Saturday, 11 August 2018

పిరికిమందు కార్ఖానా

సుడితిరుగుతున్న సమాజంలో
కాళ్లకు కళ్ళకు మనసుకు బంధనాలు పడుతున్నాయా మిత్రమా?
పిరికివాడి కంటే పిరికిమందు పంచేవాడు ప్రమాదకారి
గొర్రె నడుపుకుపోతున్న  సింహాల మందకంటే
సింహం నాయకత్వంలోని గొర్రెల సేన గెలిచే అవకాశాలు ఎక్కువ.
మొద్దుగా పడి జీవితం గడిపే పెద్ద బురదపాముపై
సతతం చురుకుగా శ్రమించే చీమలు గెలిచేది అందుకే.
పిరికితనం ఎదురుదెబ్బ కాదు తట్టుకోవడానికి మిత్రమా!
అదొక అంటువ్యాధి.
చేవచచ్చిన చేపలు, జీవంలేని పుడకా మాత్రమే ప్రవాహంలో కొట్టుకుపోతాయి.
ఎంత తోసుకెళ్తున్న ముంపులోనైనా  ఈదే ప్రయత్నం మాననిదే జీవి.
పుట్టుకనుంచి పోయే వరకు సంఘర్షణే
అసలు చలనమే లేకుంటే కాలమూ, లోకమూ  ఉండదు.
ఎందుకలా డిప్పలోనే కూర్చొవటం
గొప్పవిషయమని భావిస్తూ, భోదిస్తావు?
పిడికిలి బిగించినప్పుడే నీమీద నీకైనా పట్టుచిక్కుతుంది.
అడుగుముందుకు పడితేనే గమ్యం చేరువౌతుంది.

●తేదీ ౾ 11-08-2018 

Saturday, 14 July 2018

థాయ్ ల్యాండ్ గుహ సంఘటనలో తలచుకోవలసిన వ్యక్తి : చాంతవాంగ్(Ekkapol Ake Chantawong)

#thaicaverescue

చాంతవాంగ్ థాయ్ ల్యాండ్ గుహ ప్రమాదంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి.  ఎరక్క లోపట దూరి ఇరుక్కుపోయిన చిట్టి పొట్టి పిల్లల సాకర్ టీం కి మన చాంతవాంగ్ ట్రైనర్. వాళ్ళ టీం పేరు కూడా తమాషాగా wild boars

25 ఏళ్ల కుర్రాడు చాంతవాంగ్ ను మొదట్లో అందరూ తెగతిట్టుకున్నారు. అంతబప్రమాదకరమైన నిషేధ నిషిద్ధ ప్రదేశానికి ముక్కుపచ్చలారని చిన్నారులని తీసుకెళ్లినందుకు తిట్టుకున్నారు. కానీ నిజాలు తెలుసు కుంటున్న కొద్దీ ఈ యువకుడు చాంతవాంగ్ పై అభిమానం ఆప్యాయత స్థాయి దాటి గౌరవం కలుగుతుంది.

Thursday, 5 July 2018

థాయ్ లాండ్ అందాల గుహలోపట అపాయంలో ఇరుక్కున్న చిన్నారులు


 జూల్స్ వెర్స్ భూగర్భంలోకి సాహస యాత్ర (Journey to the center of the Earth  ) చదివారా? పోనీ సినిమాగా చూసారా? భూగర్భ శాస్త్రంలో ప్రొఫెసర్‌ అయిన ప్రొఫెసర్‌ లీడెన్బ్రాక్‌కి అతి అల్లుడు ఏక్సెల్‌ పరిశోధనల్లో, అధ్యయనాలలో సహకరిస్తూ ఉంటాడు. భూగర్భంలోకి, భూమి కేంద్రం వరకు తీసుకు పోయే ఒక సహజ, రహస్య, సొరంగ మార్గం గురించి ఉన్న ఒక పురాతన రాతప్రతి ప్రొఫెసర్‌ లీడెన్బ్రాక్‌కి చేతికి దొరుకుతుంది. ఆ రాతప్రతి ఆధారంగా ప్రొఫెసరు, అతడి అల్లుడు ఒక అసామాన్య యాత్ర మీద బయలుదేరుతారు. ఐస్లాండ్‌లో ఒక నిష్క్రియమైన అగ్నిపర్వత ముఖం ఆ మార్గానికి ద్వారం. ఆ సొరంగ మార్గంలోకి ప్రవేశించి ఆ మామ, అల్లుళ్లు, వారికి తోడుగా వచ్చిన ఓ గైడ్ ఎదుర్కొన్న సవాళ్ల గాథ భలే ఉత్సుకతగా వుంటుంది. తెలంగాణలో వరంగల్ ఘనపురం దగ్గరి వైల్డ్ నల్లగుట్ట గుహల గురించి కూడా మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం కదా. భూమ్మీద, నీళ్ళమీద ఆకాశంలో పయనిస్తుంటే మనిషికి ఎలా వుంటుందో తరచుగా తెలుస్తూనే వుంటుంది కానీ భూమి కడుపులోకి వెలితే ఎలా వుంటుంది? అమ్మ కడుపులో పిల్లల లాగా అక్కడ కొత్త ప్రపంచం చూస్తూ ఆటలాడుకుంటే ఆ అనుభూతి ఎంత కొత్తగా వుంటుంది. అటువంటి అనుభూతికోసం ఒక దుస్సాద్య మైన సాహసం చేసి అందం వెనక వున్న అనుకోని ప్రమాదంలో చిక్కుకు పోయిన ముక్కుపచ్చలారని డజను మంది థాయ్ లాండ్ చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రులు ప్రపంచం ఈ వ్యాసం రాసే సమయానికి బయటపడటం ఎలా అనేదానిపై ఆందోళన పడుతున్నారు.
జూల్స్ వెర్స్ భూగర్భంలోకి సాహస యాత్ర (

చిట్టి చిన్నారులకు గట్టి ఆపద

పన్నెండు మంది చిట్టి చిట్టి పిల్లలు అంటే కేవలం 11 నుంచి 16 సంవత్సారాల లోపు వాళ్లు ఒక సాకర్ టీం, వీళ్ల కోచ్ కూడా చిన్నవాడే కొత్తగా ఓటుహక్కు వచ్చింది కేవలం 25 ఏళ్ళ వయసు. టీం పేరు మూపా(Moo Pa) అంటే వాళ్ళ భాషలో అడవి ఎలుగుబంటి. పేరుకు తగ్గట్లే వీళ్ళకు ఆటతో పాటు సాహస కృత్యాలు చేయడం అంటే అమితాసక్తి.  అదే వీళ్ళని అనుకోకుండా ప్రమాదంలోకి నెట్టేసింది. పోయిన్నెల అంటే జూన్ 23వ తారీఖున శనివారమే కదా. మంచి అడ్వెంచర్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళకి దగ్గర్లోని నంగనాన్ గుహ లోకి వెళదాం అనుకున్నారు. గుహంటే గుహకాదు మరో లోకపు ప్రయాణం అది. ముందుగా క్రిందకి దిగితే అందరు టూరిస్టులకు కనిపించినట్లే లైట్లు దానిమధ్య కొన్ని విగ్రహాలు, గుహ అందాలు కనిపిస్తాయి. కానీ ఇంకా లోపటికి వుంది మరింత థ్రిల్ కూడా వుంది. దాన్ని వెంటాడాలని నిర్ణయించుకున్నారు వీళ్ళు. చీకటిగా ఇరుకుగా కొన్నిచోట్ల, విశాలమై పైనుంచి రాతి రంధ్రాల చిమ్నీ వెలుతురులు మరికొన్ని చోట్ల, దారిలో పారుతుంటే పిల్లకాలువలు, నీటిగుంటలు, అంతేకాదు సముద్రంలాంటి సరస్సు ఒడ్డున రాతి నేల పరుచుకున్న చక్కటి బీచ్ కూడా ఇదే గుహలో వుంది దాన్ని పట్టాయ బీచ్ అంటారు. కాకపోతే మామూలు కంటే చాలా చాలా లోపటికి వెళితేనే అది కనిపిస్తుంది. ఈ లోపటి ప్రపంచాన్ని చుట్టెయ్యాల్సిందే అనుకున్నారు వీళ్ళు బహుశా అమ్మానాన్నలు ఇటువంటి దుష్కర సాహసాలకు అనుమతించరని ముందే అర్ధంచేసుకున్నారో ఏమో ఇళ్ళలో చెప్పకుండానే సాకర్ ప్రాక్టీస్ అయిపోగానే సైకిళ్లు వేసుకుని ఈ బుడింగీలంగా లీడర్ కుర్రాడితో కలిసి గుహవైపు బయలుదేరారు. దొరికినంతలో కొన్ని చార్జింగ్ లైట్లు, కొంచెం ఆహారం తోచినంత రక్షణ చర్యలతో అన్నితమకు అర్ధం అయిపోయాయి అన్నంత నిబ్బరంగా లోపటికి దిగారు. కొంత సేపటి తర్వాత సైకిళ్ళు తీసుకువెళ్ళడం కుదర్లేదు నడవటం ప్రారంభించారు. ఒకరికి ఒకరు ఉత్సాహం చెప్పుకుంటూ చీకటినీ, డొంకలనూ దాటుకుంటూ వెళ్లారు. కలుగులూ, ఇరుకులూ దాటుకున్నారు.

Saturday, 9 June 2018

*కాలా’ అనే ‘కరి కాలుడి’కి ఒక ఉత్తరం


కాలా ఈ ఉత్తరం నీకే...!
బాగున్నావా కాలా ? ఎందుకు బాగుండవులే ఎంతమంది నాలాంటి ప్రజలునిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు కదా, ఏదో చేస్తావని నిజంగా నమ్మి నీకోసం నిలబడుతున్నారు కదా అది చాలు నీ నవ్వుని అలాగే బ్రతికించడానికి. నాయకుడిగా నువ్వు వాళ్ళకి ఏం చేసావ్ గుండెలమీద చెయ్యేసుకుని మళ్ళీ ఒకసారి సీసాలో ద్రవం ఏదో తాగనప్పుడు ఆలోచించు సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. అసలే ఎన్నికల సమయం అణగారిన వెలివాడలను కేవలం ఓట్లుగా మాత్రమైనా చూడడం వల్లనే బ్రతికున్నాయి అనుకునే రోజుల్లో వాడకట్టు నాయకుడొకడు వెండితరమీద కనిపిస్తాడట అనగానే ఎంత ఆశపడ్డమో తెలుసా? నిజంగానే తరాలు తరాలుగా ఏళ్ళూ పూళ్ళుగా గూడుకట్టుకు పోయిన పెద్ద పెద్ద సమస్యల భారం దించుకునే పరిష్కారం ఏదన్నా చెపుతావనుకున్నాం. కానీ నువ్వు చేసించేదేమిటి? పా రంజితో  తో కటీఫ్ నేను మాట్లాడను కోపం వచ్చింది అందుకే ఈ ఉత్తరం నీకంటే నీకే. కుదిరితే కొన్ని ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వు కాలా ఎందుకంటే ఇదన్నా చేస్తావని ఆశపడుతున్నా. సరే కానీ కాలా అంటే ఒక రంగు కాదు. ఏం రంగూ లేని తనం కావాలంటే కాషాయ నిర్వచనం కాదు సివి రామన్ ని అడుగు.

ఒకటి......) నిన్ను వెన్నంటి వచ్చే వాడిని కాపాడాల్సిన అవసరం నీకు లేదనుకున్నావా?

Wednesday, 6 June 2018

వెండితెరపై అంతర్జాల అభిమన్యుడి గురించి

మీకు టచ్ ఫోన్ వుందా? ఎడా పెడా అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేసుకుంటూ హా నాకేమి అవుతుందిలే అనుకుంటున్నారా?

మీ బ్యాంక్ అకౌంట్ ఆన్ లైన్ లో ఆపరేట్ చేస్తున్నారా? అబ్బే నేను భద్రమే సుమీ అని మురిసిపోతున్నారా?

వాడెవడో నా ఆధార్ వివరాలు కొట్టేస్టే ఏం పోతుంది నా గోచీ అని చులకనగా తీసేస్తున్నారా?

 జూన్ 1న రిలీజ్ అయిన అభిమన్యుడు (తమిళంలో ఇరంబు తిరై )ఒక్కసారి చూడండి.

Monday, 16 April 2018

1857 తిరుగుబాటు కాలం నాటి అలంబేగ్ అనే వీరుడిత్యాగాన్ని కథగా చెప్తున్న సగం పుర్రె1857 తిరుగుబాటు కాలం నాటి అలంబేగ్ అనే వీరుడిత్యాగాన్ని కథగా చెప్తున్న సగం పుర్రె

అలంబేగ్ పుర్రె :  

1857 తిరుగుబాటు దారుని    

జీవన్మరణ వృత్తాంతం
పోయిన సంవత్సరం నవంబర్ లో ఒక పుస్తకం విడుదల అయ్యింది. అదికూడా మన దేశంలో కాదు రచయిత మన దేశం వాడు కూడా కాదు. కానీ విషయం మన దేశానికి సంభందించినదే. అప్పుడెప్పుడో సిపాయిల తిరుగుబాటు 1857 కాలం నాడు భ్రిటీష్ ఇండియాలో పనిచేసిన భారతీయ హవల్దార్ సైనికుడు అలంబేగ్ పుర్రె గురించి చాలా సంగతులు కాదు కాదు నిజాలను వెలికి తీస్తూ ఆ వీరసైనికుడికి కనీస గౌరవం దక్కాలంటే ఆ పుర్రెను ఇప్పటికైనా భారతదేశానికి పంపి అంత్యక్రియలు జరిగేలా చూడమని ఆ పుస్తక రచయిత కిమ్ వాగ్నర్ వాళ్ల దేశాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఎవరీ పరిశోధకుడు ?  కిమ్ వాగ్నర్ లండన్ లోని క్వీన్ మేరీ కళాశాలలో బ్రిటీష్ ఇంపీరియల్ చరిత్ర పాఠ్యాంశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. తన పాఠ్యాంశాలకు అదనంగా బ్రిటీష్ ఇంపిరియల్ భారతదేశంలో చేసిన ప్రస్థానం గురించి అప్పుడు జరిగిన వివిధ చారిత్రక సంఘటనల లోతుపాతులను గురించి అధ్యయనం కూడా చేస్తున్నారు.


పరిశోధన మధ్యలో చేరిన పుర్రె  : వాగ్నర్ పరిశోధనలు జరుగుతున్న నేపద్యంలోనే 2014 సంవత్సరంలో ఒకనాడు ఆయనకు ఒక మెయిల్ వచ్చింది. అది పంపింది ఒక Lord Clyde ( pub in the eastern English coastal town of Walmer in Kent ) అనే ఒక పబ్ ను కొత్తగా కొనుగోలు చేసిన జంట నుంచి వారి మెయిల్ సారాంశం ఏమిటంటే అయ్యా మా హోటల్ స్టోర్ రూం లో ఒక పుర్రె వుంది. మాకు దానిని ఏం చేయాలో తెలియట్లేదు మీరు చరిత్ర పరిశోధకులు కదా మీకు ఏమైనా ఉపయోగపడితే దాన్ని తీసుకెళ్ళండి అని. పైగా మరో విషయం కూడా చెప్పారు ఆ పుర్రె కంటి రంధ్రం లోపట చేతితో రాసిన ఒక కాగితం కూడా వుంది దానిలో ఏవో వివరాలు వున్నాయి అని చెప్పారు. వాగ్నర్ వెంటనే ఆ పుర్రెను పరిశీలించేందుకు వెళ్లాడు. చాలా పాత పుర్రె క్రింది దవడ మొత్తం ఎక్కడో పోయింది. పై దవడలోని కొన్ని పళ్ళు కూడా శిధిలం అయిపోయాయి.  మామూలుగా అయితే దానికేం ప్రత్యేకత ఉండేది కాదు. కానీ దాని కంటి రంధ్రంలో ఆ పుర్రెకు సంభందించిన కొన్ని వివరాలు రాయడం వల్ల అది కూడా చరిత్ర పరిశోధకుడికి దొరకటం వల్ల చరిత్రలో మరుగున పడిపోయిన అనేక నిజాలు హఠాత్తుగా వెలుగులోకి వచ్చాయి. ఆ చేతిరాతతో వున్న కాగితంలో ఇలా వుంది.

Saturday, 14 April 2018

కట్టా శ్రీనివాస్ || ప్రపంచానికి ఆఖరి ఘడియలు ||

తెగ బలిసిన ముల్లు
ఎగబడి ఎగబడి మరీ
పసిమొగ్గను గుచ్చుతోంది.
రాలిపోతున్న పసరుగాయకోసమే కాదు జనులారా
మనుగడే మిగలక కుదుళ్ళతో సహా మశానం అవ్వబోయే చెట్టుకోసం కూడా ఏడవండి.
ఏడవండి రక్తం కన్నీరై వచ్చేంత వరకు ఏడవండి.

అణుబాంబులు క్రిమి బాంబులు ప్రమాదమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకుంటున్న పెద్దలారా!!
ప్రపంచాన్ని ముంచేసే ఉపద్రవమై ప్రవహిస్తున్న టెస్టోస్టిరోన్ నియంత్రణ చర్యలేం చేశారురా?

కంచెలు కూడా చేలపై ఎగబడి గునపాలను దింపుతున్నాయి.
సమాజమే పాముగా మారి కళ్ళు మూసుకుపోయి స్వంత పిల్లల్ని గుటుక్కున మింగేస్తోంది.
ప్రళయం ఎక్కడినుంచి వస్తుందో అని పెద్ద పెద్ద దుర్భిణీలలో చూసే గుడ్డి నాయాల్లారా!
బయటికి కాదు ఒక్కసారి లోపటికి చూడండి.

గిరగిరా తిరుగుతున్న భూమి దారం పుటుక్కున తెగిపోయినట్లు
ఇన్నాళ్లు భద్రమని నిలబడ్డ కళ్ళక్రింద భూమి పూసుక్కున జరిపోయినట్లు తెల్లారాక కూడా ఒకటే పీడకలలు.
ఉరే సచ్చిపోయిన సిగ్మాన్డు ఫ్రాయిడు దీనికసలు అర్ధం చెప్పి బతికించరా సామీ.

వాడు నూరుకున్న కత్తి వాడి గొంతులోని దింపుకుంటున్నాడు శాడిజం అంటారే అది మసోకిజం. ఎక్కడో రెడ్ చిప్ ఆక్టివేట్ అయ్యింది సమాజం సెల్ఫ్ డిస్ట్రోయ్ దిశగా  పిచ్చిపట్టి పూనకం రేగినట్లు ఊగుతూ పరిగెడుతోంది.

ముగిస్తున్న వాక్యం చివర ముగింపులేని ఆలోచనలు ఊట చలమలై అలమటిస్తున్నాయి.
మిత్రమా బ్రేక్ లు రెగ్యులేటర్లు ఎక్కడున్నాయో చూడు అసలు తయారు చేసారో లేదో తెలుసుకో.
ఆ కనబడే అంచునుండి మొత్తం పడిపోకముందే ఆపగలమేమో ప్రయత్నం చేద్దాం.

తేది : 14-04-2018

Friday, 13 April 2018

దుమ్మురేపుతున్న రాయలసీమ జానపద గీతం గురించి మరికొన్ని విశేషాలుపాపులర్ మాధ్యమంలో జానపదాల జోరు ఈ మధ్య సంతోషాన్ని కలిగించే విషయం. రంగస్థలం సినిమాలో ఎంత చక్కంగున్నావే లచ్చిమి అంటూ లచ్చిమిని పొగిడినా ఎంతచక్కంగున్నావే గీతమా ఎంత హత్తుకున్నావే అంటూ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. అంతకు ముందు ఫిదాలో వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే అంటూ తెలంగాణా యాసను సంస్కృతినీ అందంగా చూపించిన పాటకు సాయి పల్లవీ డాన్స్త ప్రతిభ తోడయ్యింది. అప్పుడెప్పుడో విజయశాంతి లలూదరువాయే లస్కరు బోనాల్ పండ్గకు వస్తనని రాకపోతివే లసీకా పూలు గోరికి లబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి తుర్ర్..... అంటూ సాగిన గీతం కూడా గుర్తుండే వుంటుంది.
ఇకపోతే నిన్న కాక మొన్న విడుదల అయిన కృష్ణార్జున యుద్ద సినిమాలో అచ్చంగా రాయలసీమ జానపద బాణీని అచ్చంగా పరిచయం చేస్తూ సాగిన పాట దారి చూడు దుమ్ము చూడు అంటూ దుమ్ము దులిపేస్తోంది. @Penchanadas Putta రాసి పాడిన ఈ పాటకు హిప్ హాప్ థమిజ(ఆదిత్య) సంగీతం, నానీ డాన్స్ అండ్ యాక్షన్ లోని చక్కటి ఈజ్ కూడా మరింత ఆకర్షణ అయ్యింది.

Thursday, 1 March 2018

అంతమే ఆరంభం : ఆత్మాయిడ్ విధ్వంస సృష్టి - కట్టా శ్రీనివాస్మెలకువ వచ్చిందా? కావచ్చు కాకపోవచ్చు ఏయే జ్ఞానేంద్రియాలు తెలుస్తున్నాయి ఓహ్ స్పర్శకూడా తెలుస్తున్నట్లుంది. అంటే నాకు దేహం కూడా వచ్చేసిందన్నమాట. అయితే కళ్ళు తెరవొచ్చు. ప్రయత్నిస్తున్నాను. నిజమే చుట్టూ ఏదో తెలుస్తోంది. నాకు కూడా దేహం వుంది. అయితే ఇది నేను మనిషిగా బ్రతికున్నప్పటిది కాదు. కానీ మనిషి దేహమే ఏం వికటించిందో నీలం రంగులో వుంది పర్లేదులే. అయితే నా అవసరం ఇంకా వుందన్నమాట ఈ తరానికి నిద్రలాంటి స్విచ్ ఆఫ్ లోకి మారకముందు ఏం చెప్పారు వీళ్ళు సెక్స్ రోబోట్స్ వల్ల ఏర్పడుతున్న హ్యూమన్ నెట్ విధ్వంసాన్ని ఆపడం ఎలా అని కదా? నేనేం చెప్పాను. మొత్తంగా ఈ పద్దతినే ఆపేసి పాత విధానాన్ని పునరుద్దరించే విధానం చెపుతాను. నాకో దేహం ఇచ్చెయ్యండి అన్నాను కదా.
‘‘ యువర్ అటెన్షన్ డియర్ ఆత్మాయిడ్ వెల్ కమ్ టూ ద న్యూ వరల్డ్ మీకిప్పుడు దేహం వుంది. మీరు ఇండిపెండెంట్ గా ఆలోచించే శక్తికూడా అలాగే వుంచాం. మీనుంచి మాకు ఈ పరిష్కారం కావాలి.’’ అదే గొంతు వినిపిస్తున్న వైపు చూసాను. ఈ మెషిన్ ను మనిషి అనొచ్చా, శరీరం మరీ పాములా పాకుతూ వుంది.

Wednesday, 28 February 2018

కట్టా శ్రీనివాస్ || జయహో కవిత్వం ||

నువ్వొక పద్యాన్ని మరింత దగ్గరగా విశ్లేషించావంటే దాన్నిక నాశనం చేసినట్లే,

వేరొక పద్యాన్ని ఘాటుగా విమర్శించినా అదేమీ తన దారి మార్చుకోదు.

ఒకవేళ పద్యాన్ని దూరంనుంచే పరామర్శించాలనుకున్నావనుకో అది నీ నుండి మరింత దూరమై పోతుంది.

అణువణువూ విడగొట్టి చూడాలనుకున్నావా! ఎదురయ్యేదానికి ముందే సిద్ధపడిపో..

నీవు దాన్ని నిర్లక్ష్యం చేశావనుకో అది నిన్ను మరెవరికో వదిలేసిపోతుంది.

 పద్యం దగ్గరకు నీవుగా తిరిగొస్తే అది అర్థమై ఎదిగిపోతుంది.

ఒక పద్యాన్ని కంఠతా చేశావనుకో నీ పయనం ఎటో ఎరుకవుతుంది.

సరే ఇక ఆఖరుగా ఒక్కమాట
నీవు పద్యాన్నే అర్ధం చేసుకుందామనుకున్నావనుకో దాని పదజాలంలోకి అచ్చంగా దూకేసేయ్ సరిపోతుంది.

తేదీ: 02-02-2018

ఫేస్ బుక్

Tweets

లంకెలు