#భద్రాద్రికథలు
ఒక ఆలయం పేరుచేపితే అక్కడి దేవుడితో పాటు ఆయన భక్తుడి పేరు కూడా గుర్తుకురావడం, ఇతర మత పాలకుల క్రింద పనిచేస్తూ తన పరిధులను పరిమితులను పట్టించుకోకుండా శంకరగిరి మన్యంలో రోడ్డు సౌకర్యం ఏమాత్రం లేనిచోట సర్వాంగ సుందరంగా గుడి కట్టడము దానివెనకున్న త్యాగము బహుశా భక్తుల మనసులో నిబద్దతా చిహ్నమైన అదనపు ఆకర్షణ అయ్యివుంటుంది. అటువంటి దాసభక్తి పరంపర కథలు భద్రాద్రి చరిత్రను అల్లుకుని ఇంకా ఉన్నాయి.
ఈ కధ కంచర్ల గోపన్నకు రెండువందల ఏళ్ల తర్వాత జరిగింది.
అప్పట్లో భద్రాద్రికి ప్రయణమంటే ఎంతో ప్రయాస తో కూడుకున్నది. సరైన రోడ్డు మార్గం లేదు. అడవులగుండా వచ్చిన తర్వాత విశాల గోదారి నదిని దాటాలి. ఆ ప్రయాణానికి భక్తులు బాగా అలసిపోయే వారు.
ఇటువంటి పరిస్థితుల్లో రామదర్శనం లో భక్తులకు ఉడతా భక్తిగా సాయం చేయాలని, వారికి ఉచితంగా నిత్యాన్న దానం చేయడం తన జీవిత పరమార్ధమైన పనిగా పెట్టుకున్నాడు ఒకాయన. ఇంతకీ ఆయనకు అస్తిపాస్తులు ఏమీ లేవు, వంటికేసుకున్న కౌపీనం తప్ప కట్టుబట్టలే సక్రమంగా లేని వాడు.
భక్తుల గోదారి స్నానం పూర్తి కాగానే వేడి వేడి అన్నం ఇంత పప్పో కూరాకో వీలుంటే పచ్చడి బద్ద, కాసిన్ని మజ్జిగతో వాళ్ల ఆత్మారాముడిని శాంతిపజేసి పంపుతుండేవాడు. ఇంతకీ ఈ సరుకులు సంపాదించడానికి ఆయన యాయవార వృత్తి చేసే వాడు. ఇల్లిల్లు తిరిగి వాళ్లకు తోచింది దానం చేస్తే దాన్ని భక్తులకు ప్రసాదంగా వితరణ చేసేవాడు. భక్త కోటికి ఈ సంగతి తెలిసింది. వచ్చేవారి సంఖ్య పెరిగింది. అయినా ఆయన కూడా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేవాడు.
Happiness of giving బహుశా ఇవ్వడం తెలిసిన వాడే ఎంజాయ్ చేయగలుగుతాడు కావచ్చు, భక్తుల తాకిడి పేరగటాన్ని విసుగ్గా భారంగా కాకుండా, తన బాధ్యతను పెంచే గుర్తింపుగా సంతోషపడేవాడు. ఇందులో తను నిమిత్తమాత్రుడినేనని రాముడే తన ద్వారా భక్తులకు ఇంత పని చేయించుకుంటున్నాడని భావించేవాడు. ఏదైనా రాముడే చూసుకుంటాడన్న ధీమా ఒక్కటే ఆయన సంపద. ఏమీ లేనివాని అన్నదాన యజ్ఞం ఇలా నిరంతరాయంగా సాగుతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పెద్ద అవాతరం వచ్చింది. మంచిపనిలో బెంబేలెత్తకపోతే బహుశా కొన్ని కష్టాలు మరింత మెరుగు తేవడానికేనెమో.
వంటపాత్రలను ఎవరో ఎత్తుకపోయారు. అప్పటికప్పుడు ఎంతమందికి వండిపెట్టగల పాత్రలిక వారిదగ్గర లేవు. ఈ పనేదో తేమిలేలా లేదని వంటివాళ్ళు వెళ్లిపోయారు. ఈయన మాత్రం అదే నిబ్బరంతో రామా లక్ష్మణ మీరే దిక్కు అని భారం దేవుడిపై వేసి దిక్కులు చూస్తూ కూర్చున్నాడు.
మంచిపనికి అనుకోకుండా లభించే సాయం పేరే దేవుడు అయితే, హఠాత్తుగా ఇద్దరు కుర్రాళ్ళుబవచ్చారు. తాము వంటవాళ్ళమని ఈరోజు పని తాము చేసిపెడతామని, పైగా తమ దగ్గర వండటం కోసం రెండుంపెద్ద పెద్ద గుండిగ(వంటపాత్ర) లు కూడా ఉన్నాయని చెప్పడం ఏమిటి ఉన్న పళంగా పనిమొదలేసి రోజుటి సమయం లోగానే పూర్తి చేసేసారట.
కమ్మటి వాసన చక్కటి రుచి రోజుటి కంటే ఇంకా గొప్పగా ఉన్నాయంటూ భక్తులు లొట్టలు వేసుకుంటూ తిన్నారట.ఆ తర్వాత ఈ కుర్రాళ్ళ కోసం వెతికినా కనిపించలేదు. పైగా అటువంటి వంట గాళ్ళయిన అన్నదమ్ములున్నట్లు మాకేమీ తెలియదు అని ఊరివాళ్ళు బుగ్గలు నొక్కుకున్నారట. ఆశ్చర్యంగా అన్నదమ్ములు వాళ్ళు వంటచేసిన గుండిగలను అక్కడే వదిలివెళ్లారు. తర్వాత అవి కావాలని రాలేదు. గోపన్నకు విడిపించేందుకు టానీషాకు మాడలు చెల్లించిన అన్నదమ్ములే తన మాటను కూడా చెల్లించారని ఈయన సంబరపడిపోయాదట. ఆ తర్వాత అవే గుండిగలలో చేస్తున్న అన్న ప్రసాదం బావుంటోంది అంటూ భక్తుల్లో కూడా ప్రచారం పెరిగింది.
శ్రీరామ నీనామమేమి రుచిరా అనుకున్నాడు ఆయన.
భక్తులుపెరిగిపోతున్నారు. యాచించింది సరిపోవడం లేదు. రామా నీవే దిక్కు అనుకున్నాడు.
హఠాత్తుగా ఒక వాహనం వచ్చి సత్రం ముందు ఆగింది. అందులోనుంచి ఒక ధనవంతుడు దిగాడు.
అయ్యా... నాకు రాత్రి కల వచ్చింది. ఆ కలలో చనిపోయిన నా తల్లి కనిపించింది. మీ సత్రానికి నా భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పింది. నా నాలుగు వేల ఎకరాలు ఇదిగో మీకు రాసిచ్చేస్తున్నాను అని పత్రాలు ఇచ్చి వెళ్లిపోయాడు.
ఆయన ఒక పెద్ద వకీలు. హనుమకొండ ఆయన ఊరు. తుంగతుర్తి నరసింహారావు ఆయన పేరు.
ఇక ఆ సత్రానికి ఏలోటూ లేదు. నాలుగువేల ఎకరాలూ ఆ సత్రానివే.
సత్రం నడిపిస్తున్న ఆయన కొంతకాలానికి వృద్ధుడైపోయాడు.అన్నం పెట్టీ పెట్టీ పున్నెం గడించాడు. అంతా రాముడికే వదిలేశాడు. నాలుగువేల ఎకరాల్లో అంగుళం కూడా ముట్టుకోలేదు. దేవుడే ఇచ్చిన గోచీపాతను కూడా వదిలేసి ఒక రోజు ఆయన ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడు.
ఇప్పుడు గుడికి దారి కూడా మారిపోయింది. ఎవరూ పడవ దాటాల్సిన అవసరం లేదు. సత్రాన్ని కూడా అందరూ మరిచిపోయారు. సత్రం పాడుపడిపోయింది. గబ్బిలాల్లాంటి వాళ్లు వచ్చి చేరారు. నాలుగు వేల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా మిగల్లేదు. ఆ సత్రం పేరు చెబితే కూడా అదేమిటి అని అడిగేలా అయిపోయింది.
చాలా ఏళ్లయిన తరువాత ఈ మధ్యే కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరీ పీఠం తన అధీనంలోకి తీసుకుంది. శ్రీచక్ర సిమెంటు వారు దీనికి కావలసిన వనరులుసమకూరుస్తున్నారు. ఒక వేద పాఠశాల నడుస్తోంది. వేదవిద్యార్థులకు అక్కడ అన్నం దొరుకుతుంది. అంటే అన్నదాన యజ్ఞం మళ్లీ మొదలైందన్న మాట. ఆ సత్రం ముందు ఈ అన్నదాన యజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి విగ్రహం ఉంటుంది.
ఆయనే
పమిడిఘంటం వెంకటరమణ దాసు. 1850 లో పుట్టిన ఈయన ప్రకాశం జిల్లా నుంచి భద్రాచలం వచ్చాడు. ఇక్కడే జీవితమంతా గడిపేశాడు. ఆ సత్రం పేరు అంబ సత్రం.
నిన్న కొండవీటి గోపి గారితో కలిసి ఆ సత్రం దగ్గరకు వెతుక్కుంటూ వెళ్ళాం. అక్కడ రెండు గుండిగలను పచ్చటి వస్త్రం కట్టి, పూల మాల వేసి పీఠం పై ఉంచారు వాటి పేర్లు కూడా
రామ గుండిగ
లక్ష్మణ గుండిగ
భద్రాద్రి పై ధ0సా లాంటి వాళ్ళు దాడులు చేశారు, ధనము నగలు దోచుకున్నారు. పమిడిఘటం వెంకట రమణ దాసు గారు దానంగా గుడికోసం సంపాదించిన భూములనూ అన్యాక్రాంతంగా దోచుకున్నారు. కానీ విత్తనంగా నాటుకున్న ఒక పవిత్రభావనను మాత్రం అంటుకోలేక పోయారు అది చెట్టులా మారి నీడనిస్తూనే ఉంది. వచ్చిన వాళ్ళు మనుషులే కావచ్చు, ఇవి కొనుగోలు చేసిన గుండిగలే తెచ్చివుండొచ్చు. మనిషి చేసిన యజ్ఞాన్ని, దానివేనకున్న మొక్కవోని నిబద్ధతను అది పెనవేసిన దారాలను అవి అల్లుకున్న అనేక కుటుంబాలను వాటిలో పూచే తెల్లటి పువ్వులనూ చూడాలేమో.
కట్టా శ్రీనివాస్
11-01-2021
భద్రాచలం
Inspirational post
రిప్లయితొలగించండి