒకవేళ ఏదైనా రెమిడీ కోసం వెళ్లాలనుకుంటే మరింత లోతుగా వివరాలు ఎక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ప్రయాణం పెట్టుకోండి.
ధన్యవాదాలతో
మీ
కట్టా శ్రీనివాస్.
Katta.khammam@gmail.com
ఆదీవాసీ ప్రాంతపు వైద్య నమ్మకాలు, నమ్మక వైద్యాలూ : చత్తీస్ ఘడ్ లోని చోటా డోంగర్ గ్రామంలోని వైద్యరాజు హేమచంద్ర మాంజీ...
Posted by Katta Srinivas on Sunday, 14 February 2021
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి