హైదరాబాద్ బుద్దపౌర్ణమికి 2021లో ప్రత్యేకత ఏమిటి?

 2021లో మే 26న బుద్ద(వైశాఖ) పూర్ణిమ సందర్భంగా



హైదరాబాద్ అంటే అప్పడు చార్మినార్ గుర్తొచ్చేదేమో ఇప్పుడు హుస్సేన్ సాగర్ మధ్య ఏకశిలా విగ్రహంగా నిలబడిన బుద్దుడు ఆధునిక హైదరాబాద్ కు సింబాలిక్ ఐకాన్, చుట్టూ ఆయనకు హారంలా నెక్లెస్ రోడ్, రెప రెపలాడే అతిపెద్ద పతాకం. అసలు బుద్దుడితో హైదరాబాద్ అనుబంధానికి కారణం ఏమిటి? యన్టీఆర్ చేయించిన విగ్రహమేనా అంతకు మించిన కారణం వుందా?

2005 మే 25 తేదిన వైశాఖ పౌర్ణమి, మహా వైశాఖి లేదా బుద్ద పౌర్ణమి సందర్బంగా పవిత్ర బుద్దుని ధాతువులను పబ్లిక్ గార్డెన్ లోని వస్తు ప్రదర్శనశాల నుంచి ఊరేగింపుగా నెక్లెస్ రోడ్ కి తీసుకువెళ్లారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం అదే నెక్లెస్ రోడ్ లో సాంస్కృతిక పర్యాటక శాఖ మరియు పురావస్తు ప్రదర్శనశాలలు వైభవోపేతంగా జరుపుతాయి.

విశాఖపట్నం శివారులోని బావికొండ (17 49 ఉ - 83 23 తూ) గుట్టపై 1980లనుంచి జరుపుతున్న తవ్వకాలలో బౌద్ధ స్థూపం వెలుగు చూసింది. ఒకానొక సుప్రసిద్ధ బౌద్ధ ఉపాసిక పేరే విశాఖ కదా. సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల ఒక కొండపై ఈ ప్రాంతం ఉంది. కొండపై వర్షపు నీరు సేకరించి నిల్వచేసుకోవటానికి అనేక బావులుండటంతో బావికొండ అని పేరు వచ్చింది. బావికొండ బౌద్ధారామం క్రీ.పూ మూడవ శతాబ్దానికి చెందినది. స్తూపానికి నాలుగువైపులా ప్రత్యేక పాత్రలు వెలుగుచూశాయి. అందులో దక్షిణ దిక్కు చిన్నపాటి రాతి స్తూపం, దాని కింద లభించిన మట్టిపాత్రలో బుద్ధుడి ధాతువు వెలుగు చూసింది. పాత్రలో బంగారు, వెండి, ఇతర విలువైన చిన్నచిన్న వస్తువులతోపాటు మరో పాత్రలో బూడిద, బొగ్గు ముక్కలు, చిన్న ఎముక ఉన్నాయి. అది బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు పేర్కొన్నారు. అది వెంటనే హైదరాబాద్ చేరింది. 2004 ప్రాంతంలో దలైలామా సమక్షంలో వాటిని సందర్శనకు ఉంచారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ తరహా గాజు ఫ్రేమ్‌లోపల వాటిని ఉంచారు. ఇప్పుడు బౌద్ధులకు అది పూజనీయ ప్రాంతం. బుద్ధుడి మహానిర్యాణం తర్వాత ఆయన ఆస్తికలు, చితా భస్మాన్ని ఎనిమిది భాగాలు చేసి వివిధ ప్రాంతాల్లో ఉంచి స్తూపాలు నిర్మించారు. అనంతరం అశోక చక్రవర్తి అస్థికలు, చితాభస్మాన్ని వెలికి తీయించి 84 వేల భాగాలు చేసి తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారని చరిత్ర చెబుతోంది. అలా వచ్చిన ఓ భాగమే ఈ ధాతువు కావటం విశేషం. కానీ ఇప్పుడు పంపకాలలో ఈ పవిత్ర ధాతువుని ఏర్పరచుకున్న నిభంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాటాగా నిర్ణయించి ఇక్కడనుంచి తరలించే నిర్ణయం చేసారు. బహుశా ఈ పవిత్ర ధాతు ఊరేగింపు ఈ సంవత్సరమే ఆఖరు కూడా కావచ్చు. ఈ అనుభందం తెగిపోయే తీగపైకి చేరిందిప్పుడు.

 ఏమిటీ పండగ ప్రత్యేకత ?

బుద్దడి జీవితంలో నాలుగు ముఖ్య సంఘటనలైన 1) జననం 2) మహాభినిష్క్రమణం 3) జ్ఞానోదయం 4) మహాపరి నిర్వాణం సంభవించినవి వైశాఖమాసంలోని పౌర్ణమి నాడే అందుకే వైశాఖ పౌర్ణమి ప్రపంచవ్యాప్త బౌద్ధులకు అత్యంత ఆరాధనీయమైన పవిత్ర దినంగా మారింది.

ఈరోజున ఏ ఆధ్యాత్మిక సాధనలు చేసినా అధిక ఫలితం ఇస్తాయని శాస్త్రం ప్రామాణికంగా నమ్ముతారు.  గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందిందట. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుందని చెపుతారు. దశవతారమైన కల్కి సైతం శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడనేది మరో నమ్మకం. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. పరమగురు పరంపర కేంద్రాలు భూమి మీద అదనంగా ఆరు జెనీవా, లండన్, న్యూయార్క్, టోక్యో, డార్జిలింగ్, ఆఫ్రికాలోని ఒక ప్రాంతం లలో వుంటాయని వాటిలో పరమగురు పరంపర ప్రస్తుత కాలపు ఆశ్రమాలుగా భావిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న కరోనా విపత్తు వంటిది ఎదుర్కొంటున్నప్పుడు గురువులనుంచి పరిష్కారం అందే రోజుగా కూడా భావిస్తారు.

ఉత్సవాల నిర్వహణ అత్యంత ప్రాచీన సాంప్రదాయపు కొనసాగింపు

చైనా యాత్రికుడు పాహియాన్ తన రచనలలో బుద్ధుని దంతావశేష ఉత్సవాలను గురించి స్పష్టంగా రాసాడు. ప్రతి సంవత్సరం మూడో నెల మధ్యలో ఈ పండుగ నిర్వహించబడేదని ఆయన తెలిపాడు. ఈ పండుగ పదిరోజుల ముందునుంచే అభయగిరి విహారానికి దారితీసే మాగ్గాలన్నీ బౌద్ధ భిక్షువులచే నిండిపోయేదని పేర్కొన్నాడు. శ్రీలంకలో ప్రతియేట జరపబడే ధాతు అవశేష ఉత్సవాలలో కళింగ రాజధానియైన తంతపురం నుండే బుద్ధుని దంత అవశేషమును పంపబడినట్లుగా బౌధ్దగ్రంధాల ద్వారా తెలుస్తోంది. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం సమీపాన దంతపుత్రుని కోటగా గుర్తింపబడింది.  ప్రాచీన గ్రీసు, రోమన్, పర్షియా దేశాలలో కూడా బౌద్ధ భిక్షువులు సంచరించారు. రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్‌ని కలుసుకున్న బృందంలో ఒక బౌద్ధ భిక్షువు కూడా ఉన్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. బిలావర్-బుద్ధస అనే పేరుతో అరబ్బీ భాషలో బుద్ధ చరితను రాసుకున్నారు. గ్రీసులో బార్లాం-జోసఫట్ అన్న పేరుతో బుద్ధుని గాథ ప్రసిద్ధికెక్కింది.

మేలైన మార్గం సాధించిన సంస్కర్తగా ప్రయాణం

క్రీస్తుకి పూర్వం 563లో నేపాల్ లోని కపిల వస్తు నగరంలో శాక్యవంశంలో శుద్ధోదన, మహామాయలకు పుట్టిన సిద్దార్ధుడు 29వ ఏటనే అందమైన భార్యను, ముద్దులొలికే పుత్రుడు రాహూలుడిని ముఖ్యంగా రాజ్యాన్నీ, అదికారాలనూ, ధనాన్నీ, దర్పాన్నీ సౌఖ్యాలనూ వదిలేసి మానవాళి దుఃఖ నివారణ మార్గం కనుగొనే పనిలో బయటికి వచ్చాడు. అలా చేసిన ఆరేళ్ల అన్వేషణకు ఫలితం 35వ ఏట జ్ఞానోదయం రూపంలో కలిగింది. అప్పటినుంచి 80 వ ఏట నిర్యాణం పొందే వరకూ అంటే 45 ఏళ్ళ పాటు తాను సంపాదించిన జ్ఞానాన్ని బోధిస్తూ కోసీనది నుంచి సరస్వతి నది వరకూ, హిమాలయాలనుంచి వింద్యపర్వతాల ఆవల వరకూ కాలినడకన ప్రయాణిస్తూ తిరిగాడు. తాను కనుగొని ఆచరిస్తున్న ధర్మాన్ని అత్యంత సులభ సూత్రాలుగా తయారుచేసి రాజుల నుంచి పేదల వరకూ, చదువురాని వాళ్లనుంచి తత్త్వజ్ఞులవరకూ బోధిస్తూ సాగాడు. ఒక మార్పుని తీసుకురావడానికి ఇప్పడున్నంత ప్రచార ప్రసార మాధ్యమాలతో కూడా చేయలేంత విస్తృత వ్యాప్తిని ఆయన తన జీవిత కాలంలోనే అప్పటికే వేళ్లూనుకుని వున్న వ్యవస్థకు వ్యతిరేఖంగా సాదించగలిగాడు అది నిజంగా చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. ఆయన సారనాథ్ లో ఐదుగురు శిష్యులకు తొలిబోధన చేసాడు అది ధర్మచక్ర ప్రవర్తనంగా ప్రసిద్ధమైంది. బుద్ధుడి జీవితం మహిమాన్వితం. వ్యక్తిత్వం అపూర్వం. వాణి మనోజ్ఞం. జ్ఞాన స్వరూపమే బుద్ధస్వరూపం. ఆ జ్ఞానం నాటి సమాజంలో నవచైతన్యాన్ని కలిగించింది. బౌద్ధధర్మం ఒక మానవీయ సంస్కృతి. సమానత్వం, సౌభ్రాతృత్వం, సత్యం, అహింస, స్వయంకృషి, సేవ మొదలైన భావనల్ని ప్రజల్లో వ్యాప్తిచెయగలిగింది.

 

మరి ఇలా ధాతువులను పూజించడం ఎప్పుడు ప్రారంభం అయ్యింది? దానికి బుద్దుడు ఒప్పుకునేవాడా?

బేతవన విహారంలో బుద్దుడు ఉన్న సమయంలోఒక భక్తులు కొందరు ఆయనకు భక్తిగా సమర్పించడానికి పువ్వులు తీసొకొచ్చారట. ఆ సమయంలో బుద్దుడక్కడ లేకపోవడంతో చాలాసేపు ఎదురుచూసి నిరాశతో ఆ పూలను అక్కడే వడిలేసి భారంగా వెళ్లిపోయారట. ఇది గమనించిన బేతవన విహారదాత అనంతపిండకుడు అనే ఆయన బుద్దుడితో ఈ విషయం చర్చించి ఆయన అందుబాటులో లేనప్పుడు కూడా పూజజరిగేందుకు ఏదైనా జ్ఞాపికను వుంచే అనుమతినివ్వమని కోరాడట. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలు అంగీకరించని బుద్ధుడు, ఒక్క బోధివృక్షాన్ని మాత్రమే పూజకు అనుమతించాడు. తన జీవితకాలం, తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే సమ్మతమైందని చెప్పాడు. దీంతో బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన ఉద్యోగులతో, అనుచరులతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు వచ్చారు. ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులలో ముఖ్యమైనదిగా సాగింది. అలా బుద్దుని జీవిత కాలంలోనే ఈ వృక్షపూజ అనే ప్రక్రియ మొదలైందనే ఆధారాలున్నాయి. సిద్ధార్ధుడిని బుద్దుడిగా మార్చిన వృక్షం తప్పకుండా పూజనీయమైనదే అని బుద్దుడు కూడా దాన్ని గౌరవించేవాడట.

 

బుద్దుడు బౌద్ధం తెలంగాణా ప్రాంతంతో సంభంధ బాంధవ్యాలు

 

ప్రాచీనాంధ్రదేశం అంతటా బౌద్ధం వ్యాపించింది. బుద్దుడి సమకాలికుడైన ప్రసిద్ధ బ్రాహ్మణాచార్యుడు బావరి ములక (కరీంనగర్) నివాసి, తన ధర్మ సందేహాలకు బుద్ధుని వద్ద సమాధానాలు లభిస్తాయని తెలుసుకుని 16 మంది శిష్యులను పంపగా శ్రావస్తిలో నివసిస్తున్న బుద్ధుడిని కలసి సందేహ నివృత్తి చేసుకొని వారు బౌద్ధాన్ని స్వీకరించారు. కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్ల దగ్గరి 'బాదానకుర్తి' అనే గోదావరి నది మధ్యస్థ నివాసి. బుద్ధఘోషుడు రాసిన 'పరమార్ధ జ్యోతిక' అనే గ్రంథంలో ఈ 'బావరి'తో పాటుగా 'బోధిసత్వ శరభంగపాలుడు' అనే మరో బౌద్ధ భిక్షువు కూడా గోదావరి నదిలోని 'కవితవనం' (వెలుగుతోట) అనే ద్వీపంలో నివసించే వాడని ఉంది. తెలంగాణలోని గాజులబండ, ఫణిగిరి, తిరుమలగిరి, కొండాపూరు, లింగాలమెట్ట, పెద్దబం కూరు, ధూళికట్టకోటిలింగాల, నేలకొండపల్లి తదితర  ప్రాంతాలలో బౌద్ధ శిథిలాలు బయటపడ్డాయి. బౌద్ధ సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతమైన 'విమానవత్తు' అనే వాఖ్యాయన గ్రంథం పోతలి రాజధానిగా చేసుకుని 'అస్సక' ప్రాంతాన్ని పాలించే రాజు (నేటి కరీంనగర్‌- నిజామాబాద్‌) తన కుమారునితో కలిసి బౌద్ధాన్ని స్వీకరించాడని, బుద్ధ భగవానుని ముఖ్య శిష్యుడైన 'మహాకాత్యాయనుడు' తథాగతుడి మహాపరినిర్యాణం తర్వాత వారికి దీక్ష ఇచ్చాడని ఉంది. తెలంగాణ ప్రాంతం నుంచి 1. నాగార్జునుడు - మాధ్యమిక వాదం, 2. మైత్రేయుడు- విజ్ఞాన వాదం, 3. బుద్ధ ఘోషుడు – థేరవాదం, 4. వసుబంధుడు - యోగాచార వాదం, 5. కుమారిల భట్టు – పూర్వమీమాంస, బోధించారు. తెలంగాణలో గోదావరి, కృష్ణానదీ పరీవాహక సారవంత మైన మైదానాలు, నదీలోయలు, సస్యశ్యామలమై, ఐశ్వర్యవంతమై ఉండేవి. తెలంగాణలో అపారమైన ఖనిజ నిక్షేపాలుండటంతో దేశ విదేశీ వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లిన నేపద్యం అది కూడ బౌద్ధ కేంద్రాలవద్ద జరగటం గమనించవచ్చు. క్రీ.పూ ఒకటవ శతాబ్దంలో నేలకొండపల్లిని సందర్శించిన టొలెమీ నెల్కిండా అంటూ ఆ నగరంలో జరిగిన వ్యవహారలు పేర్కొన్నాడు. ఫణిగిరలోనూ విదేశీ వాణిజ్యం విస్తృతంగా జరిగింది.

వృక్షం తర్వత స్థూపం ఆరాధన, బౌద్ధ స్థూపాల నిర్మాణ:

