దండకారణ్య ఆదివాసీ జీవనం నుంచి మనుగడ పాఠాలు

 

దండకారణ్య ఆదివాసీ జీవనం నుంచి మనుగడ పాఠాలు



మొన్నీమధ్య ఒకరోజు ఫోన్ లో  ఒక ఆత్మీయమిత్రుడు ముద్దుగా హెచ్చరించాడు, ఫేస్ బుక్ పోస్టులను మరీ సీరియస్ గా రాస్తున్నావు. సోషల్ మీడియా మిత్రుల అటెన్షన్ స్పాన్ చాలాతక్కువ అన్నారు. ఏమో నా రాతులు చదివే మిత్రులకు సాధ్యమయినంత సమగ్రంగా విషయాన్ని అందించాలి అనే కట్టా దోరణికి అలవాటు పడేవుంటారు అందుకే ఇదే దారిలో వెళ్తున్నాను అని చెప్పాను.

మరో రోజు

డిగ్రీ స్నేహితురాలి ఇంటికి పాతికేళ్ల తర్వాత పలకరింపుగా వెళ్ళాము. ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళ బిడ్డ సంభాషణేమీ పట్టకుండా ముభావంగా ఎటో ఆలోచిస్తూ వుంటే నేనే దగ్గర కూర్చోబెట్టుకుటని ముచ్చట మొదలేసాను. మనం తినే రైస్ ఏ ప్లాంట్ నుంచి వస్తాయిరా నుంచి మరి కొబ్బరినునె ఏ చెట్టు, మంచినూనె ఏ చెట్టునుంచి ఇలా అడుగుతుంటే తను సరదాగా టాపిక్ లో ఇన్వాల్వ్ అయ్యింది కానీ అవ్వన్నీ మోర్ నుంచి, మార్ట్ నుంచి కాకపోతే అమెజాన్ ఫ్లిప్ కార్ట్ ల నుంచి వచ్చే పదార్ధాలుగానే చూస్తోంది. వాళ్ళ మమ్మీ మా సంభాషణంతా వింటూ దీనికి ఈ సంగతులు తెలియవని గమనించలేదు శ్రీనూ, ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు తిప్పిచూపిస్తాను అంది.

నిన్ననే ఆదివాసీ సంతల్లో తిరుగుతున్నప్పుడు

భారతదేశపు మూలాలు సాంస్కృతిక అలవాట్లను అచ్చంగా అర్ధం చేసుకోవడం ఎలా అని ప్రశ్న వేసుకుంటే, ఒకసారి ఆదివాసీ సంస్కృతిని చూడరా అబ్బాయ్ అనేదే సమాధానం. మరి దేశం దట్టమైన అడవులున్న దండకారణ్యం సర్కిల్ మాకు దగ్గర కూడా, అశ్వారావుపేటలో వుండగా ఆరోగ్యశాఖ జి శ్రీనివాస్ గారూ, అగ్రీకాలేజి ప్రొఫెసర్ విద్యాధర్ గారి సహకారంతోనూ మిత్రల తోడ్పాటుతోనూ కొన్ని గ్రామాలు చూసాను.  ఈ మధ్య అరవింద్ ఆర్యా, కొండవీటి గోపీ, జగన్మోహన్ రావు బాబాయ్ గార్లతో భద్రాచలం నుంచి ఆంద్ర, బస్తర్, ఒడిస్సాకు ఇటు శివార్లలోని గూడేలలో తిరగటం కుదురుతోంది. కానీ గ్రామంలోపటికి వెళ్లడం,  వారిని డిస్టర్బ్ చేయకుండా అటెన్షన్ స్థితిలో బిగిసిపోనివ్వకుండా జీవన విధానం గమనించడం కొంచెం కష్టమే. దానికి కనుక్కున్న చిన్న దగ్గర దారి అయితే వారందరూ సంస్కృతిని మోసుకుంటూ వచ్చే సంతలను పరిశీలించగలగటం అనుకున్నాం. 

 

చట్టి, సుక్మా, జగదల్ పూర్ లాంటి చోట్ల ఆ చుట్టుపక్కల ఆదివాసీ గ్రామాల నుంచి వచ్చే గిరిజనులు వారి ఉత్పత్తులను అమ్ముకుని కావలసినవి కొనుక్కుని వెళుతుంటారు. దీనిలో వారి సహజ పర్యావరణం నుంచి గ్రహించే ఆహార అలవాట్లు, ఆ క్రమంలో కాపాడుకుంటున్న విత్తన సంపద, దినచర్యకు అడ్డంరాని వస్త్రధారణ, ఉన్నంతలో అందంగా చూపించుకునే అలంకరణ సామగ్రి, సొరకాయ బుర్రలు, వెదురుబొంగులు వంటి సహజ పాత్రలు, పనులకు తోడ్పడే ఆయుధ సామగ్రి,  ఆత్మీయ మానవ సంభందాలు, రిలాక్స్ కావడానికి ఉపయోగించుకునే మత్తు మాదక పదార్ధాలు, ఆరోగ్య రక్షణకు తీసుకునే జాగ్రత్తలు, ఇలాంటివి అన్నీ ఒకదగ్గరే చూడటం కుదిరే చక్కటి ప్రదేశం నిజంగా ‘‘సంత’’

ఆహారం :

మనం మరీ సెంట్రలైజ్డ్  వ్యవస్థలో ఆహారాన్ని పారేసుకుంటున్నాం. షాపింగ్ మాల్స్ లో శుభ్రం చేసి పొట్లాలు కట్టిన పదార్ధాల నుంచి, రెడీ టూ కుక్ వరకూ  ఆ తర్వాత వండిన వాటినే ఒక్క క్లిక్ తో ఆర్డర్ చేయడం వరకూ వచ్చాం. ఇప్పుడు అసలు ఇంట్లో వంటగదినే ఎత్తేసి మూడు పూట్లా ఉన్నచోటకే ఆర్డర్ చేసి నెలవారి బిల్లులు కడితే సమయం మిగులుతుందనే పరాధీనతను ఆధునికత అనుకునే దగ్గరకొచ్చాం. పెళ్ళిళ్ళవంటి శుభకార్యాలకు ఆన్ లైన్ ప్రసారం చేస్తే, యూపిఐ గిప్ట్ లు పంపితే, అతిధులకు కోరుకున్న అడ్రస్ లో ఆహారాన్ని ఒకే సంస్థద్వారా పంపేలా నెట్ వర్క్ ను మలచుకునే రోజుల్లో, మిక్సీ లేకుండా రుబ్బుకునే పిండి, మిక్సీ లేకుండా నూరుకునే రోలు, పొత్రం, మిల్లు లేకుండానే పప్పులను జిమ్ వర్క్ అవుట్ ను ఇచ్చే ఇసుర్రాయి, వడ్ల దంపుడు గుంట గురించి అర్దం అయ్యేలా ఎలా చెప్పాలి. మంచినీళ్ళకు కూడా ఎవడో నింపి తీసుకు వచ్చే డబ్బా కోసం బ్రతకడం పరాధీనత అని, ఒక్క ట్యాంకులో జరిగే పొరపాటు అనేక మంది ప్రాణాలతో ఆడుకునే చెలగాటం అవ్వడమే ఆధునికత అనుకుంటుంటే అది ప్రకృతికి దూరం కావడం, పరోక్షంగా మనుగడను కోల్పోవడం అని అర్దం అయ్యేలా ఎలా చెప్పాలి.

ఎర్రచీమల పచ్చడి గురించి విన్నారా?

1.      మామిడిచెట్ల వంటి చోట తిరిగే ఎర్రచీమలను వాటి గుడ్లను సంతలో అమ్ముతారు. ప్రపంచ ఆహార సంస్థ పెరుగుతున్న మానవాళి ఆహార అవసరాల కోసం ప్రోటీన్ లభ్యతకోసం ఆర్ధోపొడా వైపు చూడాల్సిందే అన్న సంగతి వాళ్లకు తెలియక ముందునుంచే, చత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఝార్ఖండ్, మన దగ్గర భద్రాద్రి చింతూరూ ప్రాంతాలలో వీటిని పచ్చడిగా నూరుకుని తినడం ఆనవాయితీ. మాకు కూడా దాదాపు అన్ని సంతల్లో మొదుగ వంటి ఆకు దొప్పల్లో చీపురు పుల్ల బద్దలతో విస్తరాకుల మాదిరి ప్యాకింగ్ చేసి అమ్మడం కనిపించింది. కుడుతున్నా లెక్కచేయకుండా చెట్లను ఎక్కి పుట్టల వెంబడి తిరిగి ఎర్రచీమలు వాటి గుడ్లను సేకరిస్తారు. రోట్లో పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, అల్లం ముక్క వంటివి కచ్చపిచ్చగా దండి చివర్లో వీటిని కలిని మళ్లీ నూరుతారు. చివర్లో కొంచె గల్లుప్పు వేసి రుబ్బినట్లు తిప్పుతారు.ఈ మధ్య అవసరం అనుకుంటే కొంచెం బెల్లం లేదా పంచదార కూడా వేస్తున్నారట.  ప్రముఖ సెలబ్రిటీ ఛేఫ్ గార్డన్ రామ్సే తన వంటకాల మెనూ లో ఈ పచ్చడిని ప్రత్యేకంగా చేసి అనేక మంది సెలబ్రిటీలను ఆశ్చర్యానికి గురిచేసాడు. గూడేలలో చేసే నూనెలూ, తాలింపులూ అవసరం లేని క్షణాల్లో తయారయ్యే చట్నీ రోటీ లేదా అన్నం లేదా అంబలిలతో తింటే నాలుకను చురుక్కుమనిపించి కళ్ళలో నీళ్ళు తిప్పేంత మిర్చిఘాటు వున్నా దాన్ని సమం చేసేలా ఎర్రచీమల పులుపు వుంటుంది. అదోక ప్రత్యేక మైన రుచి ఈరోజే ఇంట్లో తయారుచేసుకుని చూసాం కాకపోతే కొంచెం కారం తక్కువగా వుండేలా. మంచి కంటిచూపుకు, జలుబు అలసట ఆయాసం తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుందని వాళ్ళు నమ్ముతారు. ప్రోటీన్ పుష్కలంగా వుండే ఈ చట్నీలో ఫార్మిక్ ఆమ్లం (HCOOH) తో పాటు,  జింక్, కోబాల్మిన్, కాపర్, పొటాషియం లతో పాటు ఇమ్యూనిటీని బూస్ట్ చేయగల కారకాలు వున్నాయట. ఈ మధ్య ఏకంగా ఇది కోవిద్ 19 దరిచేరకుండానూ నివారణకూ అద్భుతంగా పనిచేస్తుందంటూ మీడియాలో హల్ చల్ చేసింది. (https://www.atlasobscura.com/foods/red-ant-chutney-chaprah-india

) దానికి కారణం బరిపదలో ఇంజనీరుగా పనిచేస్తున్న పరిశోధకుడు నాయధర్ పాథియాల్ ఒరిస్సా హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారు. కేంద్ర ఆరోగ్య శాఖకు, ఆయుష్ కు అప్పీల్ కూడా చేసారు. ఈ ఎర్రచీమల చట్నీకి కోవిద్ నివారణా గుణాలున్నాయి వాటిని విస్త్రుత స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా చూడమని కోరారు. ప్రస్తుతం ఈ దిశలో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అదటుంచితే పరిసరాల్లోని ఆహారవిలువలు కల పదార్ధాలను వినియోగంలోకి తేవడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి.

ఉసిళ్లు అనే రెక్కల కీటకాలు తొలకరి వర్షం సమయంలో బయటికి వస్తాయి వాటిని కొంచెం ఎండ బెట్టి పాప్ కార్న్ మాదిరి తింటారు.

తామర కాడలు, గింజలు, తూళ్ళు ముక్కలుగా కోసి తింటారు.

అడవి చెట్లకు కాసే అనేక కాయలు, ఆకులు, బెరళ్ళు, పుట్టగొడుగులు(శిలీంద్రాలు), నాచు (శైవలాలు), పరాన్న జీవ మొక్కలు, పిట్టలూ జంతువులు వంటివి వారి ఆహారంలో భాగంగా వుంటాయి. ఈ రంగంలో పరిశోధన ఎవరైనా చేయగలిగితే తినే పదార్ధాలను మాత్రమే కాదు వాటిని ప్రాసెసింగ్ కుకింగ్ చేస్తున్న విధానాలు దానిలో సమయాన్ని వనరులను ఆదాచేసే పద్దతులను కూడా నమోదు చేయడానికి మంచి అవకాశం వుంటుంది.

ఆహార సేకరణ

 వేట వ్యవసాయం రెండింటిలో కొంత ప్రత్యేకత వుంది. అడవి కాకర కాయలు కోసుకున్నాసరే నేలగుమ్మడి తవ్వుకున్నా ఉర్లగడ్డలను తెచ్చుకున్నా వాటిని సాధించడం మాత్రమే కాదు అవి పూర్తిగా తుడిచి పెట్టుకు పోకుండా పునరుత్పత్తికి మిగిలేలా సేకరణ చేయడం గమనించాలి. ఇక్కడ పెంచే ఆవుల పాలను కేవలం వాటి దూడలు మాత్రమే తాగుతాయి అంటే నమ్ముతారా? తేనె సేకరించడానికి కూడా సమయం సందర్భం లెక్కలేసుకోవడం తెలుసు అమావాస్యకు ఆరగిస్తాయి. పున్నమికి పూజిస్తాయి అంటూ ఎప్పుడు తేనె తొట్టెను తెచ్చుకుంటే మంచి తేనె నిండుగా దొరుకుతుందో వారి అనుబవాలను సామెతలుగా తర్వాతి తరాలకు అందిస్తారు.

పాత్రలూ నిల్వ సామగ్రి

ఆకుల దొప్పల నుంచి, వెదురు కర్ర వంటి వాటితో చేసే సామగ్రి ఎండిన కాయలను తొలిచి లోపట శుబ్రం చేసి బయట మొసేందుకు తాళ్లతో అల్లి తయారు చేసుకునే పాత్రలు, కుండలూ, రాతి తొట్లు వంటివి ఆయా పరిసరాలలోని లభ్యతకు అనుగుణంగా తయారుచేసుకుంటున్నారు.

ఇళ్ళూ వాకిళ్ళూ

ఎండావానల నుంచి రక్షిస్తూనే విద్యుత్తు వాడకుండానే దారాళంగా గాలీ వెలుతురు అందిస్తూ రక్షణ నివ్వగల నిర్మాణాలను స్థానికంగా దొరికే కలపతో చేసుకుంటున్నారు. పెంకు రేకు కప్పులతో పాటు, రాతిపలకల కప్పులు కూడా కనిపంచాయి. వెదురు తడికలు, తీగల తడికలకు సిమ్మెంటూ, పెయింట్స్ అవసరం లేకుండానే మట్టి అలుకుడు వాటిపై సుద్ద బొమ్మలూ వేస్తున్నారు. అవే ఇళ్ళలో ధాన్యపు నిల్వ గాదెలు, పదార్ధాలు దాచుకునే ఉట్లు, దంపుడు గుంటలు ఎక్కడికక్కడ అమర్చుకుంటున్నారు. వారి ఆవరణల్లోనే పశువులు కూడా ఒదిగిపోతున్నాయి వాటి వ్యర్ధాలు కూడా అదే ఇంటి ఆవరణలో ఎరువులుగా మారుతున్నాయి.

ఆయుధాలు, పనిముట్లు

చెట్టు పుట్ట చెలపటం కోసం, పురుగూ పుట్రా నుంచి రక్షన కోసం పిట్టా చేపను పట్టడం కోసం కత్తి, విల్లు బాణం ఈటె ఉండేలు వంటి అనేక ఆయుధాలను వాడతారు. వ్యవసాయానికో, తయారీలకో ఆనేక పనిముట్లను స్వంతంగానూ, జంతువుల సహాయంతో ఆపరేట్ చేయగలిగేలాగానూ వాడుతున్నారు. వెదురు బుట్టలు చాలా ఆకర్షణీయంగా వివిధ పనులకు ఉపయోగపడేలా తయారుచేస్తున్నారు. చేట, జల్లెడ, గంప, జల్లిబుట్ట, లాంటివి వివిధ పరిమాణాలూ ఆకారాల్లో కనిపిస్తాయి. కొన్ని బుట్టలపై రంగుబట్టకుట్టి దానిపై గవ్వలను అందంగా అమర్చుతున్నారు.

కట్టూ బొట్టూ

చలి ప్రాంతంలో సూటూ బూటు తో పాటు పీకకు టై పేరుతో ఒక తాడూ, నడుము దగ్గర గాలిపోకుండ  చొక్కా లోనకి కుక్కడం అవసరం కావచ్చు ఆ అనుకరణే నాగరికత అనుకోవడం మాత్రం దౌర్భాగ్యం. అదే పంచె పండుగకు ప్యాంటు పొడవుగానూ, ప్రయాణపు నడకల్లో త్రీఫోర్డు గానూ, పంచచేల పనిలో షార్టు గానూ, పొలంకాపాలకు పడుకున్నప్పడో, కట్టెలకు వెళ్లి ఆగినప్పుడో దుప్పటిగానో మారిపోయే మాల్టీ డైమెన్షన్ డ్రస్ పేరు పంచె చీరే కావడం చిన్నతనంగా ఎందుకనుకుంటారో.  ఒక్క తుండుగుడ్డ ఎండను కాచేప్పుడు టోపీ గానూ, దెబ్బను కాచే హెల్మెట్ గానూ, ముఖం కడుక్కుంటే టవల్ గానూ, పడుకోబోతే తలదిండు గానూ, బరువు ఎత్తితే నడుముకి బెల్డ్ గానూ, తలపై బరువు మోపితే కుషనింగ్ గానూ దెబ్బతగిలితే కట్టుగుడ్డగానూ పలురూపాల్లోకి మారే గుణం వున్నప్పుడు ఒక్కోపనికి ఒక్కో వస్తువుని కొనుక్కుని దాచలేక ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదేమో. ఎండవేళ గాలాడే లాగానూ, చల్లదనపు  వేళ కప్పివుంచుకునేలాగానూ, కాయకష్టం చేస్తున్నప్పుడు కాళ్లూచేతులకు అడ్డం రాకుండా వుండేలాగానూ అనుభవాల కాల క్రమంలో తయారయిన వస్త్రాలు ఇవ్వాళ అనుకరణ ప్రవాహపు ఉదృతిలో అన్యాయంగా కొట్టుకుపోతున్నాయి. నాణేలూ, పూసలూ, దారాలూ, గింజలూ, కాయలూ లోహనాణేలూ అలంకరణ సామగ్రిగా ఒదిగిపోతున్నాయి.

మత్తు, వినోదమూ ఆరోగ్యమూ

తాటి, ఈత, ఖజ్జూర కల్లులతో పాటు జీలుగు మొక్కనుంచి వచ్చే కల్లు, ఈ కల్లులనుంచి తీసే చిగురు అనే ఆల్కహాల్ పదార్ధం. పొగాకుతో చుట్టా బీడి వంటివి వాడుతున్నారు. వైన్ షాపులను ఇప్పటికీ ఇంగ్లీషోడి సారాయి కొట్లుగానే పిలుస్తారు. సంతలలో కడవల కొద్దీ ఈ ద్రవాలను అమ్ముతున్నారు. పులియబెట్టిన ద్రవాలనుంచి ఇథైల్ ఆల్కహాల్ ను కాగబెట్టి చల్లార్చే కుండలను చాలా బహిరంగంగా అమ్మాకాలు చేస్తున్నారు.

చాలా ఆరోగ్య సమస్యలకు మౌఖికంగా వంశ పారంపర్యంగా అందిన సమాచారం ఆధారంగా మూలికలు ఆకుల మందులు వాడుతున్నారు. ఏయే జబ్బులకు ఎటువంటి మందులు వాడతారు అనే పరిశోధనా ప్రతులు కూడా ఇప్పటికే అనేకం నమోదు అయ్యాయి. ఎవరినైనా వైద్యుడు అని నమ్మితే వాళ్ళకి వైద్యం తెలిసినా లేకున్నా ఎంత బలంగా నమ్ముతారో తెలిపే ఉదాహరణలు కూడా వున్నాయి.

పూజలూ, పండుగలు

పొలాన్నీ, నేలనూ,పూర్వికుల జ్ఞాపకాలనూ, వారి నమ్మకాలనూ పూజించడం పండుగ చేయడం నిష్టగా ఆచార బద్దంగా జరుగుతుంది. నిజానికి వారి పూజావిధానాలు తెలుసుకోవడం వాటి మూలాలూ కారణాలు అన్వేషించడం వంటి పరిశోధనలు లోతుగా జరిగినట్లు లేవు.అప్పుడెప్పుడో యండమూరి నవలల్లో రాసినట్లు బస్తర్ అడవుల్లో కాద్రా కాష్మోరా ప్రయోగాలు వంటివి గుర్తొస్తుంటాయి. లేదా నక్సల్ పోరాటాలూ పేళుళ్ళూ గుర్తొస్తుంటాయి. దానికి మించిన జీవన రహస్యం ఏదో ఇక్కడ దాగుంది.

బై చెప్పే లోగా ఒక చిన్న ముక్తాయింపు

వెతుకుతూ వుంటే ఇదెంత లోతైన అంశమో అర్ధం అవుతూ వుంది బహుశా ఇంతపొడవూ చెప్పిన సంగతులు బ్రీఫ్ గా స్థాలీపులకంగా నైనా తాకగలిగానో లేదో కానీ దీనినుంచి నేర్చుకునే సంగతులతో నాలుగురోజుల పాటు నిలబడే సమాజనిర్మాణానికి రీ లెర్న్ చేయాల్సిన అవసరం వుందనేది గుర్తించాల్సిన సంగతి. దానికోసం మొరటుగా బిగిసిన కొన్ని చట్రాల వెనకున్న సిద్ధాంతాలను అన్ లెర్న్ చేయాల్సిందే. అభివృద్ధి నిర్వచనాలు మారాలి. ఎటునుంచి ఎటునడవాలో కనిపించే వెలుతురు సాయంతో వెతకాలి. గ్లోబలైజేషన్ కావచ్చు కేంద్రీకృత వ్యాపార దోరణుల పడగనీడ కావచ్చు అలసత్వాన్ని పెంచుతూ ఎంతవరకూ మనిషిని పరాధీనుడిని చేస్తోంది. విపత్కర పరిస్థితులను ఎదుర్కునే శక్తిని మానవాళికి మిగుల్చుతోందా లేదా కొద్ది మంది కొంత కాలం ఐశ్వర్యవంతులుగా బ్రతకడం కొసం మొత్తం భూమండాల్ని వారి గుప్పెట్లోకి లాక్కుంటుంటే తప్పనకుండా ఊరికినే వుంటామా? పర్యావరణం క్షీణించడం అంటే భూమిపై జీవరాశితో పాటు మనిషిమనుగడకు కూడా మప్పే అని అర్ధం అయినా ప్రత్యామ్నాయం ఎక్కడుందో వెతుక్కోవడం ఎందుకు చేయలేం. దానికి తగిన ప్రణాళికలు ఎందుకు రూపుదిద్దుకోవు?

 

 

 

 

కామెంట్‌లు