ఆత్మాయిడ్ ఎట్ ఆండ్రాయిడ్ - కట్టా శ్రీనివాస్


‘‘ డియర్ యన్ ఐ సెక్స్ రోబోట్ ల వల్ల మానవజాతికి ఏర్పడిన ముప్పుకు మీరు ఏదన్నా పరిష్కారం చూపించగలరేమో అనే మిమ్మల్ని జ్ఞాన సుప్తావస్థనుంచి మేల్కొలిపాం. హలో మీకు వినిపిస్తోందా? ’’
ఒక మృదువైన ఆడగొంతు మాటలనుకుంటా అవి. నిద్రలోంచి లేవకముందే ఏదో ఛానల్ వింటున్నట్లుగా వుంది. కానీ కళ్ళు తెరవడానికి రావడంలేదు అసలు కళ్ళు కాదు కాదు దేహం వున్న ఎరుకే కలగటం లేదు. అసలు నేనెక్కడున్నాను. ఇంకా మెలకువ రాలేదా?
‘‘ హలో హలో మైక్రో ఫోన్ చెక్... యన్ ఐ యన్ ఐ మీకు వినిపిస్తోందా? సమాధానం చెప్పండి, ఈ భాష మీకు తెలిసిందే కదా? 2020 ప్రాంతంలో మీరు వాడిన భాషే కదా?’’
నాతోనే ఎవరో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారన్నది నిజం. మాటపెకలించే ప్రయత్నం చేసాను. కళ్ళుతెరవని చీకట్లోంచే దేహం స్పృహకోసం వెతుక్కోకుండానే నా మాటను బయట పెట్టే ప్రయత్నం చేసాను.
 నేను ఎ..హె..క్కడా ఆ వున్నా....ను ఊ.. అది నా గొంతేనా ఏదో అపరితమైన యంత్రపు గొంతులా వస్తోంది.
నా మాట పూర్తవక ముందే పక్కన సంతోషపు అరుపులు వినిపించాయి. సక్సెస్... సక్సెస్ ... అంటూ.
ఒక్కోమాట కూడ బలుక్కుంటూ మళ్ళీ అడిగాను, దయచేసి చెప్పండి నేను ఎక్కడున్నాను? నాకేం జరిగింది? అట్నుంచి ఇందాకటి ఆడగొంతు మళ్ళీ మాట్లాడుతోంది.
‘‘ఒకే ఒకే కూల్ మరీ ఎక్కువ తెలిస్తే మీ న్యూరాన్స్ దాన్ని ఫీడ్ చేసుకుంటూ తట్టుకోవడం కష్టం. అస్సలు అర్ధం కాకపోతే మీరుస్పందించడం కష్టం మా పరిమితుల మేరకు సంక్షిప్తంగా మీ మెమరీ బైట్స్ కి లోబడి చెపుతాను వినండి’’ అంటూ కొనసాగించింది.
నా న్యూరాన్స్ తట్టుకోలేవా? మా 2020 కాలపు నాటి భాషా? ఇలా ఆలోచిస్తుండగానే ఆ గొంతు ఆదుర్ధాగా
‘‘ ఆగండాగండీ మీ హీట్ ఇండెక్స్ మరీ పెరిగిపోతోంది, ఏదో చిక్కుముళ్ళ ప్రొగ్రామ్ మీ మెదడులో ప్రశ్నల వరుసలా రన్ అవుతోంది కదా, కూల్ ప్లీజ్ కూల్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి చాలు. అలా అయితేనే మీ మెదడు పనితీరు జీవనంలో వుండగలుగుతుంది. ఇదెక్కడి తెలుగోరా నాయినా ఒకప్పటి గూగుల్ ట్రాన్స్ లేషన్ లాగా ఒక్కో వాక్యం పట్టిపట్టి పుస్తకాల భాషను మాట్లాడుతోంది.
‘‘అలర్ట్ గా వినండి దయచేసి..... మీరు ఇప్పుడు 2074లో వున్నారు, అందరూ మూలకణాలను భద్రపరిచే రోజుల్లోనే మీరు మీ ఆలోచనలను ఆపరేటింగ్ సిస్టం పద్దతిలో తయారుచేసి మైండ్ రీసెర్చ్ సెంటర్ లో భద్రపరిచారు. అప్పట్లో వాళ్ళు ఈ మెమరీ డిస్క్ ను స్వతంత్రంగా పనిచేసేలా అభివృద్ధి చేయలేకపోయారు. మేం సగం రోబోట్ సగం మనుషులం అన్నమాట పరిణామం చెందించిన మానవదేహంలో పనిచేస్తున్న కృత్రిమ మెదడు నియంత్రణలోపనిచేస్తున్నవాళ్ళం అయినా సరే. మాకు మీ సహాయం కావలసి వచ్చింది. అచ్చంగా ఏ చిప్ సహాయం లేకుండా పనిచేసే మానవ మెదడు కోసం చాలా చోట్ల వెతికాం. అప్పటి మూలకణాలను పురాతన తవ్వకాలలో వెతికి మా పరిశోధనాశాలల్లో అభివృద్ధి చెందించినా సరే దేహం, మెదడు ఏర్పడుతోంది కానీ దానిలోపట  భాషా సంస్కృతికి సంభందించిన జ్ఞాన నిల్వలు స్వయంగా నియంత్రితమయ్యే దశలో దొరకటం లేదు. కానీ మీ జ్ఞానం పనిచేసే విధానం మొత్తంగా మీరు డిస్క్ లో భద్రపరచడం వల్ల ఇలా మీ దేహం ఎప్పుడో పోయినా సరే ఆలోచన రూపంలో మా ముందు బ్రతికే వున్నారన్నమాట. ’’
అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 2074 అంటే ఏముంది దేహంగా మిగిలే వుంటే 1974లో పుట్టిన నాకు వందేళ్ళు అన్నమాట. ఏమయ్యింది మరి అవును నా మెదడును కాపీ చేసి భద్రపరిచే ప్రాజెక్టులో స్వచ్ఛందంగా అప్పుడెప్పుడో పాల్గొన్నాను.  ఆ తర్వాత ఏమయ్యింది నో నో పెద్దగా ఆలోచించవద్దు కదా ఒకే ఒకే. అంటే నా ఆలోచనలను మాంత్రికుడి సీసాలో పెట్టి మాట్లాడుతున్నట్లు ఏదో మిషన్ ద్వారా వాటిని పనిచేయిస్తూ మాట్లాడుతున్నారన్నమాట. అది కూడా నాకు తెలియాలనే నా కాలంలో వాడిన భాషను బహుశా రియల్ టై అనువాదాలను ఉపయోగిస్తున్నారేమో. అయినా ఇంత తక్కువ సమయంలో ఇంత మార్పు వస్తుందా? ఎందుకు రాకూడదు. మార్పు తాలూకూ వేగం మరింత పెరిగింది కదా కృత్రిమ మేధస్సు స్వంతంగా పనిచేయడం మొదలయ్యాక అది మరింత పుంజుకుని వుంటుంది. సరే నాకు నేను ఇలా దొరకడం నావరకు నాకు బావుంది. నాకాలపు జ్ఞాపకాన్ని తెలుసుకోవడం వాళ్ళకికూడా బావుంటుందన్నమాట. పైగా నా సహాయం అడుగుతున్నారు. అంటే నా అనుభవాలు ఏర్పరచిన జ్ఞానం నుంచి వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సి వుంటుందన్న మాట. సరే అయితే.
‘‘ నన్ను తిరిగి ఆలోచనగా బ్రతికించినందుకు ధన్యవాదాలు, చెప్పండి మీకు ఏం కావాలో’’
‘‘ గ్రేట్ డియర్ యన్ ఐ (నాచురల్ ఇంటిలిజెన్స్) చాలా త్వరగా పరిస్థితులను ఆకళింపు ఆబ్లిక్ అర్ధం ఆబ్లిక్ సంజాయింపు చేసుకున్నారు. ఇంత త్వరగా పరిస్థితులకు అనువుగా మీ స్పందనలను మా మానిటర్ చూపుతోంది. మీకు కూడా అభినందనలు’’ అదే ఆడగొంతు నాకు వినిపిస్తోంది. ఈ ఆబ్లిక్ ఏంటి ఓహో అనువాదపు తిప్పలన్నమాట. సమజవుతొందిలే పో...
‘‘యువర్ అటెన్సన్ ప్లీజ్.....  మీరు రోబోట్ సోఫియాను చూసే వుంటారు ఆ కాలంలో మీరు జీవించే వున్నారు కదా’’ బహుశా నేను గతాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నానో లేదో పరీక్షిస్తూ మరికొంచెం ముందుకెళ్ళడానికి వేసిన ప్రశ్న అని అర్ధం అవుతోంది. అది అత్యంత ప్రాధమిక దశలోని రోబో అన్నమాట దాని తర్వాత వందలాది ప్రతిస్పందనలను అర్దం చేసుకోగల రోబోలు చాలా త్వరగా తయారయ్యాయి. వేర్వేరు రంగాలలో మనుషుల కంటే ఎన్నోరెట్లు సమర్ధవంతంగా పనిచేయడం ప్రారంభించాయి. ఆఖరుకి లైంగిక సంతోషానికి కూడా ఇవి మనిషికంటే ఎన్నో రెట్లు గొప్పగా ఉపయోగపడ్డాయి. హార్ట్ బీట్, పల్స్, శారీరక స్థితులను గమనిస్తూ దానికి అనుకూలంగా మార్పులు చేసుకుంటూ మాగ్జిమమ్ కాదు ఆప్టిమమ్ లెవల్స్ లో పార్టనర్ ను సంతోష పరచడం ప్రొగ్రాం చేయబడింది. అసలే భూగ్రహం నివాసానికి అననుకూలంగా మారుతూ వుండటంతో స్పేస్ షూట్ లాంటి నత్తగుల్ల డిప్పల్లో తప్ప బయట బ్రతకటం కుదరని పరిస్థితుల్లోకి మనుషులు వెళ్ళిపోయారు. లైంగికానందానికి మామూలు పద్దతులకంటే ఇటువంటి రోబోలే ఎన్నోరెట్లు మేలని భావిస్తూ వాటికి అలవాటయిపోయారు. అదే పద్దతిలో లైసెన్సులు కూడా ఏర్పాటయ్యాయి. నిల్వ చేసిన అండం వీర్య కణాలతో మొదట్లో ఫలదీకరణం చెందించి తర్వాతి తరాలను ప్రయోగశాలల్లో తయారుచేసేవారు. అది చాలా పెద్ద ప్రాసెస్ కావడంతో కణాలను టెస్ట్ ట్యూబ్ లో పెంచి కావలసిన డియన్ ఏ మార్పులతో దేహం తయారయ్యాక దాన్ని నియంత్రించే యూనిక్ చిప్ లను మెదడుగా అమర్చడంతో సగం రోబోట్ సగం మనిషిగా తయారయ్యే జనాభానే దాదాపు ప్రపంచం అంతా ఏర్పడింది.’’  
‘‘యువర్ అటెన్సన్ ప్లీజ్..... ఇక్కడే మాకీమధ్య పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ సెక్స్ రోబోట్లతో కలిసి వచ్చిన తర్వాత నుంచి ఆండ్రో హ్యూమనాయిడ్ లలో డీ బగ్ చేసినా తొలగని కరెప్టెడ్ ప్రొగ్రాం ఎంటర్ అవుతోంది. వాళ్ళు మొత్తంగా హ్యూమన్ నెట్ ని ధ్వంసం చేసేస్తున్నారు. ఇది వుంటున్న గ్రహాన్ని పేల్చేయడం కంటే పెద్ద సమస్య.’’
‘‘ ఆగాగు హ్యూమన్ నెట్ ఏంటి  దాన్ని ధ్వంసం చేయడం ఏంటి?’’ నాకీ సందేహం తీరితే కానీ ఆలోచన ప్రాసెస్ ముందుకెళ్ళదు కాబట్టి అడగాల్సిందే.
‘‘ యస్ యన్ ఐ....’’ ఇంకేదో చెప్పబోయింది గొంతు నేను ఆపాను.
‘‘ తొక్కలోది ఈ యన్ ఐ ఏంటి తల్లీ, నువ్వు మీరు సారు, పేరు ఏదో ఒకటి వాడరాదూ వినలేక చస్తున్నా, ఇంతకీ నీ పేరేమిటి? గొంతు అమ్మాయిదిలా వుంది అమ్మాయివే కదా’’  ఎందుకో ఈ విషయాలు అమ్మాయితో మాట్లాడటం కొద్దిగా ఇబ్బందిలా మరికొంచెం ఉత్సుకతలా అనిపిస్తుంటే అడిగాను.
‘‘ యువర్ అటెన్సన్ ప్లీజ్..... సారీ యన్ ఐ మీకింకా పేరు ఖరారు కాలేదు. నేను దా.. దా... పు.. అమ్మాయినే అనుకోండి, కానీ జండర్  మార్పు అనేది చాలా చిన్న విషయం మాకు. ఇక మీరు అడిగిన హ్యూమన్ నెట్ గురించి చెపుతా వినండి. మీరు ఇంటర్ నెట్ వాడే వారు కదా, దానికి సర్వరు, పవర్, సమాచారం ఇదంతా ఒక పెద్ద ముతక యంత్రాంగం వుండేది కదా. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆర్కియాలజీ తవ్వకాలలో సముద్రం అడుగున మీరు ఆ కాలంలో వాడిన కేబుల్స్ దొరుకుతున్నాయి. కానీ మా దగ్గర విధానం మారింది. మొత్తంగా మీ మెదడు ఒక సర్వర్, దాని నుంచి న్యూరాన్స్ సహజంగా వున్న నెట్ వర్క్ శరీరంలో తయారయ్యే విద్యుత్తు దాన్ని ప్రసారం చేసేందుకు సరిపోతుంది. మేం చేసిన పనల్లా ఇలా ఒకరి ఆలోచనలు మరోకరితో కలిసే విధానం, ఇలా కోట్లాది ఆలోచనలు సెమీ సర్వర్ లుగా ఒకరినుంచి మరోకరికి ఉపయోగపడతాయి. దానికి సెర్చ్ ఇంజను వుంది. వీటిని సమీకరిస్తూ ఒక కృత్రిమ స్టోరేజి లోకేషన్ను కూడా ఏర్పాటు చేసాం కానీ ఈ మొత్తం మేధస్సును ఆ కంప్యూటర్ బ్యాక్ అప్ చెయ్యలేదు. సెర్స్ కు అనుకూలిస్తూ సర్స్ చేసేందుకు మాత్రం ఉపయోగపడుతుంది. ఇప్పుడు సెక్స్ రోబోట్ తో కలిసిన తర్వాత ఇండివిడ్యువల్ ఈ చైన్ పాలిటి బగ్ అవుతున్నాడు తను ఆర్డర్స్ తీసుకోవడికి నిరాకరించడమే కాక మరికొంత మందిని దాని నుంచి వెలుపలికి పట్టుకొస్తున్నాడు. ’’

‘‘ షటప్ ముందు ఈ పద్దతి మొత్తం ఆపెయ్యండి. ఆ తర్వాత ఇన్పెక్టెడ్ వారిని పరీక్షించి డీ బగ్ చేసుకోండి.’’
‘‘ దయచేసి మరికొంచెం సరిగా చెప్పగలరా.... మొత్తంగా ఈ పద్దతి ఆపితే ఇక మనిషికి అటువంటి సంతోషం ఎలా? ఇవేమీ లేని మీ కాలంలో ఏం చేసేవారు అది తెలుసుకోవడానికే మిమ్మల్ని ఇలా హైబర్ నేషన్ నుంచి బయటికి తీసుకొచ్చాం’’
‘‘ దానికి నా మెదడుతో చెప్పలేను, దేహం కూడా మరికొన్ని నిమిషాల్లో ఏర్పాటు చేయండి డెమో ప్రాక్టికల్స్ కూడా ఏర్పాటు చేయిద్దాం. లేదంటే మొత్తంగా నన్ను ఇలా ఆలోచించుకుంటూ కూర్చోకుండా స్విచ్ ఆఫ్ అయినా చెయ్యండి.... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్....’’
టఫ్..... స్విచ్ ఆఫ్ అయ్యిందా.? లేక పోతే నేను నిద్రలోకి గానీ.............జా......(బ్లాంక్...)
మొల్లగా మెలకువవస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సారి దేహం కూడా వున్నట్లు అనిపిస్తోంది. కలలోంచి లేస్తున్నానా? కలలో జరిగిన సంఘటన నిజమే కాబట్టి దేహంతో పాటు కలిసి లేస్తున్నానా?
ఏమో మరికొంచెం మెలకువ వచ్చాక పరిశీలించాలి.







కామెంట్‌లు