ఈ చైత్యాలు లేదా స్తూపాలు ఈ గుండ్రని ఆకృతికి కారణాలు గురించి ఊహాగానాలున్నాయి - అది ఉదయించే సూర్యుని చిహ్నం కావచ్చును. లేదా జీవితం బుడగ వంటిదని సూచన కావచ్చును. పైన ఒకటి నుండి మూడు వరకు ఛత్రములుండేవి . అవి త్రిరత్నాల సంకేతం అంటారు. స్తూపం నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు[3]. శబ్దరత్నాకారుడు స్తూపం అన్న పదానికి మట్టి లాంటి వాటి దిబ్బ అని అర్థం ఇచ్చారు. అయితే దీనికి ప్రముఖ చారిత్రికులు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు స్తూపం అనే పదానికి చరిత్రపరంగా వేరే అర్థం చెప్పారు. బౌద్ధవాస్తువును ఇటుకతోనో, రాతితోనో కట్టిన అర్ధగోళాకారము వంటి ఘననిర్మాణమునకే స్తూపమను పేరు సరైనది అన్నారు, దిబ్బ అయినదెల్లా స్తూపము కాదని. ఈ నిర్మాణము బౌద్ధమతము వాస్తువునకు ప్రసాదించిన విశేషము.  దీని ప్రాకృత రూపం "థూపము". అయితే ప్రాచీన (బౌద్ధ) కాలంలో "స్తూపము" అనే పదం వాడుకలో ఉన్నట్లు కనిపించదు. అందుకు బదులు "చైత్యము" అనే పదమే వాడేవారు. నిర్మాణము ఒక్కటే ఉంటే దానిని చైత్యమనీ, చాలా చైత్యాలున్నచోట ప్రధాన కట్టడాన్ని మహాచైత్యమనీ అనేవారు కావచ్చును. "చైత్యము" అన్నపదం "చితా" శబ్దమునుండి పుట్టింది.

దానిలో ఒక వేదిక (Drum), దానిపైన అర్ధ గోళాకృతి అండము (Semi sperical dome), అండముపై ఒక హర్మిక (Pavilion), దానిపై నిర్మాణాన్ని అంతటినీ ఆవరించే దండ సహిత ఛత్రము (Umbrella), అండము, హర్మికల మధ్య గళము (neck), చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు (Railings) ముఖ్యబాగాలుగా వుంటాయి.

 

 

క్వారంటైన్ లైఫ్ లాగా అప్పటి బౌద్ధ రొటీన్ లో ఒక రోజు ఎలా గడిచేదో తెలుసా?

సమయం తెలుసుకోవడానికి సూర్యుడిని ఆధారంగా చేసుకుని నీడగడియారాన్ని వాడేవారు. ఉదయం పూట వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం వంటి సాధన, అల్పాహారంగా యవాగువు(జావ), గంజి పానియాలను త్రాగేవారని జాతక కథల్లో తెలుస్తుంది. మధ్యాహ్నం బిక్షాటనలో ఇంటిముందు నిలబడే వారంతే అడిగటం వుండేది కాదు. వాళ్లంతట వారు ఇష్టపూర్తిగా తోచినంత ఏదిస్తే అదే తీసుకునే వారు. అదొక్కటే అంతవరకే వారి ఆహారం. ఇక సాయంత్రం రెండో పూట తినడం అనేది వుండదు. రేపటికోసం భిక్షను దాచుకోవడం తప్పుగా భావించే వారు. సాయంత్రం మెదడుకు, శరీరానికీ పనికొచ్చే ఆటలు ఆడేవారు. పాచికలు, పులీమేక, కుస్తీ, కర్రసాము, బంతి, గోళీలు, వంటి ఆటలు ఆడేవారు. తాళాలు వేసుకోవలసిన అవసరం వీరికి రాలేదు.

బుద్దుడి మరణం మహాపరి నిర్యాణం

మహాపరినిర్వాణం నాటికి శాస్త వయస్సు ఎనభై ఏళ్లు. అవిశ్రాంతంగా ఏభై ఏళ్ల పాటు ధర్మ ప్రచారం చేసి అలసిపోయాడాయన. ఒక వైశాఖ మాసంలో శిష్యులతో బాటు కుశినగరం (నేటి బీహార్ లోని కుశినారా) మీదుగా ప్రయాణిస్తున్నాడు. చుండుడు అనే ఉపాసకుడి ఇంట్లో లేత పంది మాంసం తిని అనారోగ్యానికి గురి అయ్యాడు. శిష్యులు అతన్ని డోలీ మీద పడుకోపెట్టి నానా కష్టాలూ పడుతూ కుశినగరం తీసుకొచ్చారు. ప్రధాన శిష్యుడైన ఆనందుడు రెండు సాల వృక్షాల నడుమ దుప్పటి పరచగా, బుద్ధుడు ఉత్తరదిశగా తలపెట్టుకొని, కుడివైపు ఒత్తిగిలితన ఆఖరి ప్రవచనాన్ని ప్రకటించినిష్క్రమించాడు.

 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి