పుత్రోత్సాహం లాగా విద్యార్దోత్సాహం
సర్కారు నౌకరీ రాకముందు కాలేజ్ పూర్తయ్యి అవ్వకుండానే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసాను. పాతికేళ్లక్రితపు 'సత్తుపల్లి శారదా విద్యాలయం" విద్యార్థులు హైట్ లొనే కాదు చదువుల్లోనూ హోదా లోనూ ఎదిగిన ఎందరో విద్యార్థులతో పాటు ఈరోజు గడవడం నాకు నిజమైన సంక్రాంతి కావచ్చు .
అవే బల్లలపై పక్కపక్కనే కూర్చున్న విద్యార్థులు కళాప్రవాహంలో పాతికేళ్ల ప్రయాణించిన తర్వాత ఏయే తీరాలకు చేరారు. ఏయే వైఖరి తెడ్లు ఏ దిశగా నావను తోసుకెళ్ళాయి. గాలి వాలు అందరికీ అనుకూలంగానే ఉండదు కదా! ప్రతికూలత లోనూ తెరచాపతో స్వారీ చేసిందెవరు? తీరం దిశగా హాయిగా నెడుతున్న వాలుని రాళ్లకేసి నూకింది ఎవరు? అప్పటి కళ్లముందటి చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిల్లలతో ఎలా ఉన్నారు? ఇవ్వన్నీ ఆలోచనలను వెలిగించే వత్తులయితే.
తప్పిపోయిన ఆత్మీయులు ఏళ్ల తర్వాత ఇల్లు వెతుక్కుంటూ వచ్చి కళ్ళముందు నిలబడితే కలిగే సంతోషం మనసు గదినింపే సుతి మెత్తని వెలుతురు.
"సైట్లు ఏమన్నా కొన్నారా సర్?"
"లేదురా గూగుల్ లో పేరు సెర్చ్ చేస్తే సైట్స్ లో కనిపిస్తాను"
"మీరు చేస్తున్న పనులు, రాస్తున్న రాతలు మా పిల్లలకు చూపించి మా సార్ అని చెప్తున్నము"
"అంతకన్నా సంతోష పడే బహుమతి ఉంటుందా!"
"అప్పుడు చెప్పిన సో అండ్ సో నాకింకా గుర్తున్నాయి" "ఆ మాటల వల్లనే ఈ గ్రూప్ తీసుకుని ఈ ఫీల్డ్ లోకి వచ్చాను" "నా పేరు ఇంకా మీకు గుర్తుందా సర్" నేనా కష్టం లో వున్నప్పుడు పక్కనే నడుస్తూ నాతో చెప్పిన మాటలు ఇప్పటికీ ధైర్యం చెప్తున్నాయి, నేను కూడా అవసరం ఉన్నవాళ్ళతో మీలా భరోసాగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను'
ఏవేవో మాటలు తేనెను నాలుక మీద కాకుండా చెవిలో పోయడం అంటే ఏమిటో మనసుకి అర్ధం అవుతున్నట్లుంది.
"ఏమో ఇదంతా నేనేనా బహుశా చాలా కాలం తర్వాత కనిపించిన మాష్టారుతో మర్యాదగా ప్రవర్తించడం కోసం అంటున్నారేమో!" పోనీ ఇంకా సర్వీసు బోలెడంత ఉంది కదా అవి ఎక్సపెక్టషన్స్ అనుకుని అందుకునే ప్రయత్నం చేద్దాం పోనీ, పాఠాలకంటే ముఖ్యమైనవి పిల్లలు ఒక ఉపాధ్యాయుడినుంచి కోరుకునేవి ఏముంటాయో అర్ధం చేసుకుందాం"
" సర్లే ఇక నచ్చనివో నొచ్చుకున్నావో కూడా చెప్తే తిన్నగా ఎదగడం నేర్చుకున్నట్లే, వంకరలుంటే సవరించుకోవడం కుదిరేదేమో!" చూద్దాం మైక్ లో అవి చెప్పి ఇన్బాక్స్ లో ఇవేమైనా చెప్పక పోతారా!
ఎవరన్నారు ఉద్యోగ విధి డ్యూటీ ముగియగానే జీతం అందగానే అయిపోయిందని, కొన్ని పనులు జీవితకాలమంత పొడవైనవి. వాటి నీడ దానికన్నా విశాలమైనది.
జ్ఞాపకాల ముగ్గులకు ఆత్మీయ రంగులద్దిన పండగలాగా శారదా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అభినందనలతో
Sarada Vidyalayam Sathupalli Khammam dist
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి