స్వర్గలోకంలో చరకుడితో ఒక ఇంటర్వూ

 స్వర్గలోకం ఒక విడియో ఇంటర్వూ కోసం ఆసనాలను సిద్దం చేయిస్తున్నరు ఈ మధ్యనే పైకి చేరుకున్న ఒక డైనమిక్ యాంకర్,



‘‘ రెండు కుర్చీలూ ఇలా కొంచెం యాంగిల్ లో పక్కపక్కన వేయండి ఒక్క కెమేరాతోనే మరి అవుట్ పుట్ తీసుకోవచ్చు’’ హడావిడీ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ మొదలయ్యింది కేవలం సెలబ్రిటీతో కాదు ప్రాచీన సెలబ్రిటీ వైద్యుడితో, పైగా అది కూడా ఇప్పటి కోవిద్ తీవ్రతకు వారి సలహా ఏమిటో తెలుసుకోవడం కోసం. ఇంతకీ ఇంటర్వూ తీసుకునేది ఎవర్నో తెలుసా అది ‘చరకుడు’’  అవును

ఇదిగో కెమెరా మెన్ ఎటు చూస్తున్నావు చరకుడువారు వచ్చే లోగా ఇంట్రో పార్టు షూట్ చేసేసుకో ఇది క్లోజ్ యాంగిల్ తీసుకుంటే ఆయన వచ్చిన తర్వాత హడావిడీ లేకుండా ప్రేమ్ సరిచేసుకోవచ్చు. మైకుని దగ్గరకు పెట్టుకుని తన చైర్ లోనుంచి కెమెరా వైపు ప్రసన్నంగా చూసాడు యాంకర్ . ఒకే అన్నట్లు కెమెరా మెన్ థంబ్సప్ చూపగానే ప్రవాహంలాగా ఇంట్రో మొదలేసాడు.

డియర్  వ్యూయర్స్ ఎంతటి రోగానికైనా మందుంటుందని దాన్న కూకటి వేళ్ళతో సహా పెకలించడం ఎలానో చిట్కాలతో సహా వివరించిన వాడు చరకుడు. తన తర్వాత తరాలకు ఈ విజ్ఞానం అందాలని ‘చరక సంహిత’ రాసాడు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన ఈ డాక్టర్ చరకుడు. ఏముంది ఆయన మందులు ఈ రోజు వాడతామా అనుకుని సులభంగా తీసేయడానికి లేదు. మీరు ఇప్పటికీ ఇష్టంగా వాడే త్రిఫల చూర్ణం ఉసిరికాయ తానికాయ, కరక్కాయ నుంచి చేయాలని చెప్పింది వీరే. అసలు వైద్యంలో పాదరసం వాడొచ్చని మొదటి తెలిపిందీ ఈయనే. ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు.

కొంచెం కెమెరాకు దగ్గరగా జరిగి.... ఇలా చెప్పాడు

‘‘ అసలు చరకులు అంటే చరిస్తూ వైద్యం చేసేవారు అంటే ఇప్పటి మన మొబైల్ మెడికల్ ఫెసిలిటీ అన్నమాట. తన శిష్యబృందంతో కలిసి తిరుగుతూ గ్రామగ్రామానా అద్భుతమైన వైద్యం చేసిన ఈయన చరకుడు అయ్యారు. ఇంకో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఇలా వైద్యం చేసే క్రమంలో తల వెంట్రుకలు తొలగించాల్సివచ్చేది. వైద్య అవసరాలకు ఇలా తలనీలాలు తొలగించేవారు కాస్తా క్షురకులుగా పిలవబడ్డారు. అదే పేరు ఇప్పటికీ మరో రకంగా వాడుకలో వుంది. సరే అటువంటి వ్యక్తిని ఈరోజు మన ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం కలిగింది. పైగా ఇప్పుడు భూమండలాన్ని పట్టిపీడిస్తున్న వైరస్ వ్యాధిని ఆయనైతే ఎలా అంతం చేసేవారో కనుక్కునే అవకాశం వచ్చింది.

ఇంకా లేటెందుకు లెటజ్ సే హాయ్ టూ చరక జి....

రెండు వేళ్లు కత్తెరలాగా చేసి దగ్గరకు అని ‘‘ ఇక్కడకు ఆపేసి ప్రేమ్ మార్చుకో ఆయన వస్తున్నట్లున్నారు’’ ద్వారం వైపు చూసాడు. ఇదంతా కొత్త కొత్తగా స్వర్గలోకపు ద్వారపాలకులు కిరీటాలు సర్దుకుంటూ చూస్తున్నారు.

 ఇంతలో చరకుడు రెండు చేతులనూ ఒకదానితో ఒకటి రుద్దుకుంటూ వీళ్లవైపు నడుచుకుంటూ వచ్చాడు. ఆ రెండు చేతుల్నీ ముక్కుకి దొప్పలా పెట్టి వాసన పీల్చుకుంటూ, ఆ కుర్చీల దగ్గరలోని అరుగుపై బాసింపట్టులాగా ఏదో ఆసనం వేసుకుని కూర్చుని తనలో నెమర వేస్తున్నట్లు ఏదో శ్లోకం పైకే ఉచ్చరించాడు.

నమామి ధన్వంతరి మాదిదేవం
సురాసురైర్వందిత పాదపద్మం

లోకేజరారుగ్భయ మృత్యునాశం
ధాతారమీశం వివిధౌషధీనాం.

 

 ఇటు కూర్చోండి అక్కడ కాదు అని చెప్పడం ఇష్టం లేక ఆసనాలను పక్కకి లాగేసి తను కూడా మరో అరుగుపై కూర్చున్నాడు యాంకర్ .

యాంకర్  :  ఏదో పీల్చుకుంటూ వస్తున్నారు ఏమిటది తాతగారూ ? (  ఇంటర్వూలా కాకుండా సంభాషణలా తన పద్దతిలో మొదలేసాడు.)

చరకుడు :  ‘‘ ఇది అమృతబిందువు ఇది వాంపువ్వు, పొదీనా పువ్వు, పచ్చకర్పూరం సమపాళ్లలో కలిపితే తయారయ్యే ద్రవం రెండు చుక్కలు ఇలా దోసిలికి రాసి వాసన చూస్తే శ్వాస సాఫీగా అవ్వడమే కాదు కొత్తచోట ఏవైనా వాయు దోషాలుంటే సవరించబడతాయి’’ సందర్భాన్ని బట్టి లొపటికి కూడా ఇవ్వవచ్చు ( స్థిరంగా స్థిమితంగా చూస్తూ చెప్పారాయన.)

యాంకర్  : అవును ఇప్పుడు భూలోకం అంతా అటువంటి చెడుగాలి ప్రభావాన్ని ఎలా తట్టుకోవాలో తెలియ తికమక పడుతోంది. అసలు ఇలా ఇంత విస్త్రుతంగా వ్యాధి ప్రబలటానికి కారణం ఏమిటిని మీరంటారు?

చరకుడు :  ‘‘ తస్యమూలం అధర్మః’’ అంటే దానికి మూలం అధర్మం నాయనా  (చిన్న చిద్విలాసంతో అన్నాడాయన).

అధర్మమా? వైరస్ అనే సూక్ష్మజీవి వ్యాపించడం ఈ వ్యాధికి కారణం అని మా శాస్త్రవేత్తలు తేల్చారు కదా మీరేమిటి ఇంకా పురాణ కథలు లాగా అధర్మం, రాక్షసుల అన్నట్లు మాట్లాడుతున్నరు.

చరకుడు :  స్వధర్మం నిధనో శ్రేయః పరధర్మం భయావహః  నీకు అర్ధం అయ్యేలా చెప్పాలంటే మన శరీరమే కాదు మొత్తం భూమిమీద జీవరాశి నిర్జీవ వ్యవస్థ అంతా కలిపి ఒక సమతుల్యంలో నడుస్తోంది అలా సమస్థితిలో నడవడమే ధర్మం. అందులో ఎవరికి కావలసినంత వాటా వాళ్ళకు వుంటుంది. ఎప్పుడైతే తూకం ఒక్కవైపుకే మొగ్గేలా వనరులన్నీ పోగుపడే పని కొన్నింటిని బాగా తగ్గించే పని జరుగుతుందో అది అధర్మం అటువంటి అధర్మాన్ని సవరించి మళ్ళి తులనాత్మక స్థితికి తీసుకొచ్చే పనిని ప్రకృతి చేసేస్తుంటుంది.  ఒకప్పుడు భూమిమీద గంఢభేరుండాలు(డైనోసార్లు) బలంతో భూమినంతా ఆక్రమించాలని అటువంటి అసమతుల్యాన్ని సృష్టించాయి. కానీ ప్రకృతి వాటినే తుంచేసి మళ్ళీ వ్యవస్థ తూకాన్ని సమం చేసింది.

యాంకర్  : అంటే ఇప్పుడు మనిషిని డైనోసార్ లాగా ప్రకృతి తుంచేయబోతోంది అంటారా లేక అట్లా తుంచేయడమే రైటని మీరు చెప్దామనుకుంటున్నారా?

చరకుడు : కాదు కాదు నేను మనిషి పక్షపాతికి, వేరేవాళ్ళ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ వచ్చిన ఉపద్రవాన్ని దాటేయమంటున్నాను.  రాక్షసదాడి జరిగినప్పుడు కూడా స్వీయ స్వార్ధానే చూసుకునే వాళ్ళు తాము అంతం కావడంతో  పాటు వ్యవస్థ అంతానికి కారణం అవుతారని హెచ్చరిస్తున్నాను.

యాంకర్  : మీరు చెప్ప్తున్నది బాగానే అనిపిస్తోంది కానీ అది గ్లోబల్ లైజుడు జనరల్ ఆన్సర్ అలా కాకుండా ఈ వ్యాధి ని మనుష్యజాతి గెలిచేందుకు ఉపాయం చెప్పగలరా? మీ చరక సంహితలో కూడా రోగ సమస్య రాక్షసుడంత పెద్దగా వుండొచ్చు కానీ పరిష్కారం బాణం ములుకంత చిన్నగా వుంటుందని చెప్పారు కదా.  అలాంటిదేమైనా వుంటే చెప్పండి మా వాళ్ళకు ఈ ఇంటర్వూ ద్వారా అందజేస్తాను.

చరకుడు :   నైవదేవా న గంధర్వ న పిశాచా న రాక్షసాః

                    న చాన్యే స్వయమక్లిష్టముపక్లిశ్నంతి మానవమ్‌.....  మానవుడు తన సహజ ధర్మాలకు అనుగుణంగా వర్తిస్తూ వుంటే దేవుళ్ళు, గంధర్వులు, పిశాచాలు, రాక్షసులు అంటే మీ పద్దతిలో చెప్పాలంటే దేహధాతు ప్రత్యానిక భూతాలు,  వ్యాధికారక సూక్మక్రిములైన బ్యాక్టీరియాలు, నిమటోడ్ లో వైరస్ లు వంటివి ఏమీ చెయ్యలేవు. వ్యక్తులు తమ దేహధర్మాలను నిర్లక్ష్యం చేయడంతోనే మహమ్మారులు ఆక్రమించే అవకాశం కలుగుతుంది.

యాంకర్ : అలా ప్రవేశించకుండా ఏం చేయాలి? ప్రవేశించిన తర్వాత ఏం చేయాలి ? ఇది చెప్పండి మాకిప్పుడు చాలా అవసరమైన సంగతి మీ పద్దతిలో ఎలా అడ్డుకోవాలి జయించాలి అనేది చెప్పండి.

చరకుడు :

ధన్వంత్రిణం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం |

ఆచ్యుతం చామృతం చంద్రం స్మరేత్ ఔషధ కర్మణీ |

శరీరే జర్ఘరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే|

ఔషధం జాహ్నవీతోయం -వైద్యోనారాయణోహరిః

సృష్టి స్థితిని నిలబెట్టే నారాయణుడిలాగానే ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ తగిన చికిత్స చేసే వైద్యుడు కూడా నారాయణుడే అతడి అవసరం వుంటుంది ఈ విపత్తులో.  రాజు కోట భద్రంగా వుంటే రాజ్యం భద్రంగా వున్నట్లే దేహం లోని కణం కూడా అంతే శతృదుర్భేద్యంగా వుంటే దేహమనే రాజ్యం మొత్తం సుభిక్షంగా వుంటుంది. బయటి క్రిమి లోపటికి ఎలా ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. అది వచ్చే దారులను మూసివేయగలగాలి. మా కాలంలో కంటికి కనిపించేంత వరకే చూసే వాళ్ళం మాకుస్పటికాల సాయం కూడా చిన్నది కానీ ఇప్పుడు అణువుని బద్దలు కొట్టి చూడగల యంత్రాలను తంత్రాలను సాధించారు కదా మైక్రోస్కోపులు, స్పెక్ట్రాస్కోపులు అంటూ వాటి సాయంతో మరింత ఖచ్చితమైన వైద్యం మీకిప్పుడు సాధ్యపడుతుంది. అష్టసిద్దులకు సమానమైన గొప్పసిద్దులలో ఇలా చూడగలగటం కూడా ఒక సిద్దే కదా. లోపటి బలం పెరిగితే బయటి నుంచి వచ్చిన పురుగు చచ్చిపోతుంది. రోగం బలం పెరిగితే రోగి బలహీనం అవుతాడు. ఇమ్యూనిటీ అంటున్నారు కదా అది పెంచుకోవాలి. ఒకవేళ శరీరంలోకి బయటి క్రిములు వస్తే మన మందులు వాటిని చంపటం కాదు మన శరీరలోని రక్షన వ్యవస్థ వాటిని చంపేందుకు సహకరిస్తుంది.

 

ఆత్మానమేవ మన్యేత కర్తరం సుఖదుఃఖయోః

తస్మాచ్రేయస్కరం మార్గ ప్రతిపద్యేత నో త్రసేత్‌

 

మనకి నష్టం జరగటానికి ఎవరో కారణం అనిచూడటం కాదు మనమే స్వయంగా ఎలా కారణమో వెతకాలి. ఆ తప్పులను సాధ్యమయినంత త్వరగా సరిచేసుకోవాలి. అలా కాక ప్రజ్ఞాపరాధాలు(తెలిసి చేసే తప్పులు) వల్లనే ఇటువంటి జనపదోధ్వంసకవ్యాధులు విస్తరిస్తాయి. ప్రకృతిని  సర్వనాశనం చేస్తూ. జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తూ. జంతుజాలం మనుగడకు ముప్పు తీసుకొచ్చి. పంచభూతాలను కలుషితం చేస్తూ. సహజ ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న. మనిషి తీరును పకృతి ఇచ్చే ప్రత్యుత్తరం లాంటిదే ఇలాంటి వ్యాధుల విస్తరణ.

 

 యాంకర్ : మరి అటువంటి ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలంటారు?

 

దానికి మార్గం ఓజస్ వృద్ధి, రసరక్తాది సప్తధాతుసారమే ఓజస్సు. వ్యాధి క్షమత్వ సూచిక అది. శరీరాన్ని నడిపించే ధాతువులు   అవి ప్రసరించే మార్గాలు   జఠరాగ్ని.. ఈ మూడు సమస్థితిలో ఉంటేనే  ధాతువులు దోషాలుగా మారకుండా ఉంటాయి. వ్యాధి క్షమత్వం పెరుగుతుంది. ఇమ్యూనిటి అనేది ఉన్నపళంగా మంత్రం వేసినట్లు వచ్చేసేది కాదు.

 

యాంకర్ : ఇమ్యూనిటీ ఎవరికి తక్కువ వుంటుంది మీ లెక్క ప్రకారం

 

అహితకర (హానిచేసే) పదార్థసేవనం చేసేవారు, అతి స్థూలురు, కృశదేహులు, రక్తమాంసఅస్థిధాతుద్రవ్య సమస్థితిరహితులు,దుర్భలురు, అసాత్మ్య ఆహారసేవి(సరికాని ఆహారం తినేవాళ్లు), జఠరాగ్నిలోపశరీరులు వీరికి ఓజస్సు తగ్గుతుందని చెప్పబడినది.

 

యాంకర్ : (కొంచెం కాంట్రావర్సీ లేకపోతే వ్యూస్ ఏలా అనుకుంటూ) మీ కాలపు ఆకుపసర్లు, మూలికలూ, దుంపలు ఇప్పుడెందుకూ పనికిరావు కదా ఇక మీ వైద్యం ఇప్పుడు గుడ్డి గడ్డిముక్కగా కూడా పనికిరాదు కదా. దానికి మీ పాతబడిన భాషలో సూత్రాలు కనుమరుగైపోతున్నాయి.

 

సృష్టిలో ఒక విచిత్రం వుంది. మనిషితోపాటు భూమిమీద వున్న జీవులు, నిర్జీవులూ ఒక సమస్థితిలో వుంటాయి. ఉదాహరణకు మానవుడిలో కలిగే శారీరక దోషాలకు మొక్కల్లోనో, రాతిపొడులలోనో మందు వుంటుంది. ఎందుకంటే అన్నిధాతువులు ఒక దగ్గరనుంచే వచ్చాయి వాటి సవరణ పూరణ కూడా వాటిలోనే వుంటుంది.

ఏమన్నావు ఆకు పసర్లనా అవును పసరలూ, పొడులూ వాటిలోని రసాయన గుణాన్ని అందించడానికి మాకు అప్పటికి వున్న మార్గం మీరు ఇప్పుడు వాటినే పెద్ద పెద్ద యంత్రాల మీద సారాన్ని నీళ్లతోనూ, సారాతోనూ దింపుకుంటూ మందులు చేస్తున్నారు. దోసెడు తినాల్సిన మందుని చిటికెడు తిన్నా సరిపోయేలా చేయగలిగారు సంతోషమే. కాకపోతే మా మందు ఎక్కడినుంచి తీసుకున్నామో మీరైనా అక్కడినుంచే తీసుకోవలసిందే. మీరు గొప్ప అనుకుంటున్నారు కానీ మేము పరిష్కారాన్ని పెరట్లోనూ, అఖరికి వంటిట్లోనూ వుండేలా జాగ్రత్తలు తీసుకంటే మీరు దాన్ని మరింత దూరంగా ఎవరెవరి గుప్పెటలోనో వుండేలా మార్చారు. అందుకు ఎవరు సిగ్గుపడలో తెలివైన వాళ్లమనుకునే మీరే తేల్చుకోండి.

ఇక భాష అంటావా నాకు తెలిసిన నేను వాడిన భాషలో నేను రాసివుంచాను. మీకు కావలసిన కంప్యూటర్ భాషల్లో నయినా మీరు మాట్లాడుకోండి వద్దన్నానా? విషయంలో లోతు ఎంతుంది? నిజం ఎంతవుంది? దాని అవసరం ఎంతుంది? అనే దాన్ని బట్టి స్వీకరణ నిర్ణయించబడాలి కదా. రాసిన పదారొందలేళ్ల తర్వాత క్రీ.శ.987 లో అరబ్, పర్షియన్ భాషల్లోకి చరక సంహిత అనువదింపబడలేదా? కాలానుగుణమైన ప్రాంతానుగుణమైన భాషల్లోకి మానవవిజ్ఞానం ప్రసరించాలి కానీ అదే అడ్డంకి అనుకుని ఆగిపోతే నష్టపోయేది సృష్టించిన వాళ్ళు కాదు వినియోగించుకోవలసిన వాళ్లు.... ఏమంటావు.

 యాంకర్ : మనసులో చెంపలేసు కుంటూ సరే నండీ ఇప్పుడు నాకు జలుబుగా వుందని చెప్తాను నాకు మీరు మందు ఎలా చేసి ఇచ్చే వాళ్ళు అదొక్కటి చెప్పండి మన ఇంటర్వూ ముగింపుకు తీసుకువద్దాం.

జలుబు దగ్గు జ్వరం ముప్పేట దాడి చేస్తే ఊపిరితిత్తుల పనికూడా మందగిస్తుంది. ఆయాసం కూడా కలుగుతుంది. లక్షణాలు వ్యక్తి తట్టుకునే తీరు పూర్వం వాడిన మందులు వాటి ప్రభావాలు పరిశీలించి మందులు ఇస్తాను కానీ మీరు ఏ ఉత్సాహంతో అడిగారో అర్దం అవుతోంది కాబట్టి అదే కోణంలో చెప్తాను.

వసకొమ్ము దంచి కషాయం కాచి తాగిస్తే విషదోష నివారణకు విరుగుడుగా పనిచేస్తుంది. అష్టగుణ మండం అనేదాన్ని తాగించినా గుణం కనిపిస్తుంది. కఫాన్ని తగ్గించడంలో వాము మీరు థైమాల్ అంటారు కదా అది కూడా బాగా పనిచేస్తుంది.

భోజనాగ్రే సదా పథ్యం లవణార్ద్రక భక్షణం పథ్యం   అంటే సైంధవ లవణం   అల్లం నూరి.. అందులోకి నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే ఈ లక్షణాలనుంచి విముక్తి కలుగుతుంది.

యాంకర్ : ఇలా అయితే మీ వైద్య పద్దతులు అన్నీ మాకు వరసపెట్టి చెప్పేసే లాగా వున్నారు కానీ తాతగారూ, చివరిగా ఒక్క ముక్కలో మానవులను ఎలా వుండాలి ఏంచెయ్యాలి అని అడిగితే మీరేం చెపుతారు.

చరకుడు : మనం మన దేహం పట్ల శుభ్రత జాగ్రత్త పాటించినట్లే సమాజం పట్ల, జీవవైవిద్యం పట్ల కూడా పవిత్ర స్పూర్తితో ఉండాలి. బహుశా ఇప్పడు మీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం కూడా అదే చెప్తోంది.

యాంకర్ : చాలా మంచివిషయాలు చెప్పారండీ ధన్యవాదాలు నమస్కారం

చరకుడు : నమస్కారం, మేమెప్పుడో చెప్పిన విషయాలు ఇంకా బ్రతికేవున్నాయని తెలియజేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఈ మాటలతో మా తర్వాతి మునిముని ముని ముని మానవజాతిని కలుసుకోబోతున్నందుకు మరింత సంతోషం

 

 

 ( CREDITS: డాక్టర్ జీవీ పూర్ణచందు గారికి ప్రత్యేక ధన్యవాదాలతో)

 

 

 

 



 





 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి