తెలంగాణా స్వాతంత్య పోరాట యోధుడు తొలితరం జర్నలిస్టు ఖమ్మం కీర్తిబావుటా షోయబుల్లా ఖాన్


 తెలంగాణా స్వాతంత్ర్య సమరపు మరో గాంధీ

కలాన్ని ఆయుధంగా మార్చి పోరాడిన యోధుడు

ఆపరేషన్ పోలోకు ప్రధాన ప్రేరణ షోయబుల్లా ఖాన్

 

1948 అగష్టు నెల 21 అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ వీధుల్లో ఇద్దరు జర్నలిస్టులు నడుచుకుంటూ లింగపల్లి దగ్గర్లోని వాళ్ల ఇంటికి వెళ్తున్నారు. ఒకరు షోయబుల్లా ఖాన్ ఇంకొకరు ఆయన బావమరిది ఇస్మైయిల్ ఖాన్.అర్ధరాత్రి దాటేంతవరకూ పనిచేసి వస్తున్నది పత్రికా కార్యాలయం నుంచి, ఆ పత్రిక పేరు ఇమ్రేజ్ నిజానికి షోయబుల్లా ఖాన్ దానిలో కేవలం ఉద్యోగి కాదు ఒక ఆశయంతో దాన్ని స్థాపించింది అతనే, జాతియ స్థాయిలో ఉర్ధూ దినపత్రిక వుండాలన్న సంకల్పంతో తన తల్లి లాయహున్నీసా బేగం భార్య ఆజ్మలున్నిసా బేగంల కొద్ది పాటి నగలను అమ్మిమరీ పెట్టుబడి పెట్టిన జర్నలిజం విద్యార్ధి అతడు.



భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి సంవత్సరం పూర్తయ్యింది. కానీ తెలంగాణాలోని ఎనిమిది జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని మరొ ఎనిమిది జిల్లాలతో హైదరాబాద్ రాష్ట్రానికి ఈ స్వాతంత్రం వర్తించలేదు. పైగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్న రోజులు. వీటిని తట్టుకోలేక సాధారణ ప్రజలు సాయుధ పోరాటానికి తెగబడిన రోజులు, ఎందరో అమాయకులు ప్రణాలను అర్పిస్తున్న రోజులు. అయినా సరే నిజాం తొంబైరకాలకు పైగా పన్నులతో జనం నడ్డివిరుస్తున్న కాలం. అవే ముచ్చట్లు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు ఇద్దరూ,

‘‘ బావా రెండ్రోజుల క్రితం అగష్టు 19న జమురుద్ సినిమా హాలు మీటింగ్ లో ఖాశింరజ్వీ మాటలు చాలా అన్యాయం కదా.వారికి వ్యతిరేఖంగా పనిచేసేవారి చేతులు క్రిందకు దిగాలి లేదా తెగిపడాలి అనిపిలుపునిచ్చాడు. ఇప్పుడాయన పిశాచులందరూ ఆ మాటను వేదంగా పట్టుకుని వేటకు బయలుదేరారు. మన పత్రికేమో వెనకాడకుండా నైజాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత్ లో కలవడమే మంచిదని రాస్తున్నాం. ఆ ముష్కరులు దాడిచేసే అవకాశం లేదా?’’



షోయబుల్లా చిన్నగా నవ్వాడు ‘‘ ఇస్మాయిల్ ఎప్పుడో తలతెగిబడుతుందని ఇప్పుడే వంచితే మరణం ముందుగా వచ్చినట్లే కదా? రయ్యత్ పత్రికను మూసేసాని మనం చేతులు ముడుచుకు కూర్చున్నామా? పసిపాపలకు పాలిచ్చే బాలింతలు సైతం తమవారందరి మానమర్యాదల కోసం నాటుతుపాకులతో పోరాటానికి దిగుతున్న కాలంలో మన కలం వెనకంజ వేస్తే అది చావుకన్నా నీచం అవుతుంది.’’

చాలా స్పష్టంగా మొండిగా సమాధానం చెప్పాడు.

‘‘ అందుకే బావా మీ నాయన మా రైల్వే పోలీస్ మామ హబీబుల్లా ఖాన్  నిన్ను ముద్దుగా షోయబుల్లా గాంధీ అని పిలిచి ముచ్చట పడేది. స్వతంత్ర పోరాటంలో మహాత్ముడిలాగానే నైజాం విముక్తికి నీ పోరాటం అలాంటిదే.’’ ఇస్మాయిల్ ఆగకుండా చెప్తూనే వున్నాడు.

ఇద్దరి నడకా సాగుతూనే వుంది,వీదిలైటు క్రీనీడలో ఒక కుక్క వీళ్లకేసి అనుమానంగా చూస్తూ పక్కకెళ్ళింది. మూసీ పరవళ్లను మించిన జనం పరుగులు సద్దుమణిగి నిద్రపోతున్న సమయం.

గాంధీతో పోల్చి బావమరది పొగుడుతుంటే షోయబ్ కి వాళ్ళమ్మ గుర్తొచ్చింది. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో పుట్టి ఇక్కడ నిజాం ప్రాంతానికి మొట్టినిల్లుగా వచ్చింది. ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం లోని సుబ్రవీడు(సుబ్లేడు)లో తనకి జన్మనిచ్చేప్పుడు కానీ ఇప్పుడు కానీ పెద్దగా ఆస్తిపాస్తులలో ఆమె తులతూగలేదు. ఎక్కడో బొంబాయికి పంపించి ఇంటర్మీడియట్ దానితో పాటు డ్రాయింగ్ కోర్సు చేయించారు. ఉస్మానియా నుంచి బిఏ జర్నలిజం చేయిస్తే తనేమో ఆమెకు కొత్త నగలేవీ చేయించక పోగా ఉన్నవి కాస్తా అమ్మి ఇప్పుడిలా పత్రిక నడుపుతున్నాను. నాన్నకు షోయబుల్లా గాంధీ కావచ్చు అమ్మకి ఎప్పుడూ గాబరా నింపే కొడుకునే అవుతున్నా’’ ఆలోచిస్తూ వుండగానే అటుగా వెళుతున్న ముగ్గురు ఒక్క క్షణం ఆగి నమస్తే షోయబ్ భయ్యా అంటూ పలకరిస్తే తేరుకుని ఈ లోకం లోకి వచ్చాడు. ‘‘ఏంటి ఇప్పటిదాకా ఈ చేయి రాస్తూనే వుందా కరచాలనం చేస్తున్నట్లు ఒకడు పట్టుకున్నా ఆ మాటలో ప్రేమకన్నా వ్యంగ్యమేదో గుచ్చుకుంటోంది అనుకుంటుండగానే అందులో ఒకడు షోయబ్ కి వెనకవైపుగా వచ్చాడు. ప్రమాదాన్న గమనించేలోగా అతడి చేతిలోని తుపాకీ ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ ఢామ్మంటూ పేలింది. ‘‘ ఎవర్రా మీరు?’’ ఇస్మాయిలో అరుస్తూ దగ్గరగా రాబోయాడు, షోయబ్ ఎడమచేత్తో అతడిని దూరంగా నెట్టేసే లోగా ఇంకో బుల్లెట్ దిగింది. కుడిచేతిని పట్టుకున్న వాడు మళ్ళీ అంటున్నాడు ఇదే చేత్తో కదా తెగ రాసేస్తున్నవు పగటి ప్రభుత్వం- రాత్ర ప్రభుత్వం అంటూ ఈ జనవరి 29న ఏదో రాసావు. ఎట్టెట్టా నిజాం పాలన, రజాకార్లు ఈ తిరగలిలో జనం నలిగిపోతున్నారా ఇలాగేనా చేతిని బలంగా మెలితిప్పుతున్నాడు. ఈసారి విషపు నవ్వుని అతడు దాచుకోలేదు. ఈలోగా మూడో వాడు తనచేతిలో తల్వారుతో పట్టుకున్న చేతిని నరికేసాడు. ఆ దారుణాన్న ఆపాలని మరోసారి ముందుకొచ్చిన ఇస్మాయిల్ పైనా కత్తివేటు పడింది. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు ఈ గందరగోళానికి లేచినట్లున్నారు. ఎవర్రా అధి ఇద్దరుముగ్గురు కర్రలతో పరిగెత్తుకొస్తున్నారు. ఈ ముగ్గురికీ ఆట్టే సమయం లేదని అర్దం అయ్యంది. ఇంకోపోటు పొడిచాడు. పడిపోయిన తర్వాత కాళ్లతో తన్నారు. ఈలోగా జనం సమీపిస్తున్న అడుగుల చప్పుడుకి దూరంగా పారిపోయారు.



మరుసటిరోజు అగష్టు 22

ఆసుపత్రిలో తీవ్రమైన స్థితిలో ఆఖరుదశలో వున్నానని షోయబ్ కి అర్దం అయ్యింది. మరణానికి భయపడొద్దని తల్లిదండ్రులకు స్వయంగా నచ్చచెప్పాడు. ఈ త్యాగం ఉద్యమంగా రగులుతుందని నైజాం స్వేచ్చా వాయువులు పీల్చుకునేందుకు ఈ సంఘటన కారణం అవబోతోందని నిబ్బరాన్ని ఇచ్చే ప్రయత్నం చేసాడు. తనకోసం బాధపడటం కన్నా ఇమ్రేజ్ పత్రిక అంతేలా తలెత్తుకుని నడిచేందుకు ప్రయత్నం చేయండన్నాడు. అయినా ముద్దూ ముచ్చట తీరని తమ 28 ఏళ్ళ కొడుకు కళ్ళముందే ఇలా అయిపోవడం వారికి కానీ ఒకపాపకు తల్లి అయి ఇప్పుడు గర్భవతిగా వున్న అజ్మలున్నీసా బేగంకు కానీ మింగుడుపడటం లేదు. కానీ స్వాతంత్ర వచ్చిన నెల అగష్టు 22వ తేదీ తెల్లవారుఝామున వారికి చీకటిని మిగిల్చి నెమ్మదిగా తన వేడి వెలుతురిని విస్తరించడం ప్రారంబించింది.

ఈ సంఘటన తమ సర్కారుని కూలదోసేంత పెద్దదిగా పెరిగే ప్రమాధం వుందని నైజాం సర్కారు కూడా అర్ధం చేసుకున్నట్లుంది. షోయబ్ అంతిమ యాత్ర జరగకూడదని నిషేదం విధించింది. ఎందరో అభిమానులు ఆఖరివీడ్కోలుకు దూరం చేసింది. చివరికి గోషామహల్  మాలకుంట శ్మశాన వాటికలో అతికొద్దిమంది దగ్గరివారి సమక్షంలో ఖననం చేసారు.  ఈ సందర్భంగా వాళ్లు ఎంతగా అల్లాడిపోయారంటే మరణించిన కొడుకు సమాధికి సైతం రిజ్వీ మూకలు అగౌరవం చేస్తారేమో అని ఉద్యోగరీత్యా రైల్వే పోలీసు అయిన షోయబ్ తండ్రి హబీబుల్లా తుపాకీతో ఆ ఖనన స్థలికి కాపలాగా వుండి వార్తలకెక్కారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.



ఈ కేసుని ఇంకా నిశ్శబ్దంలోకి తొక్కేయాలని తప్పుడు రిపోర్డులు ప్రకటనలు ఇచ్చారు. కేవలం వ్యక్తిగత కక్షలవల్ల జరిగిన దాడి అని నిందితులను పట్టుకుని శిక్షిస్తున్నామని తప్పుడు ప్రకటనలు ఇచ్చారు. కానీ నిజంమాత్రం షోయబ్ అంత పౌరుషం అయినదే కావడంతో దాని పొలికేక భారత రాజ్యాంగ పరిషత్ లో సెప్టెంబర్ 7న స్వయానా ప్రధాని జవహర్ లాల్ హైదరాబాదులో జరిగిన ఈ దారుణ హత్యా చేతులు నరికిన సంఘటనను ప్రస్తావిస్తూ హైదరాబాద్ అనాగరిక స్థితికి చేరుకుంటోంది అన్నారు. ఈ విషయమై మరింత చురుకైన అడుగులు వేయాల్సిన అవసరం వుందని సభ్యులు తీర్మానించుకున్నారు.  

ఈ తీర్మానం చేసిన అతికొద్ది రోజుల్లోనే భారతసైన్యం ఆపరేషన్ పోలో తో సైన్యాన్ని నలుదిక్కుల నుంచీ నైజాంపై ముట్టడించింది.

షోయబ్ మరణం వృధాపోలేదు ఆయన కలగన్న రోజు రానేవచ్చింది. కానీ అదంతా నెమరేసుకునేందుకు మాత్రం డెబ్బయిఏళ్ళు పైగా ఆగాల్సివచ్చింది.

మరణశయ్యపై ఆయన తనవాళ్ళతో చెప్పిన మాటలు సుబ్లేడులో ఏర్పాటు చేసిన విగ్రహం మళ్ళీ మళ్లీ చెపుతున్నట్లే అనిపిస్తోంది.

మరణం ఎవరికైనా అనివార్యమే అదిఏదో రోజు రాకుండా మానదు. అది ఒక పెద్ద వెలుతురుకి సమిధగా మారడం. అది త్యాగపు వత్తిగా ఒక చైతన్యాన్ని నెత్తిన మోయగలగే అదృష్టం కొందరికే దక్కుతుంది. తుపాకి నుంచి లక్ష్యం వైప వెలువడిన తూటాను చూసి దానికి మరణం సంభవించిందని బాధపడకూడదు. తుప్పుపట్టిపోవడమే మరణం లక్ష్యాన్ని చేధించేందుకు కారణం కావడమే జననం.

 

(ప్రస్తుతం తిరుమలాయపాలెం మండలంలో ఉద్యోగిగా పనిచేస్తున్న నాకు వీరిని ఈ సందర్భంగా తలచుకోవడం కనీస కర్తవ్యం అనుకుంటున్నాను. నిజానికి షోయబుల్లా ఖాన్ గురించి మిగిలిన ఆధారాలు చాలా చాలా తక్కువ వాటిని ఒక దగ్గర చేర్చాల్సిన అక్కర నైజాంలో జరిగిన సాయుధపోరాటాన్ని రికార్డు చేయవలసిన అవసరమంత నిజం. కేవలం ఉక్కుమనిషి ప్రయత్నమే కాదు. మొక్కవోని దీక్షతో కృషిచేసిన ఇంకెందరినో తలచుకోవడం మన కర్తవ్యం.)

 

 

 పేస్ బుక్ పోస్టు 

సమాచార సేకరణలో ఆకరాలు, ఆధారాలు

·         Ashraf T is a PhD student in Communication, University Hyderabad, (Urdu press in the princely state of Hyderabad )

·         సయ్యద్ నసీరుద్దీన్ గారు

·         రావెల సోమయ్య గారు

·         కామిడి సతీష్ రెడ్డి గారూ

·         నటరాజన్ గారి డాక్యుమెంటరీ

·         వికీపిడియాలో సమగ్రపరచిన సమాచారం మరికొన్ని యూట్యూబ్ విడియోలు

·         వివిధ ఆన్ లైన్ ఆఫ్ లైన్ సమాచార వేదికలకు ధన్యవాదాలతో

:

;



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి