◆◆ తిప్పాపురం వీరగల్లు || కట్టా శ్రీనివాస్ ||◆◆
చరిత్రను మలుపుతిప్పేటంతటి పోరాట వీరులు కూడా వారి చరిత్ర వారు రాసుకోరు కదా ఆ ఫలాలను అనుభవించే వారి భాద్యత అది. ధనమో అదికారమో సామాజిక గౌరవానికి దగ్గరగా వుండటమో వీరగాధలకు మరింత కాలం బ్రతికే అవకాశం ఇస్తాయి కావాచ్చు. మరి అడవుల కడపులో దాగిన మన్యసీమల లాగానే ఈ సీమల్లోని వీరుల గాధలు నెమరేసుకోవలసింది ఎవరు? మనం కాదా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్లమండలం లోని తిప్పాపురం గ్రామ శివార్లలోని ఒక చెట్టుక్రింద వున్న ఒక వీరుడి రాతి విగ్రహం అటువంటి అటెంన్షన్ కోరుకుంటోంది. కొంచెం మనసుపెట్టి పరిశోధిస్తే కాలగర్భంలో కలిసిపోకుండా కొన్ని కథలను గాధలుగా తను నిలబెడతా నంటోంది. అరడుగు మందం వున్న ఇసుక రాయి నాలుగుంబావు అడుగుల ఎత్తు (51 అంగుళాలు) సుమారు రెండున్నర అడుగులకు అటూఇటూగా మందం (27 అంగులాలు పైకొస 22 అంగుళాలు)తో వున్న ఈ విగ్రహం లో పరిశీలిస్తే ఎడమకు తిరిగిన వ్యక్తి కుడిచేత పట్టిన తుపాకీని ఎడమచేతితో ఎక్కుపెట్టి వుంచడం కనిపిస్తుంది. అతని నడుముకి పాతకాలం తుపాకీలలో కూరే తూటామందు భరణిని కట్టుకోవడం కనిపిస్తుంది. ప్రత్యేక ఆకర్షణ ఇతని కేశాలంకరణ ఆడవారిక అల్లినట్లు అందంగా అల్లిన జడ వెనకవైపున వేలాడుతూ కనిపిస్తుంది. ఇటువంటి జడ సంస్కృతి పురుష విీరులలో ఈజిప్టు ప్రాంతంలో కనిపిస్తుంది కానీ మనదగ్గర అటువంటి పద్దతి అమలులో వున్నట్లు నమోదయిన దాకలాలు కనిపించలేదు. ఇతని తలపై వున్న నాలుగంగుళాల పట్టీలాంటి చోట కాకతీయ శిలా శాసనాలలో కనిపించే సూర్యచంద్రులు ఆరుదళాలు వున్న పద్మానికి అటూ ఇటూ కనిపిస్తాయి. గుండ్రని సున్నాలా వున్న సూర్యుడు, నెలవంక రూపంలోని చంద్రుడు. ఇవి శాసనం తాలూకూ ప్రాచీన లక్షణాలను చూపుతుంటే తుపాకీ 15వ శాతాబ్ది తర్వాతి నవీనతను పట్టిస్తోంది. అంతే కాదు తుపాకీ తిరుగుబాటుదారుడేమో ఈ పోరాటవీరుడు అనిపిస్తుంటే అధికార చిహ్నాలు రాజ్యంకోసం పోరాడిన వీరభక్తుడేమో అనే చిహ్నాన్ని అందిస్తోంది.
చర్లప్రాంతపు జమీల గురించి మాల్యశ్రీ గారు మన్యభారతం పేరుతో ఒక పద్యకావ్యం రాసారు దానిలో స్వయానా వారి పూర్విక వంశపు వివరాలు శృతంగా అందిన విషయాలను క్రమంలో పొందుపరచుతూ నిర్మించారు. ఆ కథనపు కాలం 18 శతాబ్దపు చివర తుపాకీ పట్టుకోవడాన్ని తెలపడానికి ఈ కాలం సరైనదే అంతే కాదు కాకతీయ సామంత వంశాచారాలు అమలులో వున్నట్లు కూడా తెలస్తోంది. ఈ ప్రాంతంపై విస్త్రుతంగా పరిశోధనలు చేస్తున్న
డా అమ్మిన శ్రీనివాసరాజు
గారు అక్కడి మౌఖిక కథనాల సేకరణ ప్రకారం కూరం వీరస్వామిపై గతంలో ఒక ఆర్టికల్ రాసారు. ఇక్కడి స్థానికుడు నూప తిరుపతయ్య జనవరి 10 మరియు 11 తేదీలలో జరిగిన మా సందర్శన సందర్భంగా కొన్ని వివరాలను అందజేసారు. స్థానికంగా ఈ విగ్రహానికి కొలుపు చేస్తుంటారట. ప్రత్యేకంగా కొన్ని మొక్కులు కూడా చెల్లించుకుంటారట. ప్రతియేటా తొలి పంట నుంచి కొన్ని దోసిళ్ళ గింజలు ఈయనకు మొక్కుగా చెల్లించుకుంటారు. ఈ విగ్రహంలోని వ్యక్తి గురించిన స్థానిక కైఫియత్ మౌఖిక కథనం ఏమిటంటే గడికోట రాజ్యపు సైన్యాధ్యక్షుడిగా కోరం వీరస్వామి తన విధినిర్వహణలో శత్రువులతో హోరాహోరీ పోరాడి చివరికి అదే యుద్దంలో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. తిప్పాపురం, పెద్దముసిలేరు, చిన్నముసిలేరు గ్రామాలనుంచి అనేకమంది వనవాసీ యువత సైన్యంలో పనిచేసేవారప్పట్లో. అతని కోసం వెతుక్కుంటూ వచ్చిన కోరం వీరస్వామి భార్యకు అతని పార్ధివదేహం మాత్రం దొరకుతుంది. దాన్ని ఎంతో దుఃఖంతో ఆమె స్వగ్రామమైన తిప్పాపురం చేర్చుతుంది. హడావిడిగా వున్నంతలో అతని స్థాయికి భంగం కలగనీయకుండా ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ఊరికి ఆగ్నేయ దిశలో చితిపై ఆవునెయ్యిపోసి గ్రామ ప్రజలందరి సమక్షంలో ఆయనకు తుదివీడ్కోలు చెపుతుంది. ఆ తర్వాతి కాలంలో ఆయన జ్ఞాపకార్ధం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని కొలుస్తున్నట్లు తరాలుగా చెప్పుకుంటూ వస్తున్న కథనం అని ఆయన చెప్పారు. మరి ఈ కోరం అనే ఇంటిపేరు ఏ గట్టుకు చెందింది అటువంటి నాయకుడి ఆచూకీ ఈ రెండువందల ఏళ్ళ చరిత్రలో కనుమరుగైపోయిందా ఎక్కడైనా కనీస ఆధారాలు మిగిలాయా అని వెతికి చూడాలి. అలాగే కాకతీయ రాజులకు కప్పం కట్టకపోవడం వల్ల వారితో యుద్దం వచ్చింది అని కథనంలో చెప్పారు. కాకతీయుల కాలానికీ చర్లకోట మేదినిరాయుడు కాలానికి మధ్య పొసుగుతుందా లేదా అనేది కూడా సరిచూడాల్సివుంది. చారిత్రకంగా మనకు తుపాకీలతో పోరాడిన మరో వీరయ్య ఈ ప్రాంతం నుంచి దొరుకుతున్నారు. అది 1916-1917 ప్రాంతంలో జరిగిన లాగరాయిపితూరీ నిర్వహించిన మొట్టాడం వీరయ్య అనే మన్యం వీరుడు. ముఠాదారుడిగా పితూరీ నాయకుడిగా ఇతనికి బ్రిటీష్ ప్రభుత్వం ప్రవాస శిక్ష విధించింది. దానినుంచి ఆయన సాహసోపేతంగా రహస్య పద్దతుల్లో తప్పించుకు రావడంతోతిరిగి రాజవొమ్మంగి స్టేషనులో నిర్బందించారు. చివరికి 1922లో స్వయంగా అల్లూరి సీతారామరాజు ఈ రాజవొమ్మంగి స్టేషన్ మీద దాడి చేసినప్పుడు ఈ మొట్టాడం వీరయ్యను విడిపిస్తాడు. గాము గంటందొర, గాము మల్లు దొరల మాదిరి గానే అత్యంత నమ్మకస్తుడిగా స్వదేశాభిమానం కల వీరుడిగా అల్లూరి ముఖ్య అనుచరునిగా ఈ వీరయ్య పనిచేసాడు. రంపలో ద్వారబంధాల చంద్రయ్య, పులిచింత సాంబయ్య, రేకపల్లిలో అంబుల్ రెడ్డి, తమ్మన్న దొరలు తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన వారు.
ఒకప్పుడు రేకపల్లి ముసునూరి నాయకుల రాజధానిగా కూడా వుండేది. వారి తర్వాత కొండవీటి రెడ్డి రాజగు అనవేమా రెడ్డి తన బావమరిది కాటయ వేమునికి రాజప్రతినిధిగా నియమించాడు. 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు కోస్తా ప్రాంతాన్నంతా జయించాక కళ్లఇకోట యుద్దంలో విజయనగరం పతనం అయ్యేంత వరకూ తూర్పుగోదావరి జిల్లా విజయనగరంలో వుండేది. 1571లో ఈ ప్రాంతాన్ని గోల్కొండ నవాబులు జయించారు. 1748లో నైజాం వారసులలో వచ్చిన తగాదాలలో ప్రెంచివారు, ఇంగ్లీషు వారూ జోక్యం చేసుకున్నారు. దాంతో 1785లో చందుర్తి వద్ద ఇంగ్లీషు వారికీ ప్రెంచి వారికీ యుద్ధం జరిగింది. ఈ యుధ్దంలో ప్రెంచివారు ఓడిపోయారు ఆ చందుర్తి పేరు గెలిచిన ఇంగ్లీషు వారి నోట కాండూరని పిలవబడింది. 1860లో నైజాము ఇంగ్లీషు వారికిచ్చిన భద్రాచలం తాలూకా తూర్పుగోదావరి జిల్లాలో చేర్చబడింది. 1879లో రంపచోడవరం తాలూకాలోని రంప లో ప్రధానంగా రైతులో పాల్గొని చేసిన పెద్ద తిరుగుబాటు జరిగింది. దీన్నే రంపపితూరీ అంటారు. భద్రాచలం, నూగూరు, రంపచోడవరం ప్రాంతాలను మన్యం అంటారు.ఈ ప్రాంతంలో 1858, 1861,1862 లలో కూడా మన్నెదొరల దాష్టికాలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగినట్లు నమోదయ్యాయి. వాటిలో 1879 నాటిది మన్యం తిరుగుబాట్లలో చారిత్రాత్మకమైనదిగా పేరుపొందింది.. 1904 నాటికి ఈ జిల్లా మరీ పెరిగిపోయిందని పోలవరము డివిజన్ మినహాయింది గోదావరికి తూర్పువైపున వున్న ప్రాంతం తూర్పుగోదావరిగా మారింది. ఇటువైపు ఖమ్మంమెట్టులోనే కాదు రాష్ట్రానికే కొసప్రాంతాలుగా మిగిలాయి. ఇప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చివరకు వుంటూ కొన్ని కిలోమీటర్ల ప్రయాణంతోనే చత్తీస్ ఘడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లకు చేరుకునేలా వుంటుంది. నైజాం ఉర్దూ పర్షియన్ రికార్డులను డీకోడ్ చేసుకుంటూ అందుబాటులోకి తీసుకువస్తే కూడా కొన్న నమోదులు నైజాం పాలనాకాలంలోని కొన్ని ముఖ్యఘట్టాలకు వెలుగు ప్రసరింపజేసే అవకాశం వుంటుంది.
ఇక ఈ ప్రాంతపు వీరులు, పోరాటాల ముచ్చట క్రమం అలా వుంచితే ఇక ఆయన కేశాలంకరణ ఆధారంగా ఇప్పటి వరకూ పరిశీలించిన అంశాలను గమనించండి. ఇదే రకంగా పొడవైన జడలు వున్నవీరుల విగ్రహాలు లేదా వీరగల్లులను వేర్వేరు చోట్ల గమనించాను. ఉదాహరణకు నేలకొండపల్లి మజ్జిగూడెం వెళ్లే దారిలో రామలక్షణులుగా చెప్తున్న విగ్రహాలకు రెండింటికీ ఆహార్యంగా ఇలా జడలుంటాయి. ఖమ్మం నుంచి ఇల్లెందు వెళ్లే దారిలో కూడా కొరవి వీరన్న పామి అంటూ పూజిస్తున్న విగ్రహంలో ని ఇద్దరు వ్యక్తులకూ జడలున్నాయి. ముఠాపురం వీరన్న విగ్రహానికి, అలాగే రాజేశ్వరపురం, లోక్యా తండాలోని నిలువెత్తు విగ్రహం ఈజిప్షియన్ విగ్రహాల మాదిరి మేకవంటి ముఖం వుండి పొడవైన జడవుంటుంది. పిండిప్రోలు కట్టగూరు గ్రామాలలో కనిపించిన పులిలాంటి జంతువుతో పోరాడుతున్న గోపయ్య స్వామి అనే విగ్రహాలలో కూడా ఈ జడఅల్లుకున్న కేశాలంకరణ ఆహార్యం కనిపిస్తుంది. శిఖ ముడివేసుకోవడం అనేది మగవాళ్లలోనూ మద్యయుగకాలంలో సాధారణంగా కనిపించే లక్షణంగా ఆత్మాహుతి శిలల్లో సైతం గమనిస్తాం. శిఖను వంచిన వెదురు బద్దలకు కట్టి తల నరుక్కోవడం, కత్తెర వాడకం లేకపోవడం జుట్టుని కేవలం దేవాలయాల్లో కేశఖండన సంతర్బంగా మాత్రమే తీసుకునే ఆచారం ఒకటి కనిపిస్లుంటుంది. అలాగే శత్రువుని గెలిచేంతవరకూ శిఖ ముడివేయనని వీరులు ప్రతిజ్ఞచేయడం లాంటివి నిర్ధారిస్తుంటాయి. ఈ కోణంలో గమనించినప్పుడు ఈ కేశాలంకరణ మరియు సూర్యచంద్రుల విగ్రహాలు, తపంచా, తూటా మందు కలయికగా కాలాన్ని అంచనా వేసే అవకాశం వుంది.
ఇలా చారిత్రకంగా ఎన్నో విశేషాలను చెప్పగల విగ్రహం ఒక రకంగా ఎటువంటి రక్షణ లేకుండా ఊరిబయటి చింతచెట్టుక్రింద పడివుంది. మీరేమన్నా చెయ్యగలరా అని నూపా తిరుపతయ్యగారు చేతులు జోడించి అడగటం నిజంగా మనసుని కెలికినట్లు అనిపించింది.
Kondaveeti Gopi
గారు Nagulapalli Jaganmohanrao Nagulapalli
gaaru, పూర్ణగారూ మనమే ఒక అడుగు వేద్దాం ఆ దిశగా అంటూ సూచించి చేయికలిపారు. ఒక పక్క ఆ ఆధారం రక్షించుకుంటూ మరోపక్క మరికొన్ని చారిత్రక ఆధారాలను వెతికే ప్రయత్నం చేయాలి. @Katta Srinivas 24-01-2021
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి