తెలంగాణ భాషాదినోత్సవం ఎందుకు చేస్తున్నాం? ఎలా చేయాలి?

 


తెలంగాణ భాషాదినోత్సవం ఎందుకు చేస్తున్నాం? ఎలా చేయాలి?

మాతృభాష, తెలుగుభాష, వాడుకభాష, తెలంగాణ భాష ఈ దినోత్సవాలన్నీ ఒక్కటేనా? తేడా వుంటే ఏమిటో తెలుసా?

నిన్న కాళోజీజయంతి సందర్భంగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియా గోడల మీద కూడా తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించబడింది.

కనీసం నిర్వాహకులైనా దీని ప్రాధమిక స్పూర్తిని మనసుకెక్కించుకున్నారా లేక మొక్కుబడిగా కార్యక్రమం చేయాలి కాబట్టి చేసారా అని కొన్నిచోట్ల అనిపించింది. మరికొన్ని చూస్తే something is better than nothing మాత్రమే కాదు Nothing is better than nonsense అనే సామెతను బలంగా గుర్తుంచుకోవాలి అనిపించింది.

తెలంగాణ భాషా దినోత్సవం అంటే మాతృభాష దినోత్సవం అయితదా?

మతృభాషకు, తెలంగాణ భాషకు తేడా ఏమిటో తెలిస్తేనే ఈ తేడా అర్ధం అవుతుంది. చాలా మందికి వున్న తప్పుడు అభిప్రాయం ఏమిటంటే అమ్మ మాట్లాడే భాష లేదా అమ్మనుంచి నేర్చుకున్న భాషనే మాతృభాష అంటారని. కాళోజీ తల్లి రమాబాయమ్మ కన్నడిగురాలు, తండ్రి రంగారావు గారు మహారాష్ట్రియన్ మరి కాళోజీ మాతృభాష ఏది? నిరంతరం ఆయన ఘోషించినది, పలవరించినది, కలవరించినది అయిన భాష ఏది? కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు లలో మాట్లాడటమే కాక రచనలు చేసిన బహుభాషావేత్త (polyglot)కు ఏది మాతృభాషో నిర్ణయించే తూకపురాయి ఏది? మాతృభాష నిర్వచనాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

దీనికోసం సులభంగా అర్ధం అయ్యేలా చెప్పే తెనాలి రామలింగడి కథ ఒకటి వుంది. ఒకసారి శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానానికి బహుభాషావేత్త అయిన పండితుడు వచ్చాడట. ఆయన ఆస్ఠాన దిగ్గజాలకు ఒక సవాలు విసిరాడట మీరు నన్ను ఏవిధంగా నైనా పరీక్షించి నా మాతృభాష ఏమిటో కనుక్కోండి అని, సరే రకరకాల భాషల్లో గడ గడ లొడ లొడా ప్రశ్నలు అడిగారు ఆయన అంతే వేగంగా సమాధానం ఇస్తున్నాడు. ఆయా భాషల ప్రత్యేక గ్రంధాలు, నుడికారాలు, వాడుక పదాలపై ప్రశ్నలు వేసి చూసారు ఆయన వాటికి కూడా తడుముకోకుండా సమాధానం ఇస్తున్నాడు. పద్యాలు కట్టమన్నారు. పాటలా పాడమన్నారు. పదాలను పూరించమన్నారు. ఎంతలా ఎలా ప్రశ్నిస్తున్నా తొణకకుండా బెసకకుండా ఆయన చెప్తూనే వుండటం చూసి వీరినోట వెలక్కాయపడింది. ఇక మాట్లాడకుండా కూర్చుని తమాషా చూస్తున్న వాడు మన తెనాలి రామలింగడు. ఈయన నిమ్మకు నీరెత్తిన తనం చూసి వళ్ళు మండిన రాయల వారు రామకృష్ణా నీ వేమీ మాట్లాడవే అంటూ హూంకరింపు లాంటి ఆజ్ఞాపన చేసారు. దానికి సమాధానంగా అయ్యా అదే ఆలోచిస్తున్నాను. సాయంత్రం మా ఇంట చక్కటి సొరకాయ దప్పళానికి ఇంత కరిపేపాకు కలిపితితే ఘుమఘుమలాడుతుంది కదా ... ఈయన మాట పూర్తిచేయకముందే సభ గొల్లుమంది. రాయలవారికి మరింత కోపం పెరిగింది. సందర్భశుద్ది లేకుండా మీ పరిహాసం ఏమిటంటూ అడిగారు కూడా మన్నించాలి మహారాజా ఇప్పటికే పండితుల వారు విశేష పరిశ్రమ చేసి చేసి అలసటకు లోనయ్యారు కదా. మీరు అనుమతించి వారు అంగీకరిస్తే రాత్రిభోజనశయనాదులు మా ఇంట వారికి ఏర్పాటు చేసుకుంటాను. అలా అంగీకరిస్తే రేపటి ఉదయమే వారి మాతృభాషను స్వయంగా నేనొక్కడినే తేల్చిచెప్పగలను అన్నాడట. అనుమానంగానే రాజావారు ఒప్పుకున్నారు, అసహనంగానే పండితుడు వారింట భోజనానికి వెళ్ళాడు. స్వయంగా వడ్డలన్నీ దగ్గరుండి చేసాడు మన తెనాలి రామలింగడు. కాకపోతే  ఆ హడావిడిలో వేడివేడి చారు పండితుల వారి చేతిపై ఒలకబోసాడు కూడా.

సరే తెల్లారింది. సభమొదలయ్యింది. రామకృష్ణా నిన్నమాటిచ్చినట్లు ఈ ఉదయమే  ఆ పండితుడిని పరీక్షించడం ప్రారింబించు ఉదయం గడిచే లోగా ఆయన మాతృభాష తేల్చు, లేదంటే నీకు శిక్ష తప్పదు అన్నారట.

అర్యా ఇక పరీక్షించాల్సినదేమీ లేదు. పరీక్ష పూర్తయ్యింది. వారి మాతృభాష ‘‘తెలుగు’’ ముందుగా ఈ నిర్ధారణ సరైనదేనా కాదా వారిని చెప్పమనండి ఆ తర్వాత ఎలా నిర్ధారించానో నేను చెప్తాను అన్నాడట. నిన్నటి రోజంతా పరీక్షలుచేసినా తేలని విషయం ఈయన ఏ పరీక్ష లేకుండా ఎలా చెప్పాడో అర్ధం కాకనే బుర్రలు గోక్కుంటుంటే అవున్నన్నట్లు ఆ పండితుడు తలాడించడం వీళ్ళను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

రాజా వారు ఆశ్చర్యంనుంచి తేరుకుని ఇంతకీ ఎలా వారి మాతృభాష ఇదని తేల్చావో చెప్పు అని అడిగారు. అదే ప్రశ్న మనసులో మెదులుతుంటే సభికులే కాదు పండితుడు సైతం మరింత ఆతృతగా ఈయన మొహం లోకి సమాధానం కోసం చూస్తున్నాడు.

మహారాజా మనమెన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ, ఎన్నింటిని అనర్ఘళంగా అనాయాసంగా అత్యంత లాఘవంగా బయటకు మాట్లాడుతున్పప్పటికీ, మనలోపట నడిచే ఆలోచనలు నికరంగా మనదైన మాతృభాషలోనే సాగుతాయి. నిజానికి అలా ఆలోచించేంత బలంగా మెదడుతో ముడిపడ్డదే మాతృభాష. పిల్లలు కూడా ఏ భాషాలో పాఠాలు విన్నప్పటికీ వారి మాతృభాషలో అవగాహన చేసుకునే అర్ధం చేసుకుంటారు.మరి ఈ ఆలోచనల్లో వున్న భాష అసంకల్పిత చర్యల సందర్భంగానే కదా బయటపడుతుంది. దానికోసమే వేడిచారు వారి చేతిపై ఒకలగానే ‘‘అమ్మా..చంపేసార్రోయ్...’’ అంటూ అరిచారు.రాత్రి పలవరించడంలోనూ వారి మాతృభాష బయట పడింది అన్నాడట.

సభ చప్పట్లతో మార్మోగిపోయింది. ఇదే సందర్భంగా రామకృష్ణని సన్మానించడంతో పాటు పాఠశాలల విధ్యలో పిల్లల మాతృభాషలో బోధన అవగాహనా పూరితంగా వుండేలా చూడమని ఆధేశాలు కూడా పంపారట. దేశభాషలందు తెలుగు లెస్స అని రాసిన రాయల వారు.

ఈ కథలో మనకు మతృభాష నిర్వచనాన్ని అర్దం చేసుకోవడానికి కీలకమైన అంశం దొరకుతుంది. అమ్మ మాటాడేదో, నాన్న మాట్లాడేదో కాదు మాతృభాష అంటే మనం ఆలోచించేది. మూర్త(Concrete) ఆలోచనలను సైతం నడిపించేంది. అంటే  తెలంగాణలోనే ఉన్న అందరిదీ తెలంగాణ మాతృభాష కాదు కదా. కొందరిది ఉర్దూ, మరికొందరిది లంబాడీ, కోయ, గోండీ ఇలా ఏదో గిరిజన భాష మాతృభాష వుండొచ్చు, వలస కుటుంబాలలో మరాఠీ, ఒడియా, వగైరా మాట్లాడే వాళ్లూ వున్నారు. మరి నిన్నటి రోజు మాతృభాషా దినోత్సవం చేసుకోమ్మంటే ఎవరి మాతృభాష గురించి వాళ్ళుచెప్పుకోవాల్సిన దినమా లేక ఏ మాతృభాష వారైనప్పటికి అస్తిత్వ వేదనను అనుభవించి తలెత్తుకునే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ భాషను తల్సుకోవలసిన దినోత్సవమా? లేక తెలంగాణ భాషనే మాతృభాషగా వున్న వాళ్ళు చేసుకోవలసిన దినోత్సవమా? తెలంగాణ భాషని గౌరవించే వారు, తెలంగాణ భాష అస్తిత్వాన్ని గుర్తించేవారు ఏరాష్ట్రం వారైనా ఏ దేశం వారైనా సరే సంఘీభావం ప్రకటించగల దినోత్సవమా? మాతృభాష గురించే సెప్టెంబర్ 9న కూడా మాట్లాడాలనుకుంటే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పేరుతో ప్రతిసంవత్సరం పిబ్రవరి 21న జరుపుకునే దానికి కాళోజీ జన్మదినాన అదనంగా ఎందుకు?

 

ఇక పోతే మరొక ప్రధానమైన పోకడ ఏం కనిపించిందంటే తెలుగు భాషా దినోత్సవం అనుకోవడం.

 గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రతియేటా అగష్టు 29 న చేసేది తెలుగు భాషా దినోత్సవమే, మరి పదిరోజులు గడవకముందే మరోసారి కూడా తెలుగు భాషా దినోత్సవం చేసుకోవడం కోసం ఈ రోజుని కేటాయించుకున్నామా? లేక ఇది వేరేదా? అసలు తెలంగాణను ఇంకా ఒక ప్రాంతపు మాండలీకము లేదా యాస అని మాత్రమే చూస్తున్నారా? తెలంగాణ ను భాష అని ఒప్పుకున్న తర్వాతనే కదా తెలంగాణ భాషాదినోత్సవం చేయాలి. ఒకదానిని భాష అని ఎలా అనుకోవాలి? కేవలం యాసమాత్రమే అని ఎలా నిర్ధారించాలి? దీనిపై భాషావేత్తలు చెబుతున్న సంగతులేమి అన్నది కూడా ముందుగా చూడాలి. భాష లిపిరూపం లోనూ, వాగ్రూపంలోనూ వ్యక్తమవుతోంది. ఒక్కోసారి వేర్వేరు భాషలకు ఒకే లిపి వుండొచ్చు. ఉదాహరణకు మనం హిందీ కోసం వాడుతున్న లిపినే సంస్కృతం కోసం వాడటం తెలుసు కదా. కన్నడ తెలుగు భాషలకు చాలా అక్షరాలు సమానంగా వుంటాయి. ఇంగ్లీషు అక్షరాలలో రాసే భాషలూ చాలా వున్నాయి. ఇలా చూస్తే లిపి ఒకటే అయినంత మాత్రాన భాషలు కూడా ఒకటే అనడం కుదరదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఇక పోతే ఇది వేరే భాష అనడానికి వుండాల్సిన ప్రాధమిక అర్హత ఏమిటి? అంటే అది పదజాలం అనుభవాలను, జ్ఞానాన్ని సూచించేందుకు వేరుగా తనకంటూ పదాలు వాగ్రూపంలోనైనా వున్నదానిని వేరేభాషగా భాషావేత్తలు గుర్తిస్తారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుతో పోలిన, ఉర్ధూతో పోలిన, వివిధ సంస్కృతిక కాలల సంపర్కం వల్ల పోర్చుగీస్ డచ్ వంటి మాటల మేళవింపు తో పాటు తనకంటూ విస్తారమైన పదజాలం వుంది. అది నామవాచక రూప శబ్దాలకే కాక క్రియాపదాలు, విశేషణ వ్యక్తీకరణలకు కూడా తనదంటూ ఒక ముద్ర వుంది.ఈ విషయంలో విస్తారమైన కృషిచేసిన బహుభాషావేత్త నలిమెలభాస్కర్ గారు, నారాయణ శర్మగారు తమ వ్యాసాలలో వివరనలిచ్చారు. కెసిఆర్ గారు సైతం తనదైన శైలిలో సులభంగా ఈ ముచ్చటజెప్పనీకి గోంగూర పుంటికూర, సొరకాయ, ఆనిపకాయె ఉదాహరణలను వాడుతుండే వారు. సామాజిక మాధ్యమాలను అత్యంత అద్భుతంగా ఉపయోగిస్తూ తెలంగాణ పదాలు,ఇసిరెలు,సంస్కృతి వాటి ఫోటోలు( గడిగోలు, Gadigolu ) https://www.facebook.com/groups/2014881298790727 అనే పేస్ బుక్ గ్రూప్ లో తెలంగాణ జిల్లాలలో వాడుకలో వున్న పదాలను వాటి వాడుక పద్దతిని ఫోటోలనూ ఉపయోగకరమైన హాబీలాగా సమిష్టి కృషితో ఒకదగ్గర చేర్చుతున్నారు.

ఇకపోతే ప్రత్యేకంగా వుంటేనేమిటి? ఇదొక తక్కువ స్థాయి భాష, స్టైలుగా చెప్పాలంటే భ్రష్టరూప భాషనే కదా. కథానాయకులు, సంస్కరింప బడిన వారు మాట్లాడాల్సింది ఇటువంటి భాషనే అంటూ సినీ పరిశ్రమ కళారూపాలు కానీ, సాహిత్యరచనలే కాక, పాఠ్యపుస్తకరచనలు సైతం భాషంటే ఇదే అని చూపడమే కాక, కేవలం సంఘవిద్రోహ శక్తులు, సంస్కార రహితులూ మాట్లాడుకునే బాషగా ప్రాంతీయభాషలను చూపడం జరగబట్టే కదా. ఈరోజు ఆ మచ్చచెరుపుకోవడమే కాకుండా అసలు మూలభాషా పదాలు ఎక్కడున్నాయి. సాంస్కృతిక నేపద్యాన్ని పట్టిచ్చేంత లోతైన పదాలు ఏవేవి వున్నాయి అంటూ పరిశోధనలు సాగుతున్నాయి. కాళోజీ ముందుకు 2001లో ఆయన బ్రతికుండగనే తెలంగాణాభాషాదినోత్సవంగా ఆయన పుట్టినరోజు చేస్తామనే  ప్రతిపాదన ముందుకు తెచ్చినప్పుడు కొంచెం తటపటాయించి తెలుగుభాషా దినోత్సవంగానే చేసుకుందాం అని ముందు అన్నప్పటికీ, స్వాతంత్ర పోరాటాన్ని, దేశం ఏర్పడటాన్ని, నిజాం దాష్టీకాన్ని, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటాన్న స్వయంగా తన కళ్లతో చూసిన కాళోజీ తెలంగాణ అస్థిత్వానికి భాషరూపంలో జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేకపోయాడు. ప్రత్యేకతెలంగాణ ఉద్యమ రూపకల్పన నేపద్యంలో ఆయన బలంగా చెప్పిన అభిప్రాయాలు కూడా ఈ సంగతిని ధృడం చేస్తాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో నిధులు, నీళ్ళే కాదు, సామాజిక, రాజకీయ అస్థిత్వాలతో పాటు సాంస్కృతిక అస్థిత్వ నిరూపణలో భాషకూడా ప్రధానమైనది. ఈ తాత్త్విక నేపద్యం వెలుగులో తెలంగాణా భాషాదినోత్సవం చేసుకోగలుగుతున్నామా? అని మరోసారి తరచిచూసుకోవాలి అనిపించింది.

తెలంగాణ భాషా పదాలు అంత తీసేయ్యాల్సినవా?

చిన్న ఉదాహరణలతో చూద్దాం. పచ్చడి జాడీలను అలవాటుగా మడ్తమానులంటరు, మార్తబాన్ లంటరు. ఈ పదం ఈ ప్రాంతంలోనూ ఇక్కడి నుంచి వలస వెళ్లిన వాళ్లలోనూ వినిపిస్తుంది. ఎక్కడిదీ పదం? జాడి అనడమే అలవాటు పడ్డ నోళ్ళకి ఇదేదో పిచ్చిమాట అనిపించొచ్చు. మూలం వెతుకుతూ పోతే ఆశ్చర్య అద్బుతం అనిపించే నిజాలు పదం వెనక దాగివుండటం గమనిస్తాం. దక్షిణ బర్మాలో అండమాన్ సముద్రపు అంచుల్లోని ప్రాంతం గల్ప్ ఆప్ మొట్టామా. ఈ మొట్టామా పూర్వనామం మార్తబాన్. బర్మాతో క్రీస్తు పూర్వం నుంచే తెలంగాణా ప్రాంతంతో సంభంద బాంధవ్యాలు వున్నాయని ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది. పచ్చడి జాడీలకు మార్తబాన్, మడ్తమాను అనే పేరు బర్మాకు తెలంగాణకు మధ్య సంభందాలను తెలిపే పదం. అసలు పచ్చడి జాడీల సంస్కృతి వుందంటేనే నౌకాయానం ఆనవాళ్లను పట్టించినట్లు కదా. ఇక మరికొంచెం లోతుగా చూస్తే ఈ ప్రాంతపు ఆదిమానవుడి సమాధుల్లో మట్టి జాడీలను కనుగొన్నారు. ఈ మృతభాంఢాలు మార్తబాన్ రూపానికి మూలాలయితే పదం ఎటునుంచి ఎటెళ్లింది అనేది లోతుగా చూడాల్సిన విషయమే అవుతుంది. ఎర్కయ్యిందా, తెలిసిందా అవగాహనకొచ్చిందా ఇటువంటి పదాలు తీసుకున్నా ఎరుక, ఎరికల్, ప్రాచీనతను చూడాల్సేవుంది. సాంస్కృతిక ఆనవాళ్ళను వెతికేచోట మాత్రమే కాకుండా సాదారణ కూరగాయల వంటి వాటిదగ్గర కూడా ప్రత్యేకంగా వేరు పదజాలం గోదావరీ పరివాహం, కృష్ణాప్రవాహానికి మధ్యనున్న నేలపై ఎప్పటినుంచి ఎందుకు ఎలా ఏర్పడి వుంటుంది అనేది పరిశోధనాంశమైతే ఇటువంటి ప్రోదిచేసిన పదాల లోతులు అర్ధం చేసుకోవడం భాషాదినోత్సవం సందర్భంగా చేయాల్సిన పని అనుకుంటాను.

మరి తెలంగాణ భాషాదినోత్సవాన్ని వాడుకభాషా దినోత్సవం అన్నా సరిపోతుందా?

వాడుకలో మనం ఏ భాషనైతే ఎక్కువగా వాడుతున్నామో అదే కదా వాడుక భాష. వాడుక రూపానికి రచనా రూపానికి మధ్య వ్యత్యాసం తగ్గించాలే ఉద్యమాలే జరిగాయి. మనం ఈరోజు ఏ ఒక్కభాషనో వాడుక భాషకాక మిక్చర్ మషాలా పొట్లంలాగా తెంగ్లీషు, తెహింగ్లీషు, లాంటివి వాడుక భాషలుగా మారాయి. సవరలు వాళ్లు మాట్లాడే భాషే వారికి వాడుక. తెలంగాణ భాషనే వాడుకభాషగా వున్నవారైనా లేనివారైనా ఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాష ప్రాశస్త్ర్యముప్రాముఖ్యతలను గురించి మాట్లాడటం అర్దం చేసుకోవడం వారే ఆ భాషలో రచనలు చేయలేకపోతే అటువంటి రచనలు ఆదరించడం గౌరవించడం. తెలంగాణ భాషలో సాహిత్య సృజన జరిగేలా ప్రేరేపించడం ఈ దినోత్సవం సందర్భంగా చేయాల్సిన పనులు కదా.

పెద్ద చట్రంలోని ఒక్కో భాగం ధృడపడటం అంటే మిగిలిన భాగాలు బలహీనం అవ్వడం అనే ఉద్దేశ్యం కాదు ఇలా ఒక్కొక్కటీ బలపడి నిలబడితే మొత్తం దేశమనే చట్రం కావచ్చు మరింత మరికొంత ధృడంగా మారుతుంది అనే కోణంలో చూడాలని కోరుకుంటూ

సెలవు నమస్కారం

మీ

కట్టా శ్రీనివాస్

Katta.khammam@gmail.com

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